PM Narendra Modi AP Visit: అల్లూరి జయంతి వేడుకలకు భీమవరం ముస్తాబు.. ముఖ్య అతిథిగా హాజరు కానున్న ప్రధాని మోడీ..
PM Modi AP Visit: విప్లవజ్యోతి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు భీమవరం ముస్తాబైంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) హాజరు కానున్నారు.

PM Narendra Modi AP Visit: విప్లవజ్యోతి, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు భీమవరం ముస్తాబైంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) హాజరు కానున్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు. అనంతరం భీమవరానికి సమీపంలోని కాళ్ల మండలం పెద అమిరంలో జరిగే భారీ బహిరంగసభలో ప్రధాని పాల్గొని ప్రసంగిస్తారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భీమవరం పట్టణం, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలను ముమ్మరం చేశారు.
ప్రధాన వేదికపై వీరే..
ఇక భీమవరం ASRనగర్‌లో 30 అడుగుల అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. చుట్టూ ఫ్లెక్సీల్లో అల్లూరి చిత్రాలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జగన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చిత్రాలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికపై 11మందికే అవకాశం కల్పించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డితోపాటు మరో ఏడుగురే ఉంటారని అధికారులు తెలిపారు.




రోడ్డు మార్గంలో ట్రయల్ రన్..
బహిరంగ సభ వేదికకు ఎదురుగా ఓ వైపు మహిళలకు, మరోవైపు పురుషులకు ప్రత్యేకంగా 500 మంది చొప్పున పట్టేలా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఒక్కోవైపు అయిదేసి చొప్పున భారీ స్క్రీన్లను పెట్టారు. వర్షం కురిసినా తట్టుకునేలా షామియానాలతోపాటు.. ఎండ తీవ్రత పెరిగినా ఇబ్బంది లేకుండా కూలర్లు ఏర్పాటు చేశారు. వేదిక ఎదురుగా 50వేల మందికి కుర్చీలను సిద్ధం చేశారు. అల్లూరి కుటుంబీకులు ఆసీనులయ్యేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వాతావరణం అనుకూలించకపోతే..ప్రధాని హెలికాప్టర్‌లో రావడానికి ఇబ్బంది ఎదురైతే.. రోడ్డు మార్గంలో రావడానికి వీలుగా ట్రయల్ రన్ నిర్వహించారు.
సభలో సెల్‌ఫోన్లు నిషేధం..
భద్రత కారణాల దృష్ట్యా ప్రధాని నరేంద్ర మోడీసభకు వచ్చే వారికి సెల్ ఫోన్లకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా హై సెక్యూరిటీ జామర్లు ఏర్పాటుచేశామన్నారు.