నల్లారి ఫ్యామిలీ నుంచి మూడోతరం పొలిటికల్ ఎంట్రీ? ఉమ్మడి ఏపీ ఆఖరి సీఎం ప్లాన్ ఏంటి?
పొలిటికల్‌గా ఆయన నిర్ణయాలన్నీ సస్పెన్సే.. బీజేపీ లో కొనసాగుతున్న ఆయన వ్యూహం ఏంటన్నది కూడా ఇప్పుడు కేడర్ కు అంతు చిక్కనిదే. ఒక వైపు సొంతూరులో చక చకా ఇంటి నిర్మాణం, మరో వైపు క్యాడర్ కు కొడుకును దగ్గర చేసే ప్రయత్నం. ఇదే ఇప్పుడు పెద్ద చర్చ గా మారింది. రానున్న ఎన్నికలకు కొడుకును సిద్ధం చేయడానికేనా... అందుకే రాజకీయ వారసుడిగా అందరికీ పరిచయం చేయిస్తున్నాడా... అనుచరుల కన్ఫ్యూజన్ ఏంటి..? నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆంతర్యమేంటి..?

ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలిటిక్స్‌లో ఆ కుటుంబాకో ప్రత్యేక స్థానం ఉంది. దాదాపు 5 దశాబ్దాలకుపైగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్న ఆ కుటుంబం 2024 సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసింది. మాజీ సీఎం నల్లారి కిరణ్, నల్లారి కిషోర్ అన్నదమ్ములిద్దరూ చెరో పార్టీ నుంచి బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించు కున్నారు. పీలేరు నుంచి పోటీ చేసిన తమ్ముడు నల్లారి కిషోర్ టీడీపీ ఎమ్మెల్యే గా గెలిస్తే, బీజేపీ నుంచి రాజంపేట పార్లమెంట్ కు పోటీ చేసిన అన్న నల్లారి కిరణ్ ఓడి పోయారు. పీలేరు అసెంబ్లీకి వరుసగా మూడోసారి పోటీ చేసిన కిషోర్ కు ఓటర్లు పట్టం కట్టగా, రాజంపేట పార్లమెంటు నుంచి తొలిసారి లోక్ సభకు పోటీ చేసిన అన్న నల్లారి కిరణ్ కు మాత్రం ఓటమి తప్పలేదు. అయితే నల్లారి ఫ్యామిలీ కున్న ఇమేజ్ కు తగ్గట్టుగానే ఇప్పుడు మూడో తరం వారసత్వం తెరమీదికి వస్తోంది.
ఇప్పట్లో ఎన్నికలు లేకపోయినా అప్పుడే నల్లారి ఫ్యామిలీ నుంచి పొలిటికల్ వారసత్వం హడావుడి కొనసాగుతోంది. ఈ విషయమే ఇప్పుడు పీలేరులో చర్చగా మారింది. మాజీ సీఎం కిరణ్ కొడుకు నిఖిలేష్ రెడ్డి యాక్టివ్ కావడం చూస్తే అదే నిజమనిపిస్తుంది. ఎంబీఏ పూర్తిచేసిన నిఖిలేష్ రెడ్డి ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బిజినెస్ లో రాణిస్తుండగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో తండ్రి కిరణ్ వెంట రాజకీయ అడుగులు వేయడం ప్రారంభించారు. రాజంపేట ఎంపీగా పోటీ చేసిన తండ్రి కిరణ్ ఎన్నికల ప్రచారంలో కీలకంగా వ్యవహరించడంతో కొడుకు సత్తా తండ్రికి అర్థమైంది. సొంతూరి కే కాకుండా కిరణ్ ఎక్కడికి వెళ్లినా తండ్రి వెంట నడుస్తున్న కొడుకు పొలిటికల్ ఎంట్రీ ఖాయమన్న చర్చ కు దారి తీసింది.
ఇప్పటిదాకా కొడుకు నికిలేష్ రెడ్డిని తన వారసుడని కిరణ్ చెప్పకపోయినా స్థానిక లీడర్లకు, కేడర్ కు పరిచయం చేసి వాళ్లతో మమేకమయ్యేలా ప్రయత్నిస్తున్నారు. నిఖిలేష్ రెడ్డి కూడా అదే రీతిలో దూసుకుపోతున్నారు. కలుపుగోలుగా కేడర్ తో నడుచుకుంటున్న నికిలేష్ రెడ్డి నల్లారి ఫ్యామిలీ లో మూడో తరం రాజకీయాల్లోకి వచ్చిందన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. నిఖిలేష్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ కన్ఫర్మ్ అయితే ఆయన పోటీ చేసే స్థానం ఏదన్న దానిపైనా చర్చ ప్రారంభమైంది. ఇప్పటికే పీలేరు ఎమ్మెల్యేగా బాబాయ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తుండగా నిఖిలేష్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ పై కేడర్ లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. నిఖిలేష్ రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే పోటీ చేసేదెక్కడన్న చర్చ కూడా కేడర్ లో వినిపిస్తోందట.
2029 ఎన్నికలే నిఖిలేష్ రెడ్డి టార్గెట్ అయితే పోటీ చేసే నియోజకవర్గం ఏదన్న దానిపై కేడర్ లో ఉత్కంఠ నెలకొంది. బాబాయ్ ఎమ్మెల్యే గా ఉన్న పీలేరు నుంచి బరిలో ఉంటారా.. లేదంటే తండ్రి పోటీ చేసి ఓడిపోయిన రాజంపేట పార్లమెంటు నుంచి పోటీ చేస్తారా అన్న విషయాన్ని కూడా కేడర్ చర్చించు కుంటోంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్తగా ఏర్పడబోయే నియోజకవర్గానికి వెళ్తారా… లేదంటే నల్లారి ఫ్యామిలీకి బలమైన బంధు గణం ఉన్న తంబళ్లపల్లి ని నిఖిలేష్ రెడ్డి ఎంచుకుంటారా అన్నదానిపైనా చర్చ నడుస్తోంది. అయితే ఎవరికీ అంతుపట్టని కిరణ్ వ్యూహం, అంతు చిక్కని ఆంతర్యంపై పలు సందేహాలు వ్యక్తమవు తున్నాయి. నగరిపల్లిలో పెద్ద ఎత్తున సొంతింటి నిర్మాణం, చకచకా జరుగుతున్న నిర్మాణ పనులు చూస్తే వారసుడి పొలిటికల్ ఎంట్రీ కి కిరణ్ లైన్ క్లియర్ చేశారన్న విషయం మాత్రం స్పష్టం అవుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.