AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Krishnapatnam Ayurvedic: కృష్ణపట్నం ఆయుర్వేదంపై లోకాయుక్తకు కలెక్టర్ రిపోర్ట్‌.. రేపటి నుంచి మందు పంపిణీకి గ్రీన్‌ సిగ్నల్..!

నెల్లూరు ఆనందయ్య మందుపై ఉన్న అనుమానాలకు ఇంకా క్లారిటీ రాలేదు. అయినా సంజీవనిగా ప్రచారం జరుగుతోంది. రేపటి నుంచి పంపిణీ పునః ప్రారంభానికి కూడా ఏర్పాట్లు సాగిపోతున్నాయి.

Krishnapatnam Ayurvedic: కృష్ణపట్నం ఆయుర్వేదంపై లోకాయుక్తకు కలెక్టర్ రిపోర్ట్‌.. రేపటి నుంచి మందు పంపిణీకి గ్రీన్‌ సిగ్నల్..!
Krishnapatnam Naatu vaidhyam
Balaraju Goud
|

Updated on: May 20, 2021 | 5:45 PM

Share

Krishnapatnam Ayurvedic Medicine: నెల్లూరు ఆనందయ్య మందుపై ఉన్న అనుమానాలకు ఇంకా క్లారిటీ రాలేదు. ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. అసలు దీంతో కరోనా తగ్గుతుందో లేదో కూడా చెప్పలేం. అయినా సంజీవనిగా ప్రచారం జరుగుతోంది. రేపటి నుంచి పంపిణీ పునః ప్రారంభానికి కూడా ఏర్పాట్లు సాగిపోతున్నాయి.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నం మందుపై ఉన్న అనుమానాలకు ఇంకా స్పష్టత రాలేదు. ఆనందయ్య ఇచ్చిన మందుపై ఇంకా సస్పెన్స్‌ వీడలేదు. ఇది మందా కాదా.. కరోనా రోగాన్ని ఎంతవరకు నయం చేస్తుంది అనేది తేలలేదు. శాస్త్రీయంగా మందుపై ఎలాంటి నివేదిక సిద్ధం కాలేదు. కానీ, నెల్లూరు జిల్లా కలెక్టర్‌ మాత్రం మందుపై ఎలాంటి అభ్యంతరాలు లేవని తేల్చేశారు. దీనిపై లోకాయుక్తకు ఓ నివేదిక కూడా ఇచ్చారు.

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఇచ్చే మందుపై లోకాయుక్తకు కలెక్టర్‌ నివేదిక ఇప్పుడు వివాదమవుతోంది. కృష్ణపట్నంలో ఆనందయ్య ఇచ్చే మందు తయారీ, ఎఫెక్ట్స్‌, ప్రజల ఫీడ్‌ బ్యాక్‌ ఈ రిపోర్ట్‌లో వివరించారు కలెక్టర్. ఆనందయ్య మందుతో ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ లేవని.. మందు తీసుకున్న వారిలో ఆక్సిజన్ లెవల్స్ పెరిగినట్టు కూడా రిపోర్ట్ చేశారు కలెక్టర్.

కలెక్టర్ ఇచ్చిన నివేదికపై వైద్యనిపుణుల నుంచి చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ లేవని చెప్పడానికి ఉన్న శాస్త్రీయత ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ మందు వాడితే కరోనా పూర్తి నయమవుతుందని ప్రభుత్వం ఇప్పటి వరకు చెప్పలేదు. ఎలాంటి పరీక్షలు లేకుండా ఈ మందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఆయన చెప్పిన ఇన్‌గ్రేడియంట్స్‌తో సామాన్యులు మందులు తయారు చేసుకొని వాడితే జరిగే నష్టానికి బాధ్యులు ఎవరు అవుతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆనందయ్య ఇచ్చే మందులో ఔషధ గుణాలు ఉన్నాయో లేదో తేలకుండానే జిల్లా యంత్రాంగం పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వడంపై అలోపతి వైద్యులు మండిపడుతున్నారు.

ఈ అనుమానాలు ఇలా ఉండగానే రేపటి నుంచి మందు పంపిణీకి సిద్ధమైపోతున్నారు ఆనందయ్య. అధికారుల నుంచి క్లియరెన్స్ రాకుండానే ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అంతేనా ఐసీయులో ఉన్న పేషెంట్‌ను కూడా పరిగెత్తిస్తానంటున్నారు ఆనందయ్య. ప్రభుత్వం నుంచి మద్దతు ఉంటే ఉచితంగానే ఎంత మందికైనా మందు అందిస్తానంటున్నారు. గత 30 ఏళ్లుగా ఆయుర్వేద వైద్యం చేస్తున్నానని, తనకు వారసత్వంగా ఇది వచ్చిందంటున్నారు.

మరోవైపు, జనం కూడా వైద్యులు చెబుతున్న అభ్యంతరాలు పట్టించుకోవడం లేదు. మూడు రోజులుగా పంపిణీ నిలిచిపోయినా మందు కోసం వస్తూనే ఉన్నారు. కరోనా మందు పంపిణీపై స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. కరోనా నిబంధనలు పాటిస్తూ రేపటి నుంచి పంపిణీ చేస్తామన్నారు. ఈ మందుతో ఎలాంటి హాని ఉండదని ఆయన కూడా భరోసా ఇస్తు్న్నారు. చాలా మంది ఆరోగ్యం కుదుటపడిందని…అందుకే పంపిణీ పునః ప్రారంభించాలని నిర్ణయించామన్నారు.

మొత్తానికి ఆనందయ్య ఇచ్చే మందుపై ఉన్న డౌట్స్ తేలనే లేదు. ఐనా మందు పంపిణీ కోసం జరుగుతున్న ఏర్పాట్లపై అలోపతి వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక అర్హత లేని వ్యక్తి చేసే మందును ఎలా అనుమతిస్తారని నిలదీస్తున్నారు. కంట్లో వేసే మందుతో దుష్పరిణామాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. అలోపతి వైద్యుల అభ్యంతరాలతో ఇప్పుడు ఈ వివాదం మరింత ముదిరే ఛాన్స్ కనిపిస్తుంది.

Read Also…  Corona Ayurveda medicine : ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు పంపిణీపై స్పష్టతనిచ్చిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి