వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని అభినందించిన వెంకయ్యనాయుడు.. కామర్స్ స్టాండింగ్ కమిటీ పనితీరుపై ప్రశంసలు..
విజయసాయిరెడ్డి నేతృత్వంలోని పార్లమెంటరీ సంఘం కామర్స్ స్టాండింగ్ కమిటీ ఏడాది కాలంలో అత్యత్తమ పని తీరును కనబరిచింది.
Venkaiah appreciation to vijaya sai reddy : ఎంపీల నేతృత్వంలోని వివిధ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల పనితీరుని ఎప్పటికప్పుడు మదింపు చేస్తుంటారు. అలా పనితీరు బేరీజు వేసిన సందర్భంలో ఈ ఏడాది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆయన నేతృత్వంలోని కామర్స్ స్టాండింగ్ కమిటీ పనితీరు అత్యంత మెరుగైన పనితీరు కనబర్చిందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రశంసలు గుప్పించారు.
విజయసాయిరెడ్డి నేతృత్వంలోని పార్లమెంటరీ సంఘం కామర్స్ స్టాండింగ్ కమిటీ ఏడాది కాలంలో అత్యత్తమ పని తీరును ప్రదర్శించినట్లు రాజ్యసభ వర్గాలు చెబుతున్నాయి. కామర్స్ స్టాండింగ్ కమిటీ గత మూడేళ్ళ పనితీరుతో పోల్చుకుంటే 2020-21 సంవత్సరంలో సమావేశాల సంఖ్య, పని గంటలు, సభ్యుల హాజరు విషయంలో అత్యధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ కామర్స్ స్టాండింగ్ కమిటీ సమావేశమైనట్లు రాజ్యసభ వెంకయ్యనాయుడు కొనియాడారు.
కామర్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా విజయసాయి రెడ్డి 2019లో తొలిసారిగా నియమితులయ్యారు. తిరిగి గత సెప్టెంబర్‌లో రెండో దఫా ఆయననే కమిటీ చైర్మన్‌గా నియమించారు. 2017-18 లో 20 దఫాలు కామర్స్ స్టాండింగ్ కమిటీ సమావేశమైంది. 2018-19లో 6 దఫాలు, 2019-20లో 15 దఫాలు కమిటీ సమావేశమైంది. కొవిడ్ ఉన్నా కూడా ఈ ఏడాది 10 దఫాలు సమావేశం కావడం విశేషం.
కోవిడ్ కారణంగా ఈ ఏడాది ఏప్రిల్-జూలై మధ్య కాలంలో నాలుగు నెలలపాటు అనేక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. కామర్స్ కమిటీ మాత్రం గత జూలై నుంచి ఇప్పటి వరకు 10 దఫాలు సమావేశమైంది. 2017-18 మధ్య కాలంలో కామర్స్ కమిటీ 20 దఫాలు సమావేశమై 32 గంటల 48 నిమిషాలపాటు చర్చలు, సంప్రదింపులు జరిపింది. విజయసాయి రెడ్డి నేతృత్వంలోని కామర్స్ కమిటీ కేవలం 10 దఫాల సమావేశాల్లోనే 26 గంటల 18 నిమిషాల పాటు కామర్స్ స్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. అయితే గతేది కూడా 15 దఫాల సమావేశాలలోనే 32 గంటల 13 నిమిషాలపాటు సంప్రదింపులు జరిపిందని రాజ్యసభ వర్గాలు వెల్లడించాయి. సగటున రెండు గంటల 37 నిమిషాల పాటు ఈ కమిటీ సమావేశాలు కొనసాగినట్లు వెల్లడించారు. అంతకు ముందు కేవలం గంట నలభై రెండు నిమిషాల పాటు మాత్రమే సమావేశాలు జరిగాయి.
అలాగే, విజయసాయిరెడ్డి నేతృత్వంలోని కమిటీ అత్యధికంగా 5 నివేదికలను ప్రభుత్వానికి సమర్పించింది. గడిచిన రెండేళ్ళలో కమిటీలు కేవలం 3, 4 నివేదికలను మాత్రమే సమర్పించడం విశేషం. మొత్తమ్మీద కామర్స్ స్టాండింగ్ కమిటీ పనితీరుపై రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. విజయసాయి రెడ్డి నేతృత్వానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.