Weekend Hour: ఆపరేషన్ కాపు.. ఏపీ పాలిటిక్స్‌లో కొత్త ట్విస్టులు..
Andhra Pradesh: ఏపీ రాజకీయాల్లో కాపుల మద్దతు పార్టీలకు ఎంతో కీలకం. అనేక ఎన్నికలు ఈ విషయాన్ని స్పష్టం చేశాయి. కాపులు ఎవరి వైపు నిలిస్తే.. విజయం వారిదేనని రాజకీయ పార్టీలు కూడా బలంగా నమ్ముతుంటాయి. తాజాగా ఏపీ కాపు పాలిటిక్స్‌లో కొత్త ట్విస్టులు కనిపిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

Weekend Hour: ఏపీ రాజకీయాల్లో కాపు రాజకీయాలు కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. ప్రతి ఎన్నికల్లో కాపులు అండగా నిలిచే రాజకీయ పార్టీ మారుతూ ఉంటుంది. టీడీపీ అధికారంలోకి వచ్చినా.. వైసీపీ అఖండ విజయం సాధించినా.. అందులో కాపుల పాత్ర కీలకమనే చెప్పాలి. రాష్ట్రంలోని అనేక ఇతర వర్గాలతో పాటు కాపుల మద్దతును ఎక్కువగా పొందే పార్టీలు అధికారాన్ని దక్కించుకుంటుంటాయి. 2014లో టీడీపీ, జనసేన కూటమికి, 2019లో వైసీపీకి అండగా నిలిచిన కాపులు.. త్వరలోనే జరగబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరి వైపు ఉంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. టీడీపీ, జనసేన పొత్తుతో మరోసారి కాపులు ఈ కూటమికి అండగా ఉండొచ్చనే వాదన వినిపిస్తుంటే.. వైసీపీ కూడా అందుకు దీటుగా కాపుల మద్దతు కూడగట్టేందుకు తనదైన వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది.
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలోకి వెళతారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆయన వైసీపీలో చేరతారని కొద్దిరోజుల క్రితం ప్రచారం జరిగింది. తాజాగా ఆయన జనసేన వైపు చూస్తున్నారనే మాటలు వినపడుతున్నాయి. తాజా పరిణామాలు కూడా ఆ విషయానికి బలం చేకూర్చుతున్నాయి.
ఇదిలా ఉంటే మరో సీనియర్ కాపు నేత హరిరామజోగయ్య విడుదల చేసిన లేఖ రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపింది. పవన్ కళ్యాణ్‌తో తాను ఐదు అంశాలపై మాట్లాడానని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో జనసేన 40 నుంచి 60 సీట్లలో పోటీ చేయడం, పవన్ కళ్యాణ్ రెండున్నరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండటం అనే అంశాలు ఇందులో కీలకమైనవి.
ఓ వైపు ఏపీలో కాపుల మద్దతు దక్కించుకునేందుకు వైసీపీ, టీడీపీ-జనసేన కూటమి ప్రయత్నిస్తుంటే.. మరోవైపు కాపు ముఖ్యనేతలు కొత్త ప్రతిపాదనలు తెరపైకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో ఏపీలో ఈసారి కాపులు ఎవరి వైపు ఉంటారనే చర్చ మొదలైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




