Pawan Kalyan: 2014లో అందుకే పొత్తు పెట్టుకున్నాం.. టీడీపీతో ప్రయాణంపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..
TDP- Janasena: టీడీపీ-జనసేన పొత్తుపై బీజేపీ అధిష్టానం సానుకూలంగానే ఉందన్నారు పవన్ కల్యాణ్. నవంబర్ 1 నుంచి ఇంటింటి ప్రచారం చేపట్టబోతున్నట్టు ప్రకటించారు పవన్, లోకేశ్. ఉమ్మడి మేనిఫెస్టోతో ఒకటో తేదీ నుంచి ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. ఓట్ల తొలగింపుతో సహా ప్రతి ప్రజా సమస్యపై ఇక నుంచి రెండు పార్టీలు కలిసే పోరాడతాయన్నారు పవన్ కల్యాణ్-నారా లోకేశ్..

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు 100 రోజుల ప్రణాళిక రూపొందించింది టీడీపీ-జనసేన. వైసీపీ పోవాలి.. టీడీపీ-జనసేన రావాలి అనే నినాదంతో ఉమ్మడిగా ప్రజల్లోకి వెళ్తామని పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ప్రకటించారు. నవంబర్ 1న ఉమ్మడి కార్యాచరణ ఏంటనేది ప్రకటిస్తామన్నారు. ఇకపై ఉమ్మడి వెళ్లే ఏ కార్యక్రమంలోనూ రెండు పార్టీల మధ్య ఎలాంటి గొడవలు రావని ధీమాగా చెప్పారు పవన్ కల్యాణ్. ఇక బీజేపీతో పొత్తుపైనా జనసేనాని కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన ఎన్డీయేలోనే ఉందని క్లారిటీ ఇచ్చారు. ఏపీలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నందునే పొత్తు పెట్టుకున్నామని, దీనిపై బీజేపీ అధిష్టానం కూడా సానుకూలంగా ఉందన్నారు పవన్.
ఫస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్‌లో మూడు తీర్మానాలు చేశాయి టీడీపీ, జనసేన. ఆంధ్రప్రదేశ్‌ను అరాచక పాలన నుంచి కాపాడడం, అన్ని వర్గాలకు అభివృద్ది అందించడం, చంద్రబాబు అరెస్ట్‌కు నిరసన తెలపడం. వీటిని ఉమ్మడి కార్యాచరణగా తీసుకెళ్లడానికి జిల్లాల స్థాయిలో కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఏపీలోని ఉమ్మడి జిల్లాల్లో అక్టోబర్ 29, 30, 31 తేదీల్లో జరిగే సమావేశాలకు రెండు పార్టీల కార్యకర్తలు పాల్గొని, నిర్ణయాలు తీసుకుంటారన్నారు. ఆ తరువాత ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. మ్యానిఫెస్టో ప్రకటించి, నవంబర్ 1 నుంచే ఇంటింటి ప్రచారం కూడా చేపడతామన్నారు.
ఇక ప్రజా సమస్యలపై పోరులో భాగంగా రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ప్రాంతాల వారీగా నివేదిక తయారు చేయబోతున్నాయి రెండు పార్టీలు. ఏపీలో 34 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరగడానికి సాగునీటి ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వైఫల్యమేనని కారణమని ఆరోపించారు ఇరువురు నేతుల. ఎస్సీలకు రావాల్సిన 26 సంక్షేమ కార్యక్రమాలను జగన్ ప్రభుత్వం రద్దు చేసిందన్న నారా లోకేశ్.. బీసీలకు రావాల్సిన సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేసిందని, వైసీపీ నేతల వేధింపులతో ముస్లిం సోదరులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదని, అందుకే యువత పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారన్నారు.
అటు టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణపై అధికార పార్టీ నుంచి గట్టి విమర్శలే వస్తున్నాయి. ఆ రెండు పార్టీల జాయింట్ యాక్షన్‌తో జగన్ ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేదని కౌంటర్స్ ఇచ్చారు ఏదేమైనా.. అన్ని వర్గాల ప్రజల సమస్యలు తొలగిపోవాలంటే.. వైసీపీ ప్రభుత్వాన్ని కచ్చితంగా ఇంటికి పంపాల్సిన అవసరం ఉందన్నారు పవన్ కల్యాణ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చనివ్వబోనన్న మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. సాంకేతిక అంశాల పేరుతో చంద్రబాబుకు బెయిల్ రాకుండా చేస్తున్నారన్నారు. మొదటి సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం చంద్రబాబుకు మద్దతిచ్చేందుకేనని స్పష్టం చేశారు. టీడీపీ-జనసేన ఎలా కలిసి పని చేయాలనే దానిపై త్వరలో ఉమ్మడి ప్రణాళిక ప్రకటిస్తామన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




