పెళ్లింట విషాదం.. కుమార్తెను అత్తింటికి పంపిన కాసేపటికే ఘోరం
కుమార్తె వివాహం చేసిన ఆనందం ఆ తండ్రిలో క్షణకాలమైనా నిలవలేదు. కూతురిని అత్తింటి పంపించి, వారి వెనుకే వస్తున్న అతనిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. బైక్ పై వెళ్తుండగా.
కుమార్తె వివాహం చేసిన ఆనందం ఆ తండ్రిలో క్షణకాలమైనా నిలవలేదు. కూతురిని అత్తింటి పంపించి, వారి వెనుకే వస్తున్న అతనిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. బైక్ పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటో ఢీ (Road Accident) కొట్టింది. ఈ ఘటనలో దంపతులిద్దరూ గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో తండ్రి మృతి చెందాడు. కుమార్తె పెళ్లి రోజే వధువు తండ్రి మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. చిత్తూరు జిల్లా మదనపల్లెలో జరిగిన ఈ ఘటన చూపరులను కంటతడి పెట్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం వెలిగల్లు గ్రామానికి చెందిన చలపతి, మల్లమ్మ దంపతులు. వారి కుమార్తె అరుణను మదనపల్లెకు చెందిన యువకుడికి ఇచ్చి వివాహం చేశారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు పెళ్లి వేడుక జరిగింది. అనంతరం వధూవరులను అత్తగారింటికి కారులో పంపారు. వారి వెనుకే ద్విచక్రవాహనంపై చలపతి, మల్లమ్మ బయల్దేరారు.
కురబలకోట మండలం అంగళ్లు సమీపంలోని రామక్క చెరువు కట్టపైకి రాగానే.. ఎదురుగా వస్తున్న ఆటో వీరు ప్రయాణిస్తున్న బైక్ ను ఢీ కొట్టింది. ఘటనలో దంపతులిద్దరితో పాటు, ఆటోలో ఉన్న ఆంగళ్లుకు చెందిన నాగార్జున తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చలపతి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి సిఫార్సు చేశారు. అక్కడికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. కుమార్తె పెళ్లి రోజే వధువు తండ్రి మృత్యువాత పడటంతో పెళ్లింట విషాదం నెలకొంది. చలపతి మృతితో భార్య మల్లమ్మ, వధువు అరుణతో పాటు కుటుంబ సభ్యులు రోదించిన తీరు కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Also Read
Viral Video: బండిని రివర్స్ చేశాడు.. సీన్ కాస్తా రివర్స్ అయింది.. వీడియో చూస్తే షాకే.!
యాపిల్ కంటే ఐదు రెట్లు పోషకాలు కలిగిన కివీ పండు తింటే ఎన్ని ప్రయోజనాలో..