Parchuru Politics: పర్చూరులో పాత పంచాయితీ.. పోటా పోటీ సమావేశాలతో పొలిటికల్ హీట్
ఆయన వద్దు... జగన్ ముద్దు అంటున్నారట అ నియోజకవర్గంలోని వైసీపీ నేతలు. అంత సీన్ లేదు, జగన్‌తో పాటు ఆయన కూడా కావాలంటున్నారట ఆయన మద్దతుదారులు. దీంతో పోటాపోటీ సభలు, సమావేశాలు పెట్టి ఒక వర్గం ఆయనకు ఎందుకు వద్దో.. మరోవర్గం ఆయనే ఎందుకు కావాలో.. కార్యకర్తలకు వివరించే పనిలో పడ్డారట.

ఆయన వద్దు… జగన్ ముద్దు అంటున్నారట అ నియోజకవర్గంలోని వైసీపీ నేతలు. అంత సీన్ లేదు, జగన్‌తో పాటు ఆయన కూడా కావాలంటున్నారట ఆయన మద్దతుదారులు. దీంతో పోటాపోటీ సభలు, సమావేశాలు పెట్టి ఒక వర్గం ఆయనకు ఎందుకు వద్దో.. మరోవర్గం ఆయనే ఎందుకు కావాలో.. కార్యకర్తలకు వివరించే పనిలో పడ్డారట.. దీంతో ఆ నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలు అయోమయంలో పడిపోతున్నారట.. అసలే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల హీట్ రాజుకుంటున్న సమయంలో పర్చూరులో పట్టు పెంచుకునేందుకు వైసీపీ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలకు నియోజకవర్గంలో వర్గపోరు తలనొప్పిగా మారిందట.
పర్చూరు నియోజకవర్గం వైసీపీలో నేతల మధ్య పంచాయతీ పీక్ స్టేజీకి చేరుకుంది. ప్రస్తుత ఇన్‌చార్జి ఆమంచి కృష్ణమోహన్ మాకొద్దు. జగనే ముద్దు అంటూ అసమ్మతి నేతలు సభలు పెట్టి గళం విప్పుతున్నారట.. మరోవైపు ఆమంచి మద్దతుదారులు పోటా పోటీ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఆమంచే కావాలంటున్నారట.. దీంతో పర్చూరు వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరుకుందట.. చీరాల నుంచి పర్చూరుకు వచ్చినా మాజీ ఎమ్మెల్యే ఆమంచికి ఇక్కడ కూడా వర్గపోరు తప్పడం లేదట.. దీంతో పెనం నుంచి పొయ్యిలో పడినట్లుగా మారిందట ఆ మాజీ ఎమ్మెల్యే పరిస్థితి.
బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో వైసీపీలో వర్షపోరు పతాకస్థాయికి చేరింది. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న ఆమంచి కృష్ణమోహన్, అయన వ్యతిరేకవర్గాల మధ్య నెలకొన్న ఆధిపత్యపోరు కారు చిచ్చులా రగులుతోంది. ఈ పరిస్థితుల్లో తాజాగా ఆమంచి వ్యతిరేకులు, ఆమంచి వర్గీయులు పోటాపోటీగా సమావేశాలు నిర్వహించారు. చినగంజాం మండలం మూలగారివారిపాలెంలో ఆమంచి వ్యతిరేకవర్గం ఆమంచి వద్దు.. జగన్ ముద్దు అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. కొత్తపాలెం సర్పంచ్ ఆసోది బ్రహ్మారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పర్పూరు ఇన్‌చార్జ్ ఆమంచి కృష్ణమోహన్‌కు చిన్నగంజాం ఎంపీపీ కోమట్ల అంకమ్మరెడ్డి తీవ్రస్థాయిలో హెచ్చరికలు చేశారట. ఆమంచి తన పద్ధతి మార్చుకుని కార్యకర్తలను కలుపుకుని ముందుకు వెళ్లాలని కోరారట.. కార్యకర్తలను బూతులు తిట్టడం, సీనియర్ కార్యకర్తలను పక్కన పెట్టి తన అనుచరులు కొంతమందితో రాజకీయం చేస్తున్నారని, దీనిని సహించబోంటూ ఆగ్రహం వ్యక్తం చేశారట.
2019 ఎన్నికల్లో రాష్ట్రంలో వైసీపీకి 151 సీట్లు వస్తే చీరాలలో అమంచి ఓడిపోయారన్నారన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారట. తాము సమావేశం ఏర్పాటు చేస్తే వందల మంది వస్తున్నారని, అదే ఆమంచి ఏర్పాటు చేస్తే 50 మంది కూడా రావడం లేదంటున్నారు. దీని బట్టి ఆమంచి తన స్థాయి ఉందో తెలుసుకోవాలని ఆమంచి ఉద్దేశించి బహిరంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు సీఎం జగన్ కోసం బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రి పదవినే త్యాగం చేశారు. అటువంటి వ్యక్తిని తూలనాడి మాట్లాడటాన్ని సహించబోమంటున్నారు ఆయన మద్దతుదారులు. ఈ సమావేశానికి ముందు పెదగంజా నుంచి చినగంజాం గ్రామం మీదగా మూలగానివారిపాలెం వరకు బైక్ ర్యాలీ చేసి బలప్రదర్శన కూడా చేశారు. ఆమంచికి వ్యతిరేకంగా జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అసోది బాగ్యలక్ష్మి, మండల ఉపాద్యక్షరాలు తుమ్మల వెంట ప్రసన్న లక్ష్మి సైతం పాల్గొన్నారు.
ఆమంచి వెంటే మేము… ఆమంచి మద్దతుదారులు…
ఆమంచి వ్యతిరేక వర్గం ఏర్పాటు చేసిన సమావేశానికి పోటీగా ఆమంచి మద్దతుదారులు కూడా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఆమంచి వ్యతిరేక వర్గం నిర్వహించిన గ్రామం మూలగానివారిపాలెంలోని కొత్తపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ కి “జగన్ ఎందుకు కావాలంటే ” అనే కార్యక్రమాన్ని ఆమంచి కృష్ణమోహన్ వర్గీయులు నిర్వహించారు. వైసీపీ మండల కన్వీనర్ మున్నం నాగేశ్వరెడ్డి ఆధ్వరంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమంచికి మద్దతుగా పలువురు నేతలు మాట్లాడారు. చీరాలలో కాంగ్రెస్ తరుపున ఒకసారి, 2014లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన అమంచిని విమర్శించే స్థాయి మీది కాదని అంకమ్మరెడ్డికి కౌంటర్ ఇచ్చారట. చీరాలలో వైసీపీ కార్యకర్తలకు సేవలందించి, అధిష్టానం కోరిక మేరకు పర్చూరు ఇన్‌చార్జ్‌గా వచ్చిన ఆమంచి కృష్ణమోహన్ వెంటే తాము ఉంటామని తేల్చిచెప్పేశారట. దీంతో పర్చూరులో ఆమంచికి వ్యతిరేకంగా, అనుకూలంగా నాయకులు విడిపోయి వేరుకుంపట్లు పెట్టుకుంటూ స్వపక్షంలోనే విపక్షంలా మారి పోట్లాడుకుంటున్నారట…
వైసిపికి కొరకరాని కొయ్యగా మారిన పర్చూరు
వైసిపి ఆవిర్భావం తరువాత రాష్ట్రంలో రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఆ రెండు సార్లూ పర్చూరులో వైసిపి ఓడిపోయింది… 2014, 2019లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి టిడిపి పార్టీ గెలుపొందింది.. ఇక్కడ వైసిపి బోణీ కొట్టిందేలేదు… అలాంటి పర్చూరులో అధికారపార్టీ పట్టుపెంచుకోవాల్సిందిపోయి ఆధిపత్యపోరుతో సతమతమవుతుంటే అధిష్టానం పెద్దలు తలలు పట్టుకుంటున్నారట. ఈసారైనా ఇక్కడి నుంచి గెలవాలిరా నాయనా అంటూ ఇరువర్గాల నేతలకు తలంటు పోస్తున్నారట… అయినా సరే, ఎవరేమన్నా మాకేంటి… మేమింతే అంటున్నారట ఇక్కడి ఇరువర్గాల నేతలు… దీంతో పర్చూరు వైసిపిలో పంచాయతీ ఇప్పట్లో తెగేలాలేదంటూ నిట్టూరుస్తున్నారట పార్టీ కేడర్.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…