AP News: డెడ్ బాడీతో నడ్డిరోడ్డుపై ఆందోళన.. ఇంతకీ అసలేం జరిగిందంటే..?
ఖబరిస్తాన్‌కు స్థలం కేటాయించాలని ముస్లింలు ఆందోళన చేపట్టారు అది కూడా విన్నూత్నంగా నిరసన చేపట్టారు. మృతదేహంతో నిరసన చేపట్టారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసా? ఏం జరిగిందో తెలుసా?
అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట గ్రామంలో నెక్కంటి కాలనీకి చెందిన ముస్లింలు మృతి చెందిన వారి అంత్యక్రియలు నిర్వహించేందుకు బరియల్ గ్రౌండ్ లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో మీరాబీ అనే మహిళ మృతి చెందింది. దీంతో గ్రామానికి చెందిన ముస్లింలు స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మృతదేహంతో నిరసనకు దిగారు. ఎన్నో ఏళ్ళుగా తాము ఇక్కడే నివాసం ఉంటున్నా ఖబరిస్థాన్‌కు అవసరమైన స్థలం లేకపోవడంతో ఎవరైనా మరణిస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నామన్నారు. 2022లో స్థానిక నెక్కంటి కాలనీలో ఐదు సెంట్ల స్థలం కేటాయించినా తమకు అప్పగించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో ఎవరైనా మరణిస్తే రావులపాలెం, వెదిరేశ్వరం తదితర గ్రామాల్లో అంత్యక్రియలు చేస్తున్నామని తెలిపారు. అయితే గ్రామాల్లో కూడా సరిపడా స్థలం లేకపోవడంతో తమ గ్రామానికి చెందిన వారి అంత్యక్రియలకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని, దీంతో గత్యంతరం లేక ఆందోళన చేపట్టామని తెలిపారు. దీంతో రావులపాలెం సీఐ శేఖర్ బాబు, ఎస్సై చంటి, డిప్యూటీ తహశీల్దార్ శ్రీనివాస్, గ్రామ పెద్దలు యర్రంశెట్టి నాగేశ్వరరావు (బుజ్జి), మాసాబత్తుల ఆనందరావు, ఉప సర్పంచ్ ఏనుగుపల్లి నాగార్జున, పంచాయతీ అధికారులు స్థానిక పంచాయతీ కార్యాలయంలో ముస్లిం సంఘ పెద్దలతో చర్చలు జరిపారు. బరియల్ గ్రౌండ్‌కు ఐదు సెంట్ల స్థలం అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.