NTR District: ఎన్టీఆర్ జిల్లాలో నాన్న పాడే మోసిన కుమార్తెలు..
సమాజంలో ఇప్పటికీ “కుమారుడు ఉంటేనే తండ్రికి అంతిమ సంస్కారాలు జరుగుతాయి” అనే పాత ఆలోచన బలంగా ఉంది. కానీ ఆ మాటలన్నింటికీ గట్టి సమాధానం చెప్పారు… ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన నలుగురు కుమార్తెలు. .. ..

సమాజంలో ఇప్పటికీ కుమారుడే తండ్రికి అంతిమ సంస్కారాలు చేయాలి అనే పాత ఆలోచన బలంగా ఉంది. కానీ ఆ మాటలన్నింటికీ గట్టి సమాధానం చెప్పారు.. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నరసాపురం గ్రామానికి చెందిన నలుగురు కుమార్తెలు. గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గంధం సుబ్రహ్మణ్యేశ్వరరావు (75) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గ్రామంలో మంచి పేరు సంపాదించుకున్న ఆయన.. ఎవరికైనా అవసరం వస్తే ముందుండి సహాయం చేసేవారిగా గుర్తింపు పొందారు. ఆయన మృతి వార్తతో గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది. అయితే ఈ విషాదంలోనూ నలుగురు కుమార్తెలు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. మా నాన్న చివరి కర్తవ్యాన్ని మేమే నిర్వహిస్తాం అంటూ ముందుకు వచ్చారు. నలుగురు కలిసి తండ్రి పాడెను స్వయంగా భుజాన మోసి తీసుకెళ్లారు. ఆ దృశ్యాలు చూసిన గ్రామస్తులు, బంధువులు భావోద్వేగానికి లోనయ్యారు. చాలామంది కంటతడి పెట్టారు. ఇక్కడితో ఆగకుండా.. అంతిమ సంస్కారాలను కూడా కుమారుల్లానే పూర్తిగా స్వయంగా నిర్వహించారు. తండ్రి పట్ల ప్రేమ, గౌరవం, బాధ్యతను ఈ విధంగా చాటిచెప్పారు. ఆడపిల్లలు కూడా కుటుంబానికి అండగా నిలబడతారు.. అవసరమైతే కొడుకుల్లానే అన్ని బాధ్యతలు భుజాన వేసుకుంటారు అని ఈ సంఘటన మరోసారి స్పష్టం చేసింది. విషయం తెలుసుకున్న విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.
Also Read: అక్కడ పది రోజుల పాటు చికెన్, ఎగ్స్ తినకపోవడం మంచిది..
