Presidential Election 2022: ద్రౌపది ముర్ముకే మా ఓటు.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ప్రకటించిన వైసీపీ
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు ఏపీలోని అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ గురువారం రాత్రి ప్రకటించింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమం అంటూ వైసీపీ పేర్కొంది.
Draupadi Murmu – YSRCP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తున్నట్టు ఏపీలోని అధికార పార్టీ వైఎస్ఆర్‌సీపీ గురువారం రాత్రి ప్రకటించింది. స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారిగా గిరిజన మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమం అంటూ వైసీపీ పేర్కొంది. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలిస్తే.. ఈ స్థానాన్ని దక్కించుకున్న మొదటి గిరిజన మహిళగా చరిత్రలో నిలిచిపోతారని తెలిపింది. గడిచిన మూడేళ్లుగా సామాజిక న్యాయంలో దేశంలోనే పెద్ద పీట వేస్తున్న పార్టీగా.. ద్రౌపది ముర్ముకే మద్దతు తెలుపుతున్నట్టు వైఎస్ఆర్‌సీపీ పేర్కొంది.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ప్రాతినిధ్యానికి తమ పార్టీ ఎప్పటి నుంచో ప్రాధాన్యత ఇస్తుందని పార్టీ తెలిపింది. గత మూడేళ్లలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్ని వర్గాల అభ్యున్నతికి ఎంతో ప్రాధాన్యతనిచ్చారని, కేబినెట్‌లో వారికి మంచి ప్రాతినిథ్యం కల్పించారని, 70 శాతం మంది వారే ఉండేలా చూశారని పేర్కొంది. కేబినెట్ సమావేశం కారణంగా శుక్రవారం ముర్ము నామినేషన్ దాఖలుకు ముఖ్యమంత్రి హాజరు కావడం లేదని వైఎస్సార్‌సీపీ తెలిపింది. అయితే రాజ్యసభా పక్షనేత ఎంపీ విజయసాయి రెడ్డి, లోక్‌సభాపక్ష నేత ఎంపీ మిధున్‌రెడ్డి హాజరవుతున్నట్లు వైసీపీ వెల్లడించింది.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈరోజు రాష్ట్రపతి పదవికి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ముర్ము (Draupadi Murmu) నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు సీనియర్ బీజేపీ నేతలు, పలు పార్టీల నేతలు హాజరుకానున్నారు. రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జూలై 18న, కౌంటింగ్ 21న జరగనుంది.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..