AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Magunta Srinivasulu Reddy: ఒంగోలు ఎంపీ మాగుంటకు ఈసారి వైసీపీ టికెట్‌ దక్కేనా.. టెన్షన్‌లో కేడర్‌..!

ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈసారి వైసీపీ టికెట్‌ ఉందా..? లేదా..? ఉంటే వైవీ విక్రాంత్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్లు ఎందుకు అధిష్టానం పరిశీలిస్తున్నట్టు...? లేకుంటే మీకు టికెట్‌ లేదని ఎందుకు ప్రకటించనట్టు..? ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్‌ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్‌ బయటకు వస్తోంది.

Magunta Srinivasulu Reddy: ఒంగోలు ఎంపీ మాగుంటకు ఈసారి వైసీపీ టికెట్‌ దక్కేనా.. టెన్షన్‌లో కేడర్‌..!
Magunta Srinivasulu Reddy Balineni Srinivasa Reddy
Fairoz Baig
| Edited By: Balaraju Goud|

Updated on: Jan 13, 2024 | 7:13 PM

Share

ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈసారి వైసీపీ టికెట్‌ ఉందా..? లేదా..? ఉంటే వైవీ విక్రాంత్‌ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్ పేర్లు ఎందుకు అధిష్టానం పరిశీలిస్తున్నట్టు…? లేకుంటే మీకు టికెట్‌ లేదని ఎందుకు ప్రకటించనట్టు..? ఒంగోలు వైసీపీ ఎంపీ టికెట్‌ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్‌ బయటకు వస్తోంది. మరోవైపు మాగుంటకు టికెట్ నిరాకరిస్తే తాను కూడా పోటీ చేయనని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి భీష్మించారు. అధిష్టానం వ్యవహారశైలిపై కినుక వహించి హైదరాబాద్‌ వెళ్ళిపోయారు. దీంతో అధిష్టానం ఏం చేస్తుంది..? ఎలా వ్యవహారాన్ని చక్కదిద్దుతుందోనన్న టెన్సన్‌ ఇటు వైసీపీ ప్రజా ప్రతినిధుల్లో, అటు కార్యకర్తల్లో ఎడతెగని చర్చ నడుస్తోంది.

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఈసారి టికెట్‌ లేదని వైసీపీ అధిష్టానం తేల్చిచెప్పిందన్న ప్రచారంతో ఒంగోలులో మాగుంటను కార్యకర్తలు, ఆయన అభిమానులు కలిసి పరామర్శిస్తున్నారు. రెండురోజులుగా ఒంగోలులోనే ఉన్న మాగుంట శ్రీనివాసులురెడ్డి స్థానికంగా పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఆయనకు వైసీపీ నుంచి పార్లమెంట్‌ సీటు ఇవ్వడంలేదన్న ప్రచారం జరుగుతుండటంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఆయన్ను కలుస్తున్నారు. ఈ క్రమంలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, సంతనూతలపాడు ఎమ్మెల్యే టిజెఆర్‌ సుధాకర్‌బాబులు ఒంగోలులోని మాగుంట నివాసంలో ఆయన్ను కలిసుకున్నారు. తాజా రాజకీయాలపై కొద్దిసేపు చర్చించుకున్నారు.

మాగుంటకు వైసీపీలో టికెట్ లేదన్న ప్రచారం జరుగుతున్న వేళ మాగుంట, కరణంల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇటీవల మాగుంట శ్రీనివాసులురెడ్డి పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్యేలు బాలినేని, కరణంలు హాజరై శుభాకాంక్షలు కూడా తెలిపారు. మరోవైపు తనను కలుస్తున్న నాయకులు, అభిమానులతో మాగుంట తనకు సీటు విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదని, అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందో కూడా తనకు తెలియదని చెబుతున్నారు. తన సీటు విషయంలో ప్రస్తుతానికి మాట్లాడదలుచుకోలేదని, ఇప్పటికి సంక్రాంతి శుభాకాంక్షలు మాత్రమే చెబుతానంటూ పొంగల్‌ విషెస్‌ తెలిపారు.

తెరపైకి కొత్త అభ్యర్దులు…

ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్ధి ఎంపిక విషయంలో వైసీపీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతోంది. సిట్టింగ్‌ ఎంపీ మాగుంటకు నో చెప్పిన అధిష్టానం, కొత్త అభ్య్రర్ధుల వేటలో పడిందట. ఇక్కడి నుంచి పోటీ చేయించేందుకు వైవీ విక్రాంత్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మద్దిశెట్టి వేణుగోపాల్‌ పేర్లు పరిశీలన చేస్తోందట. అయితే సిట్టింగ్‌ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికే టికెట్ ఇవ్వాలంటూ బాలినేని శ్రీనివాసులురెడ్డి పట్టుపడుతున్నారు. దీంతో మాగుంటకు కాకుండా కొత్త అభ్యర్ధులకు టికెట్‌ ఇస్తే బాలినేని సహకారం ఉంటుందా అన్న అనుమానాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఒకవైపు మాగుంటకు చెక్‌ పెడుతూనే మరోవైపు బాలినేనితో అధిష్టానం పెద్దలు మంతనాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో ఉన్న బాలినేనితో సజ్జల రామకృష్ణా రెడ్డి, విజయసాయి రెడ్డి ఫోన్‌లో టచ్‌లో ఉంటున్నారు. తాజా పరిణామాల నేపధ్యంలో వైసీపీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తుండటంతో ఏమో తమ గుర్రం ఎగరావచ్చు.. అంటూ ఆశావహులు ఎదురు చూస్తున్నారట..

మాగుంట కోసం బాలినేని పట్టు…

ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని నియోజకవర్గాల్లో తన స్వంత కేడర్‌ని మెయింటెన్‌ చేస్తున్న ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని మాత్రం సిట్టింగ్‌ ఎంపీ మాగుంటకే సీటు కన్‌ఫర్మ్‌ చేయాలని గత కొన్ని రోజులుగా పట్టుపడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో గత పదిరోజుల క్రితం సీఎంను కలిసి మాగుంట వ్యవహారంపై క్లారిటీ తీసుకునేందుకు బాలినేని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అసలు మాగుంట ఊసే తన దగ్గర ఎత్తవద్దని సీఎం జగన్‌ కీలక నేతలకు చెప్పేశారట. మాగుంట విషయమైతే బాలినేని తనను కలవాల్సిన అవసరం లేదని, ఆయన సీటు విషయంలో మాత్రమే కలవవచ్చని సంకేతాలు పంపించారట. దీంతో బాలినేని తీవ్ర అసంతృప్తికి లోనై హైదరాబాద్‌కు వెళ్ళిపోయారు.

శుక్రవారం కొండేపి, సంతనూతలపాడు అభ్యర్ధుల పరిచయ కార్యక్రమానికి కూడా బాలినేనిని ఆహ్వానించినా ఆయన డుమ్మా కొట్టారు. హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. ఈ పరిచయ సభలకు రీజనల్ కో ఆర్డినేటర్ విజయసాయి రెడ్డి హాజరై కార్యక్రమాలను ముగించారు. ఈ సమావేశాలకు బాలినేనితో పాటు ఆయనకు మద్దతుగా ఉన్న సంతనూతలపాడు ఎమ్మెలే టిజెఆర్‌ సుధాకర్‌బాబు, కొండపి మాజీ ఇన్‌చార్జి మాదాసి వెంకయ్యలు కూడా హాజరుకాలేదు. దీంతో ఒంగోలు ఎంపీ సీటు ఎంపిక వ్యవహారంలో బాలినేని పట్టువిడుపుల కధను సుఖాంతం చేసేందుకు సజ్జల, విజయసాయి హైదరాబాద్‌లో ఉన్న బాలినేనితో సంప్రదింపులు జరుపుతున్నారట.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…