AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ranjith on Wheels: రంజిత్ ఆన్ వీల్స్ యూట్యూబ్ నుంచి నెలకు ఎంత సంపాదిస్తున్నాడంటే..?

రంజిత్ ఆన్ వీల్స్ తన యూట్యూబ్ ఆదాయం, ఫైనాన్సియల్ మేనేజ్‌మెంట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన సోదరి వివాహం కోసం కుటుంబ ఫ్లాట్‌ను అమ్మినట్లు తెలిపారు. నెలవారీ యూట్యూబ్ ఆదాయం లక్ష రూపాయలు ఉన్నప్పటికీ, ప్రయాణాలకు, సైకిల్, పరికరాలకు చాలా ఖర్చవుతుందని, దీనంతటికీ తన ప్యాషన్ కారణమని వివరించారు.

Ranjith on Wheels: రంజిత్ ఆన్ వీల్స్ యూట్యూబ్ నుంచి నెలకు ఎంత సంపాదిస్తున్నాడంటే..?
Ranjith On Wheels
Ram Naramaneni
|

Updated on: Jan 08, 2026 | 5:47 PM

Share

యూట్యూబ్ సంచలనం రంజిత్ ఆన్ వీల్స్ గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, ఆర్థిక వ్యవహారాలు, తన ప్రయాణాలపై గల అభిరుచి గురించి వివరించారు. ఆయన ప్రస్తుతం వరంగల్‌లో నివసిస్తున్న తన కుటుంబం గురించి ప్రస్తావించారు. గత ఏడాది మార్చి 2న తన సోదరి వివాహం జరిగిందని, కుటుంబ బాధ్యతలు ఎప్పటికీ తీరవని పేర్కొన్నారు. రంజిత్ తన తండ్రి మరణానంతరం ఏర్పడిన ఆర్థిక పరిస్థితిని వివరించారు. అప్పుడు పీఎంజేజేవై కింద రెండు లక్షలు, ఎల్ఐసీ నుంచి నాలుగు లక్షలు.. ఇలా మొత్తం కలిపి వచ్చిన సుమారు 12 లక్షల రూపాయలతో ఒక ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. తండ్రి జ్ఞాపకార్థం తీసుకున్న ఈ ఫ్లాట్‌ను, సోదరి వివాహ ఖర్చుల నిమిత్తం సుమారు 17 లక్షలకు విక్రయించినట్లు చెప్పారు. ఈ నిర్ణయం కుటుంబ అవసరాలను తీర్చడానికే అని స్పష్టం చేశారు.

రంజిత్ తన యూట్యూబ్ ఆదాయం గురించి మాట్లాడుతూ, ప్రస్తుతం నెలవారీ ఒక లక్ష రూపాయలు వస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, గత నాలుగు సంవత్సరాలలో తన మొత్తం యూట్యూబ్ ఆదాయం 11 లక్షల రూపాయలు మాత్రమే అని వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అరుదుగా ప్రమోషన్లు చేస్తానని, వాటి ద్వారా 10 వేల నుంచి 20 వేల వరకు వస్తుందని, గత నాలుగు సంవత్సరాలలో మొత్తం రెండు నుంచి మూడు లక్షల వరకు సంపాదించి ఉండవచ్చని అంచనా వేశారు. ఒక సందర్భంలో ఆరు నెలలకు కలిపి 80 వేల రూపాయలు వచ్చినట్లు కూడా గుర్తు చేసుకున్నారు.

రంజిత్ తన ప్రయాణాల పట్ల ఉన్న తీవ్రమైన ప్యాషన్‌ను బలంగా చెప్పారు. గత రైడ్‌లకు సుమారు 40 లక్షల రూపాయల వరకు ఖర్చయిందని వెల్లడించాడు. జపాన్ వంటి దేశాలలో ఒక రోజు హోటల్ బసకు ఐదు నుంచి ఆరు వేల రూపాయలు, కనీసం మూడు నుంచి నాలుగు వేలు ఖర్చవుతుందని వివరించారు. ఆహారం, వీసాలు, విమాన ప్రయాణాలు వంటి అనేక ఖర్చులు ఉంటాయని చెప్పారు. అయితే, తన ప్రయాణాలలో ఆస్ట్రేలియా (గ్రేట్ ఓషన్ రోడ్ నుంచి బ్రిస్బేన్ వరకు 3000 కిలోమీటర్లు సైకిల్ తొక్కినప్పుడు) వంటి చోట్ల వేలాది మంది స్థానికులు, భారతీయులు తనకు డబ్బు, ఆహారం, ఆశ్రయం, బస వంటి సహాయం అందించారని కృతజ్ఞతగా గుర్తు చేసుకున్నారు. ఇది తనకు ఎంతగానో తోడ్పడిందని పేర్కొన్నారు.

తన ప్రయాణాలకు ఉపయోగించే పరికరాల ఖర్చులను రంజిత్ వివరించారు. ఆయన సైకిల్ ధర 2.5 లక్షల రూపాయలు. దానితో పాటు కెమెరాలు, డ్రోన్, ఐప్యాడ్, గోప్రో, ఇన్‌స్టా 360, హార్డ్ డిస్కులు, డ్రైవ్‌లు, ఇతర కిట్‌లు, ప్యానయర్ బ్యాగులు వంటివి కలిపి సుమారు 10 నుండి 15 లక్షల రూపాయల విలువైనవి ఉంటాయని తెలిపారు. కేవలం టెంట్ 50,000 రూపాయలు, సైకిల్ సీట్ 18,000 రూపాయలు అని పేర్కొన్నారు. ఈ ఖరీదైన సైకిల్, పరికరాల వల్లే వేల కిలోమీటర్ల ప్రయాణం సాధ్యమవుతుందని అన్నారు. ఇదంతా తన ప్యాషన్ కోసమే అని ఆయన పునరుద్ఘాటించారు.