TV9 Impact: టీవీ9 కథనాలతో అంబులెన్స్ మాఫియాపై యాక్షన్.. గూడూరు ప్రభుత్వాస్పత్రి అధికారులకు వార్నింగ్
టీవీ9 కథనాలతో అంబులెన్స్ మాఫియాపై అధికారులు రంగంలోకి దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన గూడూరు ప్రభుత్వాస్పత్రి ఆర్‌ఎంవో, సూపరింటెండెంట్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. అక్కడ వాళ్లు చెప్పిందే ఫైనల్, ఎంత అడిగితే..
టీవీ9 కథనాలతో అంబులెన్స్ మాఫియాపై అధికారులు రంగంలోకి దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన గూడూరు ప్రభుత్వాస్పత్రి ఆర్‌ఎంవో, సూపరింటెండెంట్స్‌కు వార్నింగ్ ఇచ్చారు. అక్కడ వాళ్లు చెప్పిందే ఫైనల్, ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందే, వాళ్లు అడిగినంతా ఇవ్వకపోతే ఇక అంతే సంగతులంటూ ప్రైవేట్ అంబులెన్స్ మాఫియాపై టీవీ9 ప్రసారం చేసిన కథనాలకు స్పందన లభించింది. రోగులను, పేదలను రాబందుల్లా పీక్కుతింటోన్న అంబులెన్స్ మాఫియాపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. తిరుపతి జిల్లా గూడూరులో మృతదేహాన్ని తరలించేందుకు వేల రూపాయలు డిమాండ్ చేసి, బాధితులపై దౌర్జన్యం చేసిన అంబులెన్స్ డ్రైవర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. టీవీ9 కథనాలతో స్పందించిన జిల్లా కలెక్టర్, సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన గూడూరు ఆర్డీవో ప్రభుత్వాస్పత్రి దగ్గర విచారణ చేపట్టారు. అంబులెన్స్ మాఫియా ఆగడాలు నిజమేనని నిర్ధారించుకుని కంప్లైంట్ చేశారు. గూడూరు ఆర్డీవో ఫిర్యాదుతో అంబులెన్స్ ఓనర్స్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
అంతే కాకుండా అంబులెన్స్ నిర్వాహకులతో పాటు గూడూరు ప్రభుత్వాస్పత్రి ఆర్‌ఎంవో, సూపరింటెండెంట్‌పై ఆర్డీఓ రిపోర్ట్ ఇచ్చారు. ఆస్పత్రి ఆవరణలోనే ఈ తతంగమంతా జరుగుతున్నా ఆర్‌ఎంవో, సూపరింటెండెంట్ పట్టించుకోవడం లేదన్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. అయితే, ఇది గూడూరు ప్రభుత్వాస్పత్రి దగ్గర మాత్రమే ఉన్న పరిస్థితి కాదు. స్టేట్‌లో ప్రతి హాస్పిటల్ దగ్గరా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. గూడూరు ఇన్సిడెంట్‌తో మరోసారి స్టేట్‌వైడ్‌గా అంబులెన్స్ మాఫియాపై యాక్షన్ తీసుకోవాల్సిన సీన్ కనిపిస్తోంది.
కాగా.. తిరుపతి జిల్లాలో మరోసారి అంబులెన్స్ మాఫియా రెచ్చిపోయింది. రుయా ఆస్పత్రి ఇన్సిడెంట్ తర్వాత ఈ ఘటన జరగడం కలకలం రేపింది. అడిగినంత డబ్బు ఇచ్చుకోలేక ఆనాడు ఓ తండ్రి కన్నకొడుకు మృతదేహాన్ని తన భుజాలపై మోసుకెళ్లిన ఘటనను మరవకముందే తిరుపతి జిల్లా గూడూరులో అలాంటి ఘటనే జరిగింది. రోడ్డుప్రమాదంలో మరణించిన ఓ యువకుడి మృతదేహాన్ని తరలించడానికి వేల రూపాయలు డిమాండ్ చేశారు. అంత డబ్బు ఇవ్వలేని ఆ నిరుపేద తండ్రి బయటి నుంచి వాహనాన్ని పిలిపించుకున్నాడు. అతడికి అంబులెన్స్ మాఫియా అడ్డుకుంది. దాంతో బాధితులు ఆందోళనకు దిగారు. కూలి చేసుకుని బతికే తాము, పదిహేను కిలోమీటర్లకు నాలుగు వేలు అడిగితే ఎక్కడ్నుంచి తెచ్చివ్వాలని వాపోయారు. అంబులెన్స్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..