AOB: ఆంధ్రా ఒడిశా బోర్డర్‌లో టెన్షన్, టెన్షన్.. ఎందుకో తెలుసా?
ఆంధ్ర–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా ప్రాంతం మరోసారి ఉద్రిక్తంగా మారింది. సుప్రీంకోర్టు స్టేటస్–కో కొనసాగుతున్నప్పటికీ నాల్కో సంస్థకు బాక్సైట్ తవ్వకాల అనుమతులు ఇవ్వడంపై గిరిజనులు ఆందోళనకు దిగారు. తవ్వకాలతో తమ భూములు, అటవీ హక్కులు, జీవనాధారం ప్రమాదంలో పడతాయంటూ కొటియావాసులు ప్రశ్నిస్తున్నారు.

ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దులోని కొటియా వివాదస్పద గ్రామాల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొటియా ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు ప్రారంభిస్తామంటూ నాల్కో కంపెనీ చేసిన ప్రకటనతో అక్కడి గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వివాదాల్లో ఉన్న కొటియా భూభాగం ఏ రాష్ట్రానికి చెందిందో క్లారిటీ లేకుండా ఒరిస్సా అనుమతులు ఇవ్వడంపై కొటియావాసులు ఆందోళనకు దిగుతున్నారు. కొటియా ప్రాంతంలో ఎలాంటి కార్యకలాపాలు జరపకూడదని సుప్రీంకోర్టు స్టేటస్-కో ఉన్నప్పటికీ బాక్సైట్ తవ్వకాలు ఎలా సాధ్యమవుతాయని ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పార్వతీపురం మన్యం జిల్లా, ఒడిశాలోని కోరాపుట్ జిల్లా సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతం అత్యంత విలువైన ప్రాంతం. ఈ ప్రాంతంలోని 22 గ్రామాలు ఏ రాష్ట్రానికి చెందుతాయన్నది దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం. ఈ భూభాగం తమదంటే తమదంటూ ఇరు రాష్ట్రాలు కోర్టు మెట్లక్కాయి. దీంతో భూభాగం ఏ రాష్ట్రానికి చెందిందో పార్లమెంట్ నిర్ణయం తీసుకోవాలని అప్పటి వరకు ఈ ప్రాంతంలో ఇరు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం కూడా ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకూడదని 1968 డిసెంబర్ 2న సుప్రీంకోర్టు స్టేటస్-కో ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి యథాతథ స్థితి కొనసాగాల్సి ఉంది. అలా ఈ ప్రాంతవాసులకు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు ఇవ్వొచ్చు కానీ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం మాత్రం కుదరదు.
అలా ఇచ్చిన సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఏపి ప్రభుత్వం అమలుచేస్తుంది.. కానీ ఒరిస్సా ప్రభుత్వం మాత్రం కోర్టు తీర్పుకు విరుద్దంగా.. కొటియాను అన్నివిధాలా అభివృద్ధి చేస్తూ తమ అధీనంలోకి తీసుకునేలా దూకుడుగా ముందుకు వెళ్తుంది. ఇక్కడ ఉన్న 22 గ్రామాల్లో ఒడిశా ప్రభుత్వ భవనాలు, రోడ్లు ఇతర మౌలిక వసతులు కల్పిస్తూ ముందుకు వెళ్తుంది. అలాగే ఏపీ అధికారులు, ప్రభుత్వ సిబ్బంది ఈ ప్రాంతంలో ఏమైనా ప్రభుత్వ పథకాల కోసం వెళ్తే వారిని కొటియా గ్రామాల నుండి బలవంతంగా వెనక్కి పంపిస్తుంది. పలువురుపై కేసులు కూడా పెడుతుంది. ఈ క్రమంలోనే కొటియావాసులు సైతం తాము ఏపీతో ఉంటామని ఒడిశాలో ఉండమని ఆందోళనలు చేపడితే.. అలా ఆందోళనకు దిగిన వారిపై సైతం కేసులు పెడుతుంది ఒడిశా ప్రభుత్వం. అలా ఎప్పటికప్పుడు కొటియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు తాజాగా బాక్సైట్ గనుల అంశం మళ్లీ కొటియాలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది. 2026 కొత్త సంవత్సరంలో కొటియా సమీపంలోని పొట్టంగి ప్రాంతంలో సుమారు 660 హెక్టార్లు, అంటే దాదాపు 1750 ఎకరాల్లో నాల్కో సంస్థకు బాక్సైట్ తవ్వకాలు ప్రారంభించేందుకు ఒడిశా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో కొటియా ప్రాంత గిరిజనుల్లో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. కొటియా పరిధిలో నివసిస్తున్న గిరిజనుల్లో ఒక్కసారిగా భయం నెలకొంది. బాక్సైట్ తవ్వకాలు జరిగితే తమ గ్రామాల పరిస్థితి ఏంటి? పోడు వ్యవసాయం చేసుకొని బ్రతుకుతున్న తమ భూములు పరిస్థితి ఏంటి? తమ అటవీ హక్కులు, జీవనాధారం ఏమవుతాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తవ్వకాలు ఎలా చేస్తారని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు ఒడిశా ప్రభుత్వం ఎలా అనుమతిస్తుంది అని నిలదీస్తున్నారు.
తవ్వకాలు చేస్తే మేం ఎక్కడికి వెళ్లాలి? ప్రభుత్వం మాకు ముందుగా చెప్పాలి కదా అని నిలదీస్తున్నారు. ఇదిలా ఉండగా, నాల్కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ వచ్చే జూన్ నాటికి బాక్సైట్ తవ్వకాలను ప్రారంభించాలన్న లక్ష్యంతో ఉన్నామని వెల్లడించారు. ఒడిశాలోని పొట్టంగి ప్రాంతంలో బాక్సైట్ గనుల అభివృద్ధి ద్వారా అల్యూమినియం వ్యాపారాన్ని విస్తరించనున్నట్లు తెలిపారు. గనుల అభివృద్ధి బాధ్యతలను దిలీప్ బిల్డ్‌కాన్ సంస్థకు కూడా అప్పగించినట్టు చెప్పారు. కోరాపుట్ జిల్లా దామనోడి అల్యూమినా రిఫైనరీ సామర్థ్యాన్ని ప్రస్తుత 22.75 లక్షల టన్నుల నుంచి మరో 10 లక్షల టన్నులకు పెంచాలని నాల్కో లక్ష్యంగా పెట్టుకుంది. ముడి పదార్థాల కోసం ఒడిశా ప్రభుత్వం నుంచి సుమారు 697 హెక్టార్ల భూమిని 50 సంవత్సరాలకు లీజుకు తీసుకున్నట్టు వెల్లడించారు. అలా నాల్కో చైర్మన్ ఇచ్చిన స్టేట్మెంట్ తో గిరిజనులు ఆందోళనలో పడ్డారు. సుప్రీంకోర్టు స్టేటస్‌కో ఉన్న కొటియా పరిధిలో ఈ తవ్వకాలు చట్టబద్ధమేనా? 22 గ్రామాలపై ఎలాంటి ప్రభావం పడనుంది? అటవీ హక్కుల చట్టం, గ్రామసభ అనుమతులు తీసుకున్నారా? లేదా? అవేమీ లేకుండా నాల్కో సంస్థకు ఎలా అనుమతులు ఇచ్చింది? నాల్కో సంస్థ ఎలా త్రవ్వకాల పై ప్రకటిస్తుంది? అన్న అనేక అంశాల పై ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదు. అయితే మరోసారి దూకుడుగా వెళ్తున్న ఒడిశా ప్రభుత్వ వ్యవహారం పై ఏపి ప్రభుత్వం స్పందించాలని అంటున్నారు ఏపి మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర. ఏపికి చెందిన భూములను ఒడిశా ఎలా అనుమతులు ఇస్తుంది? సుప్రీంకోర్టు స్టేటస్ కో ఉన్నప్పటికీ ఒడిశా ఎలా ఏకపక్షంగా వ్యవహరించి నాల్కో సంస్థకు బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇస్తారు అని మండిపడుతున్నారు.
