Andhra Pradesh: ఏపీలో రాజుకుంటున్న రాజకీయ వేడి.. కొత్త జిల్లాలపై కొనసాగుతున్న ఆందోళనలు..
Andhra Pradesh New Districts: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ప్రకటన నాటినుంచి రాజకీయ వేడి మరింత పెరిగింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించింది.
Andhra Pradesh New Districts: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ప్రకటన నాటినుంచి రాజకీయ వేడి మరింత పెరిగింది. ఇటీవల ఏపీ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించింది. అయితే ప్రభుత్వ ప్రకటన వచ్చినప్పటి నుంచి కొన్ని చోట్ల ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. అదే సమయంలో ఏపీలో (Andhra Pradesh) తమకో జిల్లా కావాలంటూ.. పేర్లపై మార్పులు, డివిజన్‌ల చేర్పులు వంటి వాటిపై చాలా చోట్ల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే.. కొత్త జిల్లాల (New Districts) ఏర్పాటుపై అనేక చోట్ల నుంచి అభ్యంతరాలు వినిపిస్తున్న క్రమంలో.. వచ్చే నెల మూడో తేదీ వరకు విజ్ఞప్తులు స్వీకరించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత మార్చి 10 తేదీ వరకు వాటిని పరిశీలించనుంది. 11 నుంచి 14 వరకు సీఎస్ కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం మార్చి 17న రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది. మార్చి 23 నుంచి 25 వరకూ గెజిట్ నోటిఫికేషన్లు ఇవ్వనున్నారు జిల్లాల కలెక్టర్లు. ఏప్రిల్ 2 నుంచి కొత్త జిల్లాల్లో పాలన రాబోతుంది. కొత్త జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాల కోసం భవనాల గుర్తింపు పనిలో పడ్డారు అధికారులు.
ఇప్పటి వరకు వచ్చిన ప్రధాన డిమాండ్లు..
∙ రాజంపేట కాకుండా రాయచోటిని జిల్లా కేంద్రంగా ప్రకటించడంపై ఆందోళన కొనసాగుతోంది.
∙ హిందూపురం జిల్లా కేంద్రం చేయాలని స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ దీక్ష చేపట్టారు.
∙ సత్తెనపల్లి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు కోసం అఖిలపక్షం డిమాండ్ చేస్తోంది.
∙ కందుకూరులోనూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు జరుగుతున్నాయి.
∙ కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా పెట్టాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు.
∙ ద్వారకా తిరుమలను ఏలూరు జిల్లాలో కొనసాగించాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.
∙ భీమవరం బదులు నర్సాపురంను పశ్చిమగోదావరి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆందోళన కొనసాగుతోంది.
∙ నూజివీడు, గన్నవరం, పెనమలూరును NTR జిల్లాలో ఉంచాలని స్థానికులు కోరుతున్నారు.
∙ కైకలూరును పాత కృష్ణా జిల్లాలోనే కొనసాగించాలని విజ్ఞప్తి్.
∙ అవనిగడ్డ రెవెన్యూ డివిజన్ కోసం టీడీపీ డిమాండ్ చేస్తోంది.
∙ పశ్చిమ కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
∙ పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.
∙ బాలాజీ జిల్లా పేరు మార్చాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
∙ సత్యసాయి పేరు పెట్టడంపై కొన్ని చోట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.