Andhra Pradesh: పశ్చిమ తీరంలో అరుదైన తాబేళ్ల మృత్యుఘోష.. మనుషులపై కూడా ప్రభావం..?
వందకుపైగా తాబేళ్లు మృతిచెందాయి. చనిపోయిన తాబేళ్ల కళేబరాలను కనీసం ఖననం కూడా చేయడం లేదు. దీంతో వీటిని కుక్కలు, కాకులు పీక్కు తింటున్నాయని స్థానికులు తెలిపారు. ఇవి కుళ్లిపోయి కంపు కొడుతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నరసాపురం మండలంలోని పెదమైనవాని లంక తీరానికి ఐదు తాబేళ్ల కళేబరాలు కొట్టుకొచ్చాయి.

పశ్చిమ గోదావరి జిల్లా సముద్ర తీరంలో పదుల సంఖ్యలో అరుదైన తాబేళ్ల మృత కళేబరాలు కలకలం సృష్టిస్తున్నాయి. పీఎం లంక, పేరుపాలెం బీచ్‌లలో సంతానోత్పత్తికి తీరానికి వచ్చిన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి.ఇప్పటికే పేరుపాలెం తీరంలో మరణించిన తాబేళ్ల సంఖ్య 20 దాటింది. తాబేళ్ల మృతికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు. అందుకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
భూమిపై, సముద్రంలో జీవులకు రక్షణ లేకుండా పోతుంది. మానవ తప్పిదాలు, పెరుగుతున్న కాలుష్యంతో తీరంలో తాబేళ్ల మృత్యుఘోష వినిపిస్తోంది. సముద్ర తీరప్రాంతాల్లో గుడ్లు పెట్టేందుకు వస్తున్న తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. దీంతో వాటి కళేబరాలు తీరానికి నిత్యం కొట్టుకొస్తున్నాయి. గత కొద్దిరోజులుగా నిత్యం పదుల సంఖ్యలో ఆలివ్ రిడ్లే తాబేళ్ల కళేబరాలు పేరుపాలెం తీరానికి కొట్టుకురావడంతో మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 18 కిలోమీటర్ల మేర తీరప్రాంతం విస్తరించి ఉంది. ఏటా డిసెంబర్, జనవరి నెలల్లో తాబేళ్లు గుడ్లు పెట్టే సీజన్. ఈ సీజన్‌లో తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు తీరానికి వస్తుంటాయి. గుడ్లు పెట్టిన తరువాత తాబేళ్లు సముద్రంలోకి వెళ్లిపోతాయి. అయితే గత నెల రోజుల నుంచి తాబేళ్ల కళేబరాలు తీరానికి కొట్టుకొస్తున్నాయి. సుమారు 20 కిలోల పైనే ఒక్కో తాబేలు ఉంటుంది. అంటే ఎంత పెద్ద తాబేలో ఇట్టే అర్థమవుతోంది. ఇలా 18 కిలోమీటర్ల మేర విస్తరించిన తీరానికి నిత్యం ఐదు నుంచి పది వరకు తాబేళ్ల కళేబరాలు కొట్టుకొస్తున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు.
ఇటీవల వందకుపైగా తాబేళ్లు మృతిచెందాయి. చనిపోయిన తాబేళ్ల కళేబరాలను కనీసం ఖననం కూడా చేయడం లేదు. దీంతో వీటిని కుక్కలు, కాకులు పీక్కు తింటున్నాయని స్థానికులు తెలిపారు. ఇవి కుళ్లిపోయి కంపు కొడుతున్నాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నరసాపురం మండలంలోని పెదమైనవాని లంక తీరానికి ఐదు తాబేళ్ల కళేబరాలు కొట్టుకొచ్చాయి. ఇలా పేరుపాలెం బీచ్ కు పదుల సంఖ్యలో తాబేళ్ల మృతదేహాలు కొట్టుకుంటున్నాయి. విచ్చలవిడిగా పరిశ్రమలు, హేచరీల నుంచి సముద్రంలోకి వ్యర్థాలను వదిలేయడంతో తాబేళ్లు మృతిచెందుతున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు.
మరోవైపు టేకు వలలకు చిక్కుకొని, పెద్ద బోట్లకు తగలడం వల్ల ఇవి మృత్యువాత పడుతున్నాయని స్థానికులు అంటున్నారు. గత కొద్దిరోజులుగా నిత్యం పదుల సంఖ్యలో భారీ సరీసృపాలు మృతిచెందడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సంక్రాంతి తర్వాత ట్రాలర్లు పూర్తి స్థాయిలో చేపలు పట్టడం ప్రారంభించడం, నిబంధనలు ఉల్లంఘిస్తూ 5 నాటికల్ మైళ్ల పరిధిలో వేటాడటమే తాబేళ్ల మృతికి కారణమని అంటున్నారు. మొత్తానికి అంతరించిపోతున్న తాబేళ్లను ప్రభుత్వం చర్యలు తీసుకుని రక్షించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
