Pulasa: చిక్కిందండి సరైన పులస.. ఎంత రేటు పలికిందో తెలుసా…?
గోదావరిలో పులసల లభ్యత గణనీయంగా తగ్గిపోయింది.యానాం నుంచి గోడితిప్ప వరకు తీరప్రాంతాల్లో మత్స్యకారులు రోజూ వేటకు బయలుదేరినా అరుదుగా మాత్రమే చేపలు చిక్కుతున్నాయి. కాలుష్యం, అధిక వేట ప్రభావంతో పులసల సంఖ్య తగ్గిపోతుండటంపై అధికారులు సంరక్షణ చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కాగా దొరికే అరాకొర పులసలు భారీ రేటుకు అమ్ముడవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ గోదావరి జిల్లాల్లో పులస చేపల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. గోదావరిలో పులసలు దొరకడం చాలా అరుదుగా మారడంతో డిమాండ్ విపరీతంగా పెరిగింది. ఫలితంగా మార్కెట్లో రేట్లు ఓ రేంజ్‌లో పెరిగాయి. తాజాగా యానాం తీరప్రాంతంలో ఒక మత్స్యకారుడి వలలో 1.6 కిలోల బరువున్న పులస చేప చిక్కింది. దాన్ని కాకినాడకు చెందిన ఓ వ్యక్తి రూ.28,000కి కొనుగోలు చేశారు. అదే రోజు మరో పులస చేప రూ.23,000కి అమ్ముడయింది. దీన్ని బట్టి పులసలకు ఏ రేంజ్ డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. కొంతమంది మాంసాహారులు ముందుగానే మత్స్యకారులకు డబ్బు ఇచ్చి పులసలు దొరికతే తమకే ఇవ్వాలని బుక్ చేసుకుంటున్నారు. సముద్రం నుంచి గోదావరికి సంతానోత్పత్తి కోసం వచ్చే విలస చేపలను స్థానికంగా పులసలు అంటారు. గోదావరిలో ఎదురీదడం వల్ల చేపలకు అమోఘమైన రుచి వస్తుంది.
అయితే కాలుష్యం, గుడ్ల ఉత్పత్తి లోపం వల్ల వీటి సంఖ్య రోజురోజుకు తగ్గిపోతోందని మత్స్య శాఖ అధికారులు చెబుతున్నారు. అందుకే జాలర్లకు పులస సంరక్షణపై అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రెండేళ్ల క్రితం గోదావరిలో పులసలు బాగా లభించేవి. కానీ గత సంవత్సరం నుండి పరిస్థితి మారిపోయింది. ధరలు విపరీతంగా పెరిగాయి. గోడితిప్ప, బోడసకుర్రు గ్రామాల్లో మత్స్యకారులు రోజూ వేటకు వెళ్లినా, చాలాసార్లు చేపలు దొరకక నిరాశతో తిరిగి వస్తున్నారు. దీని ప్రభావంగా కేవలం 1 కిలో పులస చేపకు కూడా రూ.20,000 వరకు రేటు వస్తోంది.
ఇక గోదావరిలో పులసలు దొరకకపోయినా, యానాం మార్కెట్లో విలసలు లభిస్తున్నాయి. కొంతమంది వ్యాపారులు ఈ పరిస్థితిని లాభదాయకంగా మలుచుకుంటున్నారు. కోల్‌కతా, హౌరా ప్రాంతాల నుండి విలసలను తెప్పించి, పులసల పేరుతో విక్రయిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
