Pawan Kalyan: ఉత్తరాంధ్రపై జనసేన ఫుల్ ఫోకస్.. వారాహి లేకుండానే పవన్ విశాఖ యాత్ర.. ఎందుకంటే..
Pawan Kalyan Vizag Tour: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత కొనసాగుతుంది. ఈ నెల 10వ తేదీన విశాఖపట్నంలో ప్రారంభమైన వారాహి విజయయాత్ర ఐదు రోజులపాటు కొనసాగింది. విశాఖతో పాటు గాజువాకలో వారాహి యాత్ర నిర్వహించిన పవన్.. ఈ రెండు ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు.
Pawan Kalyan Vizag Tour: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత కొనసాగుతుంది. ఈ నెల 10వ తేదీన విశాఖపట్నంలో ప్రారంభమైన వారాహి విజయయాత్ర ఐదు రోజులపాటు కొనసాగింది. విశాఖతో పాటు గాజువాకలో వారాహి యాత్ర నిర్వహించిన పవన్.. ఈ రెండు ప్రాంతాల్లో జరిగిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. విశాఖపట్నంలో రుషికొండ పరిశీలనకు వెళ్లి సర్కారుపై తీవ్ర విమర్శలు చేసారు పవన్ కళ్యాణ్. గత రెండు టూర్ల కంటే మూడో విడత యాత్రలో విమర్శల డోస్ పెంచారు. విశాఖలో భూకబ్జాలు పెరిగిపోయాయని.. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీతో పాటు సీఎం జగన్ పై అనేక ఆరోపణలు గుప్పించారు. పవన్ వ్యాఖ్యలపై అధికార పార్టీ కూడా అంతే గట్టిగా స్పందించింది. ఐదు రోజులపాటు జరిగిన యాత్ర మొత్తం టెన్షన్ వాతావరణంలో సాగింది. జూన్ లో వారాహి యాత్ర ప్రారంభించిన తర్వాత ఉమ్మడి గోదావరి జిల్లాల్లో మొదటి రెండు యాత్రలు జరిగాయి. అప్పటి నుంచి పవన్ కేవలం వారాహి ద్వారా మాత్రమే రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అయితే, మంగళగిరి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్.. ఆగస్ట్ 16 నుంచి తిరిగి విశాఖలో పర్యటించనున్నారు. ఈసారి వారాహి లేకుండా పర్యటన జరగనుంది. గాజువాక సభ తర్వాత వారాహి వాహనాన్ని మంగళగిరి పార్టీ ఆఫీస్ కు తరలించారు.
విశాఖలో పవన్..
వారాహి విజయ యాత్ర మూడో విడత విశాఖలో ప్రారంభించిన పవన్ కళ్యాణ్ ఆగస్ట్ 15న అమరావతి వెళ్లారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగస్ట్ 19 వ తేదీ వరకూ విశాఖలో పవన్ పర్యటన కొనసాగనుంది. అయితే మధ్యలో ఒకరోజు బ్రేక్ తర్వాత తిరిగి పవన్ తన పర్యటన కొనసాగించనున్నారు. విశాఖపట్నం పర్యటనలో మిగిలిన రోజులు వారాహి వాహనం లేకుండానే పవన్ పర్యటన కొనసాగనుంది. షెడ్యూల్ ప్రకారం విశాఖపట్నం జిల్లాలో రెండు చోట్ల మాత్రమే బహిరంగ సభలున్నాయి. ఆ రెండు సభలు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన రోజుల్లో షెడ్యూల్ ప్రకారం ఎలాంటి బహిరంగ సభలు లేవు. మిగిలిన నాలుగు రోజుల పర్యటనలో కేవలం క్షేత్రస్థాయి పర్యటనలు, పార్టీ సమావేశాలు ఉన్నాయి. రుషి కొండ పర్యటనకు వెళ్లిన విధంగానే వారాహి బదులు ఇతర కార్లలో క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. అంతే తప్ప వేరే ఇతర కారణాలు లేవంటున్నారు పార్టీ నాయకులు. అవసరం ఉన్నప్పుడే వారాహి వాహనాన్ని బయటకు తీస్తామని తెలిపారు.
విశాఖ పర్యటన షెడ్యూల్..
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పవన్ కల్యాణ్ యాత్ర ఆగస్టు 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరగనుంది. ఈ యాత్రలో భాగంగా క్షేత్ర స్థాయి పరిశీలనలు, విశాఖలో చోటు చేసుకొంటున్న భూకబ్జాలకు సంబంధించిన పరిశీలనలు ఉంటాయని ముందుగా నిర్ణయించారు. ఇప్పటికే బహిరంగ సభలు ముగియడంతో ఆగస్ట్ 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఆగస్టు 16వ తేదీన విశాఖపట్నంలో ఎర్ర మట్టి దిబ్బలను పరిశీలిస్తారు. ఆగస్టు 17వ తేదీన విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.18 లేదా 19వ తేదీన స్థానిక నేతలు, ముఖ్య నాయకులతో పార్టీ సమావేశంలో పాల్గొంటారు. అవసరమైతే ఒకటి రెండు రోజులు పర్యటన పొడిగించే అవకాశం ఉందని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఉత్తరాంధ్రపై దృష్టి పెట్టిన పవన్ కల్యాణ్ మరోసారి విశాఖ పర్యటన ద్వారా పార్టీ బలోపేతానికి నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..