Pawan Kalyan: పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. సామాన్యుడి గళం వినిపించేలా జనసేన జనవాణి.. ఎప్పటినుంచంటే..?
జూలై 3న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
Jana Sena Jana Vani: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. జగన్ ప్రభుత్వాన్ని నిలదీసేలా మరో కార్యక్రమానికి ప్లాన్ చేశారు. సామాన్యుడి గళం వినిపించేలా, జనసేన జనవాణి అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జూలై 3న విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనవాణి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలిపేలా జనవాణి కార్యక్రమం ఉంటుందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ మంగళవారం తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పవన్ స్వయంగా, ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని చెప్పారు. వాటిని సంబంధిత అధికారులకు పంపనున్నారు. జనసేన కార్యాలయం నుంచి అర్జీలపై ఆరాతీస్తామని వెల్లడించారు నాదెండ్ల మనోహర్. ప్రతీ ఆదివారం జనవాణి కార్యక్రమం ఉంటుందన్నారు. తొలి రెండు కార్యక్రమాలు విజయవాడలోనే జరుగుతాయని స్పష్టం చేశారు.
గతంలో ప్రభుత్వాలు ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టేవని, ముఖ్యమంత్రులు ప్రజల బాధలు విని అర్జీలు తీసుకొనేవారని వివరించారు మనోహర్. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో, అర్జీలు ఇచ్చే అవకాశం సామాన్యుడికి లేకుండా పోయిందన్నారు. అటు జనంలోకి వెళ్లేందుకు ఏ ఒక్క ఛాన్స్‌ని కూడా పవన్ వదులుకోవడం లేదు. ఇప్పటికే కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఆర్థిక సాయం చేస్తున్న పవన్, తాజాగా ప్రజాసమస్యలను స్వీకరించేందుకు ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..