Godavari: పోలవరం వద్ద పోటెత్తుతున్న గోదావరి.. కాఫర్ డ్యాం ఎత్తు పెంపునకు అధికారుల ప్రయత్నాలు
భారీగా వస్తోన్న వరదతో గోదావరి (Godavari) ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, జలాశయాల నుంచి నీటి విడుదలతో ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోంది. ఈ నీరంతా పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ....

భారీగా వస్తోన్న వరదతో గోదావరి (Godavari) ఉగ్రరూపం దాల్చుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, జలాశయాల నుంచి నీటి విడుదలతో ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తోంది. ఈ నీరంతా పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరిలో వరద పెరుగుతుండటంతో పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఎగువ కాఫర్ డ్యామ్‌ను పటిష్ఠపరచాలని నిర్ణయించింది. దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై కాఫర్ డ్యామ్ ఎత్తును మరో మీటరు పెంచేందుకు పనులు ప్రారంభించారు. మట్టి, ఇసుక బస్తాలు వేసి కట్టను గట్టిపరిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఎగువ కాఫర్ డ్యామ్, స్పిల్ వే వద్ద వరద ఉద్ధృతి 20.37 లక్షల క్యూసెక్కులు కొనసాగుతోంది. ఇది రేపటికి (శనివారం) 28 లక్షల క్యూసెక్కులకు చేరవచ్చని నిపుణులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా కాఫర్ డ్యామ్ ఎత్తు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
కాగా.. ఉత్తర తెలంగాణ నుంచి సాగరసంగమం వరకు గోదావరి పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ పరిస్థితుల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ (CM Jagan).. ఏరియల్ సర్వే నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు, ధవళేశ్వర్యం బ్యారేజీ, లంక గ్రామాల్లోని పరిస్థితులను పరిశీలించారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రభావిత గ్రామాలను ఖాళీ చేయించాలని సూచించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 70.10 అడుగులకు చేరింది.
గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ గా సమావేశమయ్యారు. ఏరియల్ సర్వే తర్వాత ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు ఇతర అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. గోదావరి వరద ఉదృతి, సహాయక చర్యలపై సమీక్షించారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, రాష్ట్ర స్థాయి అధికారులకు దిశానిర్దేశం చేశారు సీఎం జగన్. వచ్చే 24 గంటలు హైఅలర్ట్‌గా ఉండాలని సీఎం ఆదేశించారు. సహాయ శిబిరాల్లో ఉండే ప్రతి కుటుంబానికీ రూ.2వేల ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రాజమహేంద్రవరంలో 2 హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచామని, అత్యవసర సర్వీసుల కోసం వాటిని ఉపయోగించుకోవాలని సూచించారు.


