Snake Video: వామ్మో.. బుస కొడుతూ రక్తపింజర ఎంత వేగంగా వెళ్తుందో చూడండి…
రస్సెల్స్ వైపర్, స్థానికంగా పొడపాము లేదా రక్తపింజర అని పిలువబడే ఈ విషపూరిత పాము భారతదేశంలో సాధారణంగా కనిపిస్తుంది. ఇది దాదాపు ఆరు అడుగుల పొడవు వరకు పెరిగి, నలుపు-గోధుమ వర్ణపు మచ్చలతో ఉంటుంది. దీని కాటు ప్రాణాంతకం, నిమిషాల్లో తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఎలుకలు, చుంచులు ఎక్కువగా ఉండే చోట ఈ పాములు ఎక్కువగా కనిపిస్తాయి.

భారతదేశంలో కనిపించే అత్యంత విషపూరితమైన పాములలో రస్సెల్స్ వైపర్ ఒకటి. దీనిని స్థానికంగా రక్తపింజర లేదా పొడపాము అని కూడా పిలుస్తారు. ఈ పాము భారత ఉపఖండంలో విస్తృతంగా వ్యాపించి ఉంది. ఇది నలుపు, గోధుమ వర్ణపు మచ్చలతో కూడిన శరీరాన్ని కలిగి ఉంటుంది. రస్సెల్స్ వైపర్ 5.5 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది, దాని శరీరం గణనీయంగా లావుగా ఉంటుంది. చూడడానికి కొండచిలువను పోలి ఉంటుంది. రస్సెల్స్ వైపర్ కాటు చాలా ప్రాణాంతకం. ఈ పాము కాటు వల్ల అంతర్గత రక్త స్రావం ఎక్కువై ప్రాణాపాయం సంభవిస్తుంది. ఒక వ్యక్తిని కాటు వేసినట్లయితే.. వెంటనే యాంటీ వెనం ఇంజెక్షన్ తీసుకోవాలి. లేటు అయిందంటే ప్రాణానికే అపాయం. కాటు వేసిన పదిహేను నిమిషాల్లోనే శరీరం చలనం కోల్పోతుంది. దీని విషం రక్తాన్ని గడ్డకట్టించి, చర్మాన్ని కరిగించి, రక్త కణాలను నిర్వీర్యం చేస్తుంది. ఈ ప్రభావాలు చాలా వేగంగా ఉంటాయి.
ఈ పాములు ఎక్కువగా పంట పొలాల్లో, అటవీ ప్రాంతాల్లో, మైదాన ప్రాంతాల్లో జీవిస్తాయి. ముఖ్యంగా వరి పొలాలు వంటి వ్యవసాయ భూములలో ఇవి తరచుగా కనిపిస్తాయి. దీని కారణంగా భారతదేశంలో చాలా మంది రైతులు పాముకాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. రస్సెల్స్ వైపర్ సాధారణంగా నెమ్మదిగా, దర్జాగా కదులుతుంది. కదిలినా పెద్దగా చప్పుడు చేయదు, నిశ్శబ్దంగా ఉంటుంది. అయితే, దానికి ప్రమాదం అనిపించినప్పుడు లేదా ప్రాణాపాయం ఎదురైనప్పుడు అది అత్యంత వేగంగా పరిగెత్తగలదు. నాగుపాము వలె బుస కొడుతుంది. బుస కొట్టేటప్పుడు పుస్ పుస్ మని చాలా పెద్ద శబ్దం వస్తుంది. ఎదుటి జీవుల్ని హెచ్చరించడానికి, భయపెట్టడానికి అలా చేస్తుంది. రస్సెల్స్ వైపర్ గుడ్లు పెట్టదు. నేరుగా పిల్లలను ప్రసవిస్తుంది. ఒకసారి ఇది 10 నుండి 50 పిల్లల వరకు జన్మనిస్తుంది. పిల్ల పాములు కూడా చాలా వేగంగా పెరుగుతాయి. చిన్నప్పటి నుంచే చాలా చురుగ్గా వేటాడుతూ ఉంటాయి. ఈ పాము పట్ల అవగాహన, తగిన జాగ్రత్తలు తీసుకోవడం ప్రాణాలను కాపాడుకోవడానికి అత్యవసరం. ఒక్క కాటులో ఇది పంపే విషం 16 మందిని చంపగలదట.




