AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దశాబ్దాల నిరీక్షణకు తెర.. అసైన్డ్‌ ఇంటి స్థలాల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా అసైన్డ్‌ ఇంటి స్థలాల విషయంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పదేళ్ల కాలపరిమితి పూర్తయిన ప్రతి అసైన్డ్‌ ఇంటి స్థలాన్ని ఇకపై నేరుగా లబ్ధిదారుల పేరిటే రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ అధికారికంగా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు.

దశాబ్దాల నిరీక్షణకు తెర.. అసైన్డ్‌ ఇంటి స్థలాల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్!
Ap Assigned Lands Registration
Balaraju Goud
|

Updated on: May 22, 2026 | 8:24 AM

Share

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా అసైన్డ్‌ ఇంటి స్థలాల విషయంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. పదేళ్ల కాలపరిమితి పూర్తయిన ప్రతి అసైన్డ్‌ ఇంటి స్థలాన్ని ఇకపై నేరుగా లబ్ధిదారుల పేరిటే రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్‌ గురువారం (మే 21, 2026) అధికారికంగా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేశారు. ఈ నూతన విధానం ద్వారా దశాబ్దాలుగా ఇళ్ల స్థలాలు ఉండి కూడా హక్కులు లేక ఇబ్బందులు పడుతున్న లక్షలాది మంది పేద కుటుంబాలకు పూర్తిస్థాయి, శాశ్వత హక్కులు లభించనున్నాయి.

పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వెల్లడించారు. భవిష్యత్తులో పేదలకు ఇచ్చే అన్ని రకాల ఇంటి స్థలాలపై రెండేళ్ల కాలపరిమితిలోనే పూర్తి హక్కులు కల్పించే విధానాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని, దీనిపై త్వరలోనే స్పష్టమైన విధాన నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

కీలక మార్గదర్శకాలు – నిబంధనలుః

  1. అసైన్డ్‌ ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రధాన నిబంధనలను విధించింది.
  2. కావలసిన పత్రాలు: లబ్ధిదారులు రిజిస్ట్రేషన్ కోసం తమకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్‌మెంట్‌ పట్టా లేదా ఉత్తర్వుతో పాటు, ఇంటి పన్ను చెల్లించిన రశీదును సమర్పించాల్సి ఉంటుంది.
  3. అర్హత కాలపరిమితి: సవరించిన ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ భూముల చట్టం ప్రకారం.. కేవలం పదేళ్ల కాలపరిమితి దాటిన అసైన్డ్‌ ఇళ్ల స్థలాలకు మాత్రమే ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ వర్తిస్తుంది.
  4. వారసులకు అవకాశం: ఒకవేళ అసలు లబ్ధిదారుడు మరణించినట్లయితే, వారి వారసులు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. దీనికోసం అసలు పట్టాదారు మరణ ధ్రువీకరణ పత్రం, ఫ్యామిలీ మెంబర్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
  5. రుణాలు – విక్రయాలు: రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత లబ్ధిదారులు తమ వ్యక్తిగత లేదా ఆర్థిక అవసరాల కోసం ఆ భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొందవచ్చు.
  6. 90 రోజుల నిబంధన: రిజిస్ట్రేషన్‌ పూర్తయి, పూర్తి హక్కులతో కూడిన అధికారిక డాక్యుమెంట్‌ చేతికి వచ్చిన 90 రోజుల తర్వాతే ఆ ఇంటి స్థలాన్ని ఇతరులకు అమ్ముకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి చట్టబద్ధమైన అవకాశం ఉంటుంది.

నిషేధిత జాబితా మినహాయింపు: పదేళ్ల గడువు తీరిన అసైన్డ్‌ స్థలాలు లేదా గతంలో వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ (OTS) కింద రెగ్యులరైజ్‌ అయిన ఇళ్లు నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ, అక్కడ ఇల్లు నిర్మించి ఉంటే రిజిస్ట్రేషన్‌కు అనుమతించాలని స్పష్టం చేశారు. నకిలీ పత్రాలతో వచ్చే వారిపై కఠిన క్రిమినల్ చర్యలు ఉంటాయి.

దీంతో పాటు రాష్ట్రంలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఇందులో భాగంగా తొలిదశలో 1.9 లక్షల ఎకరాల చుక్కల భూములకు నిషేధిత జాబితా నుండి విముక్తి కల్పించనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇప్పటికే 1.6 లక్షల ఎకరాల సర్వీస్‌ ఇనామ్‌, షరతుగల పట్టా భూములకు విముక్తి లభించిందని, పట్టణ ప్రాంతాల్లో మరో 10 వేల గృహాలను క్రమబద్ధీకరించనున్నట్లు ఆయన వివరించారు. ప్రభుత్వ తాజా నిర్ణయాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజల నుండి హర్షం వ్యక్తమవుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us