Andhra Pradesh: గంజాయి బ్యాచ్‌ల ఆట కట్టించేందుకు రంగంలోకి స్నిఫర్ డాగ్స్.. ఎలాంటి శిక్షణ పొందాయో తెలిస్తే పరుగో పరుగు..!
Visakhapatnam
ఇకపై మీరు విశాఖ రైల్వే స్టేషన్ కు వెళ్తే అక్కడ మీకో కొత్త నేస్తం కనిపిస్తుంది. మన భద్రత, రక్షణ తో పాటు నార్కోటిక్స్ శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్‌లు మనలని పలకరిస్తాయి. తాజాగా విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో నార్కోటిక్స్ శిక్షణ పొందిన స్నిఫర్ డాగ్‌లను ప్రవేశపెట్టారు. మొదటి రోజు 12 కిలోల గంజాయి రికవరీ చేసి తన ఆవశ్యకతను తెలియ చేసింది విక్క్. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, విశాఖ సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసుల సమన్వయ, సంయుక్త ప్రాజెక్ట్ ఇది. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించడంలో మరియు పట్టుకోవడంలో ఈ స్నిఫర్ డాగ్స్ కీలక పాత్ర పోషించనున్నాయి.
తొలిరోజే ట్రైన్ లో సరఫరా కు సిద్దంగా ఉన్న 12 కిలోల గంజాయి బ్యాగ్ లను గుర్తించిన స్నిఫర్ డాగ్ విక్కీ ఎప్పటినుంచో ఈ ప్రయోగాన్ని అమలు చేయాలని అనుకుంటూ ఉన్నా మొన్న డిసెంబర్ 2న తొలి ప్రయత్నం జరిగింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ నెం.6&7లో హెడ్ కానిస్టేబుల్ సఫీక్ మహ్మద్ & K.S.పాత్ర నేతృత్వంలో నార్కోటిక్స్ డాగ్ విక్కీ తనిఖీలు చేపట్టింది.
రాత్రి 8.55 గంటల సమయంలో ప్లాట్‌ఫారమ్ నెం.6లో రైలు నెం.08552 ఎక్స్‌ప్రెస్ వచ్చినప్పుడు ఒక్కొక్కటి సుమారు 06కిలోల గంజాయి కల మొత్తం 12కిలోలు ఉన్న రెండు బ్యాగ్ లను విక్కీ గుర్తించింది. గుర్తించిన వెంటనే రైల్వే రక్షక దళ ఇన్‌స్పెక్టర్ బృందం వెంటనే స్పందించింది. బ్యాగ్ యజమాని ఆచూకీ కోసం వెతికారు. అదే సమయంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లోని గేట్ నెం.05 సమీపంలో ముగ్గురు వ్యక్తులను టాస్క్‌ఫోర్స్ విశాఖపట్నం అదుపులోకి తీసుకున్నారు. వారిని తమదైన శైలిలో విచారించగా తాము గంజాయిని కొనుగోలు చేసి రైలు నెం.08552 ఎక్కి విశాఖపట్నం చేరుకున్నామని వెల్లడించారు. అయితే, డాగ్ స్క్వాడ్ తనిఖీలో గుర్తించడం తో భయంతో ప్లాట్‌ఫారమ్ నెం.6లో రెండు బ్యాగులను వదిలి, ఒక బ్యాగ్‌తో గేట్ నెం.05 వైపు పారిపోతున్నట్టు తెలిపారు. ఆ సమయంలో టాస్క్ ఫోర్స్ కు పట్టుభడ్డట్టు వివరించారు. దీంతో ట్రైన్ లో రికవరీ చేసిన మొత్తం 12 కిలోల గంజాయి సంచులతో కలిపి నిందితులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం విశాఖపట్నం టాస్క్‌ఫోర్స్ అదుపులోకి తీసుకుంది.
గంజాయి రవాణాను అడ్డుకునేందుకే..
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రా, అందులోనూ విశాఖ కేంద్రంగా గంజాయి అక్రమ రవాణా శృతి మించుతోంది. గంజాయి రవాణా అడ్డుకునేందుకు పోలీసులు వేస్తున్న ఎత్తులకు స్మగ్లర్లు పై ఎత్తులు వేసి గంజాయిని రాష్ట్రాలు దాటిస్తున్నారు. విశాఖ ఏజెన్సీ లో గంజాయి పంట గతంలో పండించే వారు. ఆపరేషన్ పరివర్తన పేరుతో ఆ అక్రమ గంజాయి సాగును అధికారులు ఇప్పుడు అరికట్టారు. కానీ ఏజెన్సీ నీ అనుకుని ఉన్న పొరుగు రాష్ట్రాల్లో పండుతున్న గంజాయి విశాఖ ద్వారా రవాణా అవుతోంది. దీంతో ఈ రవాణా ను అడ్డుకునేందుకు పోలీసులు అనేక చర్యలు చేపట్టారు. ఇన్ఫార్మర్ల వ్యవస్థ తో పాటు చెక్ పోస్టు లు, నిరంతర నిఘా, తనిఖీ లు పెట్టారు. అయినా ఆగడం లేదు. యధేచ్చగా సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్ లో నార్కోటిక్ శిక్షణ పొందిన ఈ స్నిఫర్ డాగ్ ను ప్రవేశ పెట్టారు. భవిష్యత్ లో మరిన్ని ఈ తరహా స్నిఫర్ డాగ్ లను ప్రవేశ పెట్టాలన్న ఆలోచన లో అధికారులు ఉన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..