Andhra Pradesh: ఏపీ రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. అప్పటికల్లా కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు..
సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. 2027 నాటికి రాష్ట్రంలోని ప్రతీఒక్క రైతుకు పట్టాదారు పాసు పుస్తకాలు అందిస్తామని స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో చంద్రబాబు ముచ్చటించారు. అనంతరం సభలో మాట్లాడారు.

ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం సిద్ధాంతంలో మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దివాకర శ్రీనివాసులు, నాగలక్ష్మి అనే రైతు కుటుంబంతో సీఎం మాట్లాడారు. దివాకర శ్రీనివాసులు, నాగలక్ష్మీతో కలిసి వారి పొలాన్ని పరిశీలించారు. గతంలో తమ భూమి ఇనాం భూమిగా నమోదైందన్న విషయం తమకు తెలియదని సీఎంకు దివాకర దంపతులు వివరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రీ సర్వే ప్రక్రియ ద్వారా సమస్య పరిష్కారమైందని ముఖ్యమంత్రికి తెలిపారు. అనంతరం మామిడిసెట్టి సాయి సుబ్రహ్మణ్యం అనే రైతుతో సీఎం ముఖాముఖి అయ్యారు. తన పౌల్ట్రీ వ్యాపారం గురించి సీఎంకు వివరించి రీ సర్వే ప్రక్రియ గురించి తన అభిప్రాయాన్ని సుబ్రహ్మణ్యం పంచుకున్నారు.
చంద్రబాబు కీలక సమావేశం
ఇక రీ సర్వేలో సమస్య పరిష్కారం పొందిన రైతులతో సీఎం సమావేశమయ్యారు. 2023లో ఇనాం ఖాతాలు ఫ్రీహోల్డ్ భూములుగా మార్చడంతో ఇబ్బందులు పడ్డామని రైతులు సీఎంకు వివరించారు. దీంతో వ్యవసాయ రుణాలు పొందడానికి, విక్రయాలు జరుపుకోవడానికి, రిజిస్ట్రేషన్‌కు తీవ్ర ఇబ్బందులు పడ్డామని రైతులు సీఎంతో చెప్పారు. రైతుల అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత సీఎం చంద్రబాబు పట్టాదారు పుస్తకాలు అందించి గ్రూప్ ఫోటో దిగారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ రైతుకు యాజమాన్య రికార్డులను నిర్ధారించే భూ రికార్డుల ప్రక్రియను 2027 నాటికి పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. డీఎస్సీ నియామకాల ద్వారా దాదాపు 16 వేల ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయబడ్డాయని, జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామన్న వాగ్దానాన్ని సంకీర్ణ ప్రభుత్వం నిలబెట్టుకుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ.. నిరుద్యోగ యువతకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భూమికి సంబంధించిన అవకతవకల ఆరోపణలను ప్రస్తావిస్తూ.. సుమారు రూ. 1,500 కోట్ల విలువైన లావాదేవీలకు సంబంధించి భారీ స్థాయిలో ఫోర్జరీ, రికార్డుల తారుమారు జరిగినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఆయన అన్నారు.
సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డ్స్
“ఆగస్టు 15లోగా సంజీవని డిజిటల్ హెల్త్ రికార్డ్స్ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నాం. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ఏపీఎస్‌ఆర్‌టీసీ బస్సులను ప్రవేశపెట్టనున్నాం. కోటి మంది పాల్గొనే యోగాంధ్ర కార్యక్రమాన్ని జూన్ 21న నిర్వహించనున్నాం. సుసంపన్నమైన, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన ఆంధ్రప్రదేశ్‌ను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యం” అని అన్నారు.
