అధికంగా చెమట పడుతోందా? నిర్లక్ష్యం చేయకండి.. ఏ వ్యాధులకు సంకేతం తెలుసా?
చెమట పట్టడం సహజమే అయినప్పటికీ, అసాధారణంగా అధికంగా చెమట పడటం శరీరం ఇచ్చే హెచ్చరిక కావచ్చు. ముఖ్యంగా రాత్రిపూట చెమట, బరువు తగ్గడం, శ్వాస సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవాలి. సరైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం, తగిన జాగ్రత్తలతో ఈ సమస్యను నియంత్రించుకోవచ్చు..

చెమట పట్టడం అనేది మన శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియ. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు చెమట కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా వేసవి కాలంలో, వ్యాయామం చేసినప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు చెమట ఎక్కువగా పడుతుంది. అయితే ఎలాంటి శారీరక శ్రమ లేకపోయినా, చల్లటి వాతావరణంలో ఉన్నప్పటికీ కొందరికి అధికంగా చెమట పడుతుంటుంది. ఇలాంటి పరిస్థితిని తేలికగా తీసుకోవద్దని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక చెమట కారణంగా రోజువారీ పనులు, ఉద్యోగ బాధ్యతలు, సామాజిక జీవితం, ఆత్మవిశ్వాసం కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కొంతమందికి అరచేతులు, పాదాలు, ముఖం లేదా శరీరంలోని కొన్ని ప్రత్యేక భాగాల్లో మాత్రమే చెమట అధికంగా పడుతుంది. మరికొందరికి శరీరం మొత్తం చెమటతో తడిసిపోతుంది.
హైపర్‌హిడ్రోసిస్ అంటే ఏమిటి?
వైద్య పరిభాషలో అవసరమైన దానికంటే ఎక్కువగా చెమట పట్టడాన్ని “హైపర్‌హిడ్రోసిస్” (Hyperhidrosis) అంటారు. ఇది కొంతమందిలో జన్యుపరమైన కారణాల వల్ల ఏర్పడవచ్చు. మరికొందరిలో కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా ఈ పరిస్థితి కనిపించవచ్చు.
అధిక చెమటకు ప్రధాన కారణాలు
అధికంగా చెమట పట్టడానికి అనేక కారణాలు ఉంటాయి. అవేంటంటే..
- థైరాయిడ్ గ్రంథి సమస్యలు
- మధుమేహం (డయాబెటిస్)
- శరీరంలో ఇన్ఫెక్షన్లు
- హార్మోన్ల అసమతుల్యత
- అధిక బరువు
- నాడీ వ్యవస్థ సంబంధిత సమస్యలు
- కొన్ని మందుల దుష్ప్రభావాలు
- మానసిక ఒత్తిడి, ఆందోళన
కొన్ని అధ్యయనాల ప్రకారం విటమిన్ డి, మెగ్నీషియం లోపాలు ఉన్నవారిలో కూడా అధిక చెమట సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. అయితే విటమిన్ డి లోపమే దీనికి ప్రత్యక్ష కారణమని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.
ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు
అధిక చెమటతో పాటు ఈ లక్షణాలు కూడా కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
- ఆకస్మికంగా బరువు తగ్గడం
- నిరంతర బలహీనత
- గుండె వేగంగా కొట్టుకోవడం
- తలతిరగడం
- జ్వరం
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
- రాత్రిపూట అధికంగా చెమట పట్టడం
ఈ లక్షణాలు కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు సంకేతాలు కావచ్చని నిపుణులు చెబుతున్నారు.
సమస్యను ఎలా నియంత్రించాలి?
అధిక చెమట సమస్యను తగ్గించేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
- రోజూ తగినంత నీరు తాగాలి
- శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి
- తేలికైన, గాలి ఆడే దుస్తులు ధరించాలి
- ఎండలో ఎక్కువసేపు గడపకుండా చూడాలి
- సమతుల్య ఆహారం తీసుకోవాలి
- ఒత్తిడిని నియంత్రించుకోవాలి
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
అయితే తరచుగా అధికంగా చెమట పడుతూ ఉంటే స్వయంగా మందులు వాడకుండా వైద్యులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.




