Andhra Pradesh: పార్లమెంట్ మోడల్‌లో భవనం.. మహాత్ముని ఆశయాల స్ఫూర్తికి నిదర్శనం
గాంధీ ఆశ్రమం ప్రస్తుతం ఈ మోడల్ పార్లమెంటు భవనం పిలువబడుతుంది. సర్వోదయ మండలి ద్వారా ప్రచారం చేస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతియేటా ఇక్కడ గాంధీ ఆశయాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తుంటారు. అయితే మూర్తి రాజు మరణానంతరం ఈ భవనాన్ని పట్టించుకునే నాధుడే లేకుండా పోయారు.

న్యూ ఢిల్లీలోని సంసద్ మార్గ్ లో ఉన్న పార్లమెంటు భవనం మన దేశ సార్వభౌమత్వానికి ప్రతీక. దీని నిర్మాణం 1921లో మొదలై ఆరేళ్ల పాటు సాగింది. ఇది వ్రృత్తాకారంలో ఉంటుంది. దీన్ని నిర్మించటానికి సుమారు రూ.85 లక్షల వరకు ఖర్చు చేశారు. భారత దేశం లో అత్యున్నత మైన శాసనసభ, రాజ్యసభ ఇక్కడే కొలువైంది. ఈ భవంతి బ్రిటీష్ వారి హయాంలో నిర్మితమైంది. అయితే స్వాతంత్య్రం వచ్చి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అంటే 1952 నుంచి ఇక్కడే భారత పరిపాలనకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోబడుతున్నాయి. అయితే సరిగ్గా అలాంటి భవంతిని పోలిన ఒక భవనం ఏలూరు జిల్లా పెదనిండ్రకొలనులో ఉంది.
మహాత్ముని ఆశయాల స్ఫూర్తి
భారత పార్లమెంటు భవనం తరహాలోనే పెద నిండ్రకొలనులో వ్రృత్తాకర భవనం నిర్మించారు విద్యాదాత , మాజీ మంత్రి ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మాజీమంత్రి చింతలపాటి మూర్తి రాజు. ఆయన స్వస్థలం పెదనిండ్రకొలను. స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని గాంధీజీ ఆశయాలను మనసా వాచా కర్మణా తూచా తప్పకుండా ఆయన పాటించారు. ఎన్నో స్కూల్స్, కాలేజీలు నిర్మించి, ఎంతో మందికి విద్యాదానం చేసిన మహోన్నత వ్యక్తి మూర్తి రాజు. గాంధీజీ మార్గాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆలోచనతో 15 ఎకరాల స్థలంలో దేశ పార్లమెంట్ భవనాన్ని పోలివున్న ఆకృతిలో మహాత్మా గాంధీ భవనాన్ని నిర్మించారు.
దీనికి మాజీ ఉప ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ 1969లో శంకు స్థాపన చేశారు. బోర్లించిన గొడుగులా భవన పై కప్పు ఉంటుంది. మధ్యలో ఎక్కడా పిల్లర్లు కనిపించవు. దీనికి నాలుగు ద్వారాలు ఉండగా వాటిపైన వివిధ రకాల మతాలకు సంబంధించిన గుర్తులు పొందుపరిచి సర్వమత సమానత్వం చాటారు. అంతేకాక లోపల భారతదేశ ప్రధానులు, స్వాతంత్రసమరయోధుల ఫోటోలు, పలు రకాల గ్రంధాలు అందుబాటులో ఉన్నాయి. గాంధీజీ ఆశయాలను ప్రచారం చేసే కార్యకర్తలు ఇందులో విశ్రమించేందుకు గదులు కూడా నిర్మించారు. నిజంగా ఒక సామాన్య పల్లెటూరు అద్భుతమైన సాంకేతిక నిర్మాణ పరిజ్ఞానంతో ఇలాంటి ఒక భవనం నిర్మించటం మూర్తి రాజుకు గాంధీజీ పట్ల ఉన్న అంకితం భావానికి నిదర్శనం.
గాంధీజీ ఆశయాల ప్రచారం
గాంధీ ఆశ్రమం ప్రస్తుతం ఈ మోడల్ పార్లమెంటు భవనం పిలువబడుతుంది. సర్వోదయ మండలి ద్వారా ప్రచారం చేస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రతియేటా ఇక్కడ గాంధీ ఆశయాలపై విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తుంటారు. అయితే మూర్తి రాజు మరణానంతరం ఈ భవనాన్ని పట్టించుకునే నాధుడే లేకుండా పోయారు. అంతటి విశిష్ట గల భవనం నేడు శిథిలావస్థకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం అలాంటి ఆదర్శమైన నిర్మాణాన్ని, అందులో పొందుపరిచిన స్వాతంత్ర సంగ్రామ చరిత్రను, మహాత్మా గాంధీ జీవిత విశేషాలను భావితరాలకు చూపించడం పట్ల సరైన దృష్టి సారించడం లేదు. మూర్తి రాజు మరణానంతరం ఆయన వారసులు కూడా ఆ భవనానికి సంబంధించిన ఆస్తులను అమ్మనున్నట్లు ప్రచారం జోరుగా సాగింది.
గాంధీజీ ఆశ్రమానికి ఖరీదైన భూములు
నూజివీడు ప్రాంతంలో 500ల ఎకరాలు భూము గాంధీజీ ఆశ్రమం కోసం అప్పట్లోనే మూర్తి రాజు సేకరించారు. అయితే వీటికి సంబంధించిన కొన్ని రికార్డులు సర్వోదయ మండలి వద్ధ ఉన్నా వాటిని గుర్తించి స్వాధీనం చేసుకునే శక్తి మాత్రం కమిటీ నిర్వాహకులకు సాధ్యం కావటంలేదు. చాలా కాలం మూతబడ్డ గాంధీ ఆశ్రమాన్ని సైతం ఇటీవలే తిరిగి పునఃప్రారంభం చేశారు. ఇలాంటి సందర్భంలో తపన ఫౌండేషన్ ద్వారా లక్ష రూపాయల సహాయాన్ని గాంధీజీ ఆశ్రమానికి అందచేశారు. ప్రైవేటు వ్యక్తులు, సంస్ధలు, మూర్తిరాజు అభిమానులు ఈ అద్భుతమైన నిర్మాణం పట్ల శ్రద్ధ చూపినా అది వారి శక్తికి మించిన భారంగా మారుతోంది. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పర్యాటక రంగానికి చెందిన అధికారులు స్పందించి ఇటువంటి ప్రాధాన్యత కలిగిన నిర్మాణాలపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..






