ఎక్కడా లేదు మన దగ్గరే.. పుష్పగిరిలో అరుదైన కుడ్య శిల్పం.. అంత స్పెషల్ ఏంటంటే..
సాధారణంగా భగవద్గీతకు సంబంధించి శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న ఏ విగ్రహం అయినా కృష్ణుడు నిలబడి అర్జునుడు కూర్చొని ఉన్న విగ్రహాలే దర్శనమిస్తాయి. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే కుడ్య శిల్పంలో మాత్రం శ్రీకృష్ణుడు కూర్చుని అర్జునుడు నిలబడి ఉన్నప్పుడు.. అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేస్తున్న సన్నివేశం కనబడుతుంది. ఇది చాలా అరుదుగా కనిపించే శిల్పం ఏపీలో ఆకట్టుకుంటోంది.

కడప జిల్లాలో అత్యంత ప్రసిద్ధి గాంచిన దక్షిణ కాశీగా పిలవబడే పంచనదీ క్షేత్రమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ గోడపై ఈ అరుదైన శిల్పం వెలుగు చూసింది. శ్రీకృష్ణుడు కూర్చుని నిలబడి ఉన్న అర్జునుడికి గీతోపదేశం చేస్తున్న అరుదైన కుడ్య శిల్పం అది.. గీతోపదేశం చేసే సమయంలో సాధారణంగా శ్రీకృష్ణుడు నిలుచుని, అర్జునుడు కూర్చుని ఉపదేశం చేస్తాడు. కానీ ఇక్కడ భిన్నంగా శ్రీకృష్ణుడు కూర్చుని, అర్జునుడు నిలబడి ఉండటం చాలా అరుదైన విషయమని ఆలయ పురాణం చెబుతుంది. విశ్వరూప సందర్శనానికి ముందు ఘట్టాన్ని ఆనాటి శిల్పులు ఎక్కడా లేని విధంగా చెక్కారు. కురుక్షేత్ర యుద్ధం చేయటానికి అర్జునుడు సంకోచిస్తున్న సందర్బంగా శ్రీకృష్ణుడు అర్జునునికి తన కర్తవ్యాన్ని నిర్వర్తించమని చెప్పటం, భగవంతునిపై భారం వేసి ధర్మం కోసం పోరాడమని చెప్పే సన్నివేశమది.. గీతోపదేశం భారతంలో ఆధ్యాత్మిక, సంస్కృతికతపా లోతైన ప్రభావాన్ని చూపిస్తుంది.
ఈ కుడ్య శిల్పంలో శ్రీకృష్ణ పరమాత్ముడు కుడి కాలు మడిచి ఎడమ కాలు ప్రక్కకు వంచినట్లుగా ఈ శిల్పంలో కనిపిస్తుంది. అలాగే ఎడమ కింది చేతిని వయ్యారంగా వంచిపెట్టి చాలా లలితంగా, సుఖంగా కూర్చున్న భంగిమలోనిది. అలానే శ్రీకృష్ణుని కుడి వైపు పై చేతిలో చక్రం, క్రింది చేతిని అర్జునుని వైపునకు చూపిస్తున్నట్లుగా ఉంది. ఎడమవైపుపై చేతిలో శంఖాన్ని పట్టుకొని ముఖాన్ని అర్జునిని వైపుకు చూస్తున్నట్లుగా ఉంది.. తలపై కిరీటమకుటం, ఎడమ చేతికి కేయూరం, ఉదర బంధం, యజ్ఞోపవీతం, చెవులకు ప్రతిరాగ దేవత అనే చేప ఆకారపు కుండలాలు ఈ శిల్పంలో కనిపిస్తాయి, పట్టు వస్త్రాలను నడుం నుంచి పిక్కల వరకు ధరించినట్లు ఆనాటి శిల్పులు చిత్రీకరించారు.
అర్జునుడు శ్రీకృష్ణుని ఎడమ చేతి వైపు నిలుచుని ఎడమ చేతిలో ధనుస్సుని పట్టుకుని రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నట్లు ఈ విగ్రహంలో కనిపిస్తుంది. తలపై కిరీటమకుటం, ఉదరబంధం, యజ్ఞోపవీతం, చెవులకు పొడువాటి కుండలాలు, నడుం నుంచి పిక్కల వరకు పట్టు వస్త్రాలను ధరించిన ఆసన్నివేశాన్ని ఆద్యంతం కళ్ళకు కట్టినట్టుగా శిల్పులు చెక్కారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
