Andhra Pradesh: అయ్యో పాపం.. విలవిలలాడిన గోమాతలు.. కంటైనర్లలో కుక్కి దారుణంగా..
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ హైవేపై అర్ధరాత్రి వేళ భారీ గోవుల అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయింది. మూగజీవాలను కంటైనర్లలో నరకప్రాయంగా కుక్కి తరలిస్తున్న వైనాన్ని స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అడ్డుకున్నారు. ఒక్కో వాహనంలో 70కి పైగా గోవులను ఊపిరి ఆడలేని స్థితిలో తరలిస్తున్న దృశ్యాలు చూసిన వారందరినీ కలిచివేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న గోవుల ముఠా గుట్టును స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ రట్టు చేశారు. కంటైనర్లలో మూగజీవాలను కుక్కి తరలిస్తున్న వైనాన్ని చూసి స్థానికులు, గోప్రేమికులు చలించిపోయారు. తెలంగాణ నుంచి కడప జిల్లా వైపు భారీ కంటైనర్లలో గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారంతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అర్ధరాత్రి సమయంలో ఆళ్లగడ్డ సమీపంలోని అల్ఫా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. వేగంగా వెళ్తున్న కంటైనర్లను స్వయంగా అడ్డుకున్నారు.
కంటైనర్లలో నరకం..
ఎమ్మెల్యే అడ్డుకున్న ఐదు కంటైనర్లను తెరిచి చూడగా, లోపల దృశ్యం అత్యంత భయంకరంగా ఉంది. ఒక్కో కంటైనర్‌లో సుమారు 70కి పైగా ఆవులను ఊపిరి ఆడకుండా, కదలలేని స్థితిలో కుక్కి తరలిస్తున్నారు. ఈ కంటైనర్ల వెనుక ఒక ఇన్నోవా కారు నిరంతరం ఫాలో అవుతూ నిఘా ఉంచుతున్నట్లు ఎమ్మెల్యే గుర్తించారు. ఇప్పటికే దాదాపు 10 లారీలు ముందుకు వెళ్లిపోయి ఉంటాయని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసుల రంగప్రవేశం
పట్టుకున్న ఐదు కంటైనర్లను ఎమ్మెల్యే పోలీసులకు అప్పగించారు. ఈ అక్రమ రవాణా వెనుక ఉన్నది ఎవరు? వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ ప్రయోజనం కోసం తరలిస్తున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ దందా వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ.. “మూగజీవాలను ఇలా నరకప్రాయంగా తరలించడం అమానుషం. గోమాతలను కాపాడటం మన బాధ్యత. ఇలాంటి అక్రమ రవాణాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోం” అని హెచ్చరించారు.
