Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. టైమింగ్స్ చూశారా?
రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీ, తెలంగాణ మీదగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రానుంది. ఈ మేరకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వెళ్లడం ప్రయాణికులకు మరికాస్త ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ రైలు చర్లపల్లి జంక్షన్ నుంచి తిరువనంతపురం మధ్య నడుస్తుంది..

హైదరాబాద్, జనవరి 22: తిరువనంతపురం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం (జనవరి 23) మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. జనవరి 23న కేరళ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌లతో సహా మొత్తం నాలుగు కొత్త రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కొత్త రైళ్లు కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి అనేక రాష్ట్రాలలో కనెక్టివిటీని పెంచి, రైలు ప్రయాణాన్ని మెరుగుపరుస్తాయి.
తెలుగు రాష్ట్రాల మీదగా వెళ్లే అమృత్ భారత్ రైలు తెలంగాణలో నల్గొండ, మిర్యాలగూడ మీదగా ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగనుంది. కాగా చర్లపల్లి – ముజఫర్‌పూర్ (బిహార్) మధ్య ఇప్పటికే ఒక అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ నడుస్తోంది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు వందేభారత్ తరహా అనుభుతిని కలిగించేలా ప్రత్యేక వసతులున్న ఈ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తుంది. దీనికితోడు తాజాగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌ను కేంద్రం తీసుకురావడం పట్ల కిషన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
చర్లపల్లి – ముజఫర్‌పూర్ మధ్య అమృత్ భారత్ రైలు వేళలు ఇలా..
తెలంగాణలోని చర్లపల్లి నుంచి ఉదయం 4.05 గంటలకు ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వచ్చే కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్ల మీదగా ఇది మహారాష్ట్రలోకి అడుగుపెట్టి మరుసటి రోజు సాయంత్రం 4 గంటలకు ముజఫర్‌పూర్‌కు చేరుకుంటుంది.
తిరువనంతపురం-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వేళలు ఇలా..
తిరువనంతపురం-చర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మీదగా రైలు మార్గాన్ని అందిస్తుంది. ఈ రైలు కొల్లాం, చెంగన్నూరు, కొట్టాయం, ఎర్నాకులం టౌన్, త్రిసూర్, పాలక్కాడ్, కోయంబత్తూర్, సేలం, జోలార్‌పేటై, రేణిగుంట, నెల్లూరు, తెనాలి, గుంటూరు, నల్గొండ వంటి ప్రధాన స్టేషన్ల మీదుగా నడుస్తుంది. తిరువనంతపురంలో ఉదయం 10.45 గంటలకు ప్రారంభమయ్యే ఈ ట్రైన్.. చర్లపల్లికి మరుసటి రోజు సాయంత్రం 4.30 గంటలకు చేరుకుంటుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.




