AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: అమ్మాయి వరుడిగా, అబ్బాయి వధువుగా… వింత ఆచారం… ఎక్కడంటే.

ప్రకాశం జిల్లాలో శతాబ్దాల నాటి విశేష ఆచారాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక్కడ కొన్ని గ్రామాల్లో పూజల సమయంలో పురుషులు ఆడవారి వేషాల్లోకి, మహిళలు మగవారి వేషాల్లోకి మారడం ప్రత్యేక సంప్రదాయంగా ఉంది. యర్రగొండపాలెం మండలంలోని కొలుకుల గ్రామంలో అయితే వధూవరులు కూడా పెళ్లికి ముందే ఒకరోజు పాటు పాత్రలు మార్చుకుని తమ ఇష్టదైవానికి పూజలు చేస్తారు. వధువు వరుడిలా, వరుడు వధువులా అలంకరించుకుని ఊరేగింపు జరిపే ఈ ఆచారం తరతరాలుగా కొనసాగుతోంది.

Andhra: అమ్మాయి వరుడిగా, అబ్బాయి వధువుగా... వింత ఆచారం... ఎక్కడంటే.
Gender Role Reversal Ritual
Fairoz Baig
| Edited By: Ram Naramaneni|

Updated on: Nov 28, 2025 | 7:42 PM

Share

అక్కడ పురుషులు ఆడవాళ్లు అవుతారు. మహిళలు పురుషులైపోతారు. అందరూ కలసి ఆడతారు.. పాడతారు… విందు వినోదాల్లో మునిగిపోతారు. ఇదంతా విని ఇదేదో జంబలకడి పంబ ఉందనుకుంటే పొరపాటే… ఇదంతా కొద్దిసేపు మాత్రమే… తమ ఇష్ట దైవాన్ని కొలుచుకునే సమయంలో ఇలా వారు వీరు, వీరు వారవుతారు. ప్రకాశం జిల్లాలో కొన్ని గ్రామాల్లో జరిగే వింత ఆచారాలు ఇవి. పెళ్ళయిన వాళ్లు, కాని వాళ్లు.. ఇలా తమ రూపాలు మార్చుకుని మగ ఆడగా, ఆగ మగగా వ్యవహరిస్తూ తమ ఇంటి దైవాన్ని కొలిస్తే అంతా మంచే జరుగుతుందని భావిస్తారు. కొన్ని గ్రామాల్లో ఇది ఆచారంగా కొనసాగుతోంది. మరికొన్ని సామాజికవర్గాల్లో పెళ్లిళ్లు చేసుకునే సమయంలో వధువు పురుషుడిగా, వరుడు స్త్రీగా అలంకరించుకుని పూజలు చేసిన అనంతరం తిరిగి సాధారణ దుస్తుల్లోకి మారి పెళ్లిళ్లు చేసుకుంటారు. ఆసక్తికరంగా ఉన్న ఆ చిత్ర విచిత్ర ఆచారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

వధువు వరుడిగా, వరుడు వధువుగా…

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం కొలుకులలో ఇదో వింత ఆచారం… ఇక్కడ వివాహాల్లో విచిత్ర పద్దతిని పాటిస్తారు. కొలుకుల గ్రామానికి చెందిన బత్తుల శివ గంగురాజు, నందినిలకు వివాహం కుదిరింది… ఇద్దరికీ వివాహం చేసేందుకు పెద్దలు నిర్ణయించారు. అయితే వివాహానికి ముందు తమ కుటుంబాల్లో ఓ తంతును నిర్వాహించాల్సి ఉంటుంది… వధువు వరుడిగా, వరుడు వధువుగా అలంకరించుకుంటారు… తమ బంధుమిత్రులు, గ్రామస్తులతో కలిసి ఊరేగింపుగా వెళ్లి తమ ఇష్ట దైవానికి పూజలు చేస్తారు. అనంతరం యధావిధిగా మామూలుగానే పెళ్లి తంతును ముగిస్తారు. తమ కుటుంబాల్లో ఈ ఆచారం ఎప్పటి నుంచో వస్తోందని, ఆధునిక కాలంలో కూడా వీటిని కొనసాగిస్తున్నామని బత్తుల వంశీయులు చెబుతున్నారు.

పెళ్లయినవాళ్లు ఇలా చేస్తే మంచి జరుగుతుందట…

మరోవైపు నాగులుప్పలపాడులో మూడేళ్లకొకసారి జరుపుకునే అంకమ్మ తల్లి జాతరలో పెళ్లయిన ఆడవాళ్లు మగవారిగా, మగవాళ్లు ఆడవారిగా వేషధారణ చేసుకుంటారు. తమ ఇష్టదైవానికి మొక్కులు తీర్చుకునేందుకు పురుషులు మహిళల వేషధారణలతో హొయలు పోతారు. ఆడవాళ్లు మగవారి వేషధారణతో గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు… ఆడవారు మగ వేషంలో, మగవారు ఆడవేషంలో భక్తితో పూజలు చేసే దృశ్యాలు… ప్రతి మూడేళ్లకు అక్కడ కనువిందు చేస్తుంటాయి. ప్రాచీన గ్రామీణ ఆచారాలకు చిహ్నాలుగా.. గ్రామదేవత అంకమ్మ తల్లి తిరుణాళ్లలో పాటించే వింత ఆచారాల్లో ఇది ఒకటి… అలాంటి వింతాచారం అనాదిగా పాటిస్తున్నారు ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు గ్రామంలో వెలిసిన అంకమ్మ తల్లి భక్తులు. ప్రతి మూడేళ్లకు ఒకసారి జరిగే ఈ కొలుపులు మూడు రోజులపాటు రంగరంగ వైభవంగా జరుగుతాయి… ఈ జాతరలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా వస్తుంటారు.. ఇక్కడి గ్రామదేవత అంకమ్మ తల్లి మహామహిమాన్వితురాలిగా చెబుతుంటారు భక్తులు. ఒక్కసారి మొక్కుకుంటే కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా భావిస్తూ… కోర్కెలు తీరాక, తమ సహజత్వానికి వ్యతిరేకంగా అలంకరించుకుని మొక్కులు చెల్లించుకుంటుంటారు భక్తులు… తమ తాతల కాలం నుంచి ఈ ఆచారం సాగుతోందని అదే ఆచారాన్ని తామూ కొనసాగిస్తున్నామని అంటున్నారు గ్రామస్తులు… చిన్నారుల నుంచి, పెద్ద వాళ్ళ వరకు సహజత్వానికి విరుద్ధంగా వేషధారణలు వేసినప్పటికీ, ఆడ – మగ మధ్య గౌరవ భావం పెంపొందటమే ముఖ్య ఉద్దేశ్యంగా ఈ జాతరలో ఈ విచిత్ర వేషధారణలు ఉంటాయని నిర్వాహకులు చెప్పడం విశేషం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.