PM Modi: పసల కృష్ణభారతి ఆశీస్సులు తీసుకున్న ప్రధాని మోడీ.. ఫ్రీడమ్ ఫైటర్ కుటుంబానికి సన్మానం..
అల్లూరి దేశం కోసం చేసిన త్యాగం మరువలేనిదని.. చిన్నతనంలోనే ఆంగ్లేయులతో పోరాడారని పేర్కొన్నారు. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మోడీ పేర్కొన్నారు.
PM Modi met Pasala Krishna Murthy family: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ సోమవారం భీమవరంలో ఆవిష్కరించారు. రూ. 30 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని వర్చువల్ ద్వారా ప్రధాని మోడీ ఆవిష్కరించి మాట్లాడారు. ఎందరో మహానుభావులు దేశం కోసం త్యాగం చేశారని.. అల్లూరి సీతారామరాజు యావత్ దేశానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. అల్లూరి దేశం కోసం చేసిన త్యాగం మరువలేనిదని.. చిన్నతనంలోనే ఆంగ్లేయులతో పోరాడారని పేర్కొన్నారు. అల్లూరికి సంబంధించిన అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మోడీ పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో పర్యటించారు. అనంతరం గన్నవరం చేరుకొని అక్కడినుంచి గుజరాత్ పయనమయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ అల్లూరి సీతారామ రాజు కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి వారితో ప్రత్యేకంగా మాట్లాడారు.
కాగా.. ప్రసంగం అనంతరం ఆంధ్రప్రదేశ్‌కి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు పసల కృష్ణ మూర్తి కుటుంబాన్ని కూడా ప్రధాని మోదీ కలిశారు. స్వాతంత్ర్య సమరయోధుడి కుమార్తె పసల కృష్ణ భారతితో ప్రధానమంత్రి మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు. ఆమె వయస్సు 90 సంవత్సరాలు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మోడీ ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. కృష్ణ భారతి సోదరి, మేనకోడలు కూడా ప్రధాని మోడీని కలిసి మాట్లాడారు. స్వాతంత్ర్య పోరాటంలో పసల కృష్ణ మూర్తి సేవలు చిరస్మరణీయమని ప్రధాని కొనియాడారు.