AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఆ వీధిలో నేరం జరిగితే రెండు జిల్లాల పోలీసులకు టెన్షన్ తప్పదు..

ఆ వీధిలో క్రైమ్ జరిగితే పరిష్కారం అంత ఈజీ కాదు అక్కడ.. పోలీసులకు పెద్ద సవాలుగా మారిన గ్రామం అది.. ఎక్కడ ఏ ఘటన జరిగినా స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. కానీ అక్కడ మాత్రం అంత సులువైన పని కాదు.. ఒక పోలీస్ స్టేషన్ కాదు.. రెండు జిల్లాల పోలీసులకు తలనొప్పిగా మారిన రెండు గ్రామాల్లోని ఓ వీధి కథ అది. 

Andhra: ఆ వీధిలో నేరం జరిగితే రెండు జిల్లాల పోలీసులకు టెన్షన్ తప్పదు..
Bhogyanvaripalle Village
Ch Murali
| Edited By: |

Updated on: Dec 22, 2025 | 7:50 PM

Share

ఒకే గ్రామం… కానీ రెండు పేర్లు! అడుగు అటు ఇటు మారితే జిల్లాలే మారతాయి!! ఉత్తర వైపు అడుగు వేస్తే ప్రకాశం జిల్లా..  దక్షిణం వైపు అడుగు వేస్తే నెల్లూరు జిల్లా.  ఈ విచిత్రమైన పరిస్థితులు ఉన్న గ్రామం భోగ్యంవారిపల్లె. ఇది వాస్తవానికి నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలో ఉంది. ఈ గ్రామం మధ్యగా వెళ్లే ఒక్క వీధే జిల్లా సరిహద్దు. ఆ వీధిలో నిలబడి చూస్తే ఉత్తరం వైపు ప్రకాశం జిల్లా, దక్షిణం వైపు నెల్లూరు జిల్లా స్పష్టంగా కనిపిస్తాయి. ఒక అడుగు ముందుకేస్తే ప్రకాశం జిల్లా పరిధిలోకి… అదే అడుగు వెనక్కి వేస్తే నెల్లూరు జిల్లా హద్దుల్లోకి వెళ్లినట్లే. ఈ ప్రధాన వీధికి ఉత్తర వైపు ఉన్న ప్రాంతాన్ని ప్రకాశం జిల్లా పామూరు మండలంలోని తిరగలదిన్నెగా పిలుస్తారు. దక్షిణ వైపు ఉన్న ప్రాంతం మాత్రం నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని భోగ్యంవారిపల్లెగా కొనసాగుతోంది. భోగ్యంవారిపల్లెలో కేవలం ఏడు ఇళ్లు మాత్రమే ఉండగా… ఎదురువైపు తిరగలదిన్నెలో వందకు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయి.

ఒకే వీధిలో నివసిస్తున్నా.. ఒకరి ఓటు ప్రకాశం జిల్లాలో పడుతుంది. మరోరి ఓటు నెల్లూరు జిల్లాలో పడుతుంది. రేషన్ కార్డులు, ఓటరు జాబితాలు, పంచాయతీలు, రెవెన్యూ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లు అన్నీ జిల్లాల వారీగా వేరువేరుగా ఉన్నాయి. ఈ గ్రామం 565 జాతీయ రహదారి ఆనుకుని ఉండటంతో మరింత కీలకంగా మారింది. ముఖ్యంగా రోడ్డుకు ఇరువైపులా క్రైమ్ జరిగినప్పుడు పోలీసులకు ఇది పెద్ద తలనొప్పిగా మారుతోంది. రహదారి ఉత్తర వైపున ఘటన జరిగితే ప్రకాశం జిల్లా పోలీసుల పరిధి… దక్షిణ వైపున జరిగితే నెల్లూరు జిల్లా పోలీసుల పరిధి అవుతుంది. కానీ ఘటన జరిగిన స్థలం సరిహద్దుకు అతి దగ్గరగా ఉండటంతో.. ఎవరు కేసు నమోదు చేయాలి? ఎవరు దర్యాప్తు చేపట్టాలి? అన్నది తేల్చుకోవడానికే సమయం పడుతోంది. ప్రమాదాల సమయంలో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోంది. ఉత్తర వైపు పామూరు టౌన్ పరిధిలో ప్రమాదం జరిగితే బాధితులను ముందుగా ప్రకాశం జిల్లాకు తరలించాలా? లేక నెల్లూరు జిల్లాకు తీసుకెళ్లాలా? అన్న అయోమయం నెలకొంటోంది. కొన్ని సందర్భాల్లో నెల్లూరు పోలీసులు బాధితులను ప్రకాశం జిల్లాకు తరలిస్తే… అక్కడి ఆస్పత్రి సిబ్బందికి సమాచారం ఆలస్యంగా చేరడం వల్ల చికిత్సలో ఆలస్యం జరుగుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఈ గ్రామం మరింత హైలైట్ అవుతుంది. జిల్లాల సరిహద్దు కావడంతో ప్రకాశం, నెల్లూరు జిల్లాల పోలీసులు ఒకే 565 జాతీయ రహదారిపై పక్కపక్కనే చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తారు. ఒకే రహదారిపై రెండు జిల్లాల పోలీస్ వ్యవస్థలు కనిపించడం ఇక్కడ సాధారణ దృశ్యంగా మారింది.

అడుగు మారితే జిల్లా మారినా… మనుషుల మధ్య సంబంధాలు మాత్రం మారవు. ఇదే భోగ్యంవారిపల్లె… ఒకే ఊరు… రెండు జిల్లాలు.  రోడ్డుకి ఇరువైపులా క్రైమ్ జరిగితే పోలీసులకు పెద్ద పరీక్షగా మారిన సరిహద్దు గ్రామం. ముఖ్యంగా ఘర్షణలు, వివాదాలు జరిగినపుడు ఆ స్టేషన్ పరిధి ఏది అన్నది తేలడానికి రోజుల సమయం పడుతోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..