RRB Exam Date 2025: మరో వారంలోనే ఆర్‌ఆర్‌బీ జేఈ రాత పరీక్ష.. అడ్మిట్ కార్డులు ఎప్పుడంటే?
రైల్వే శాఖ జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన సీబీటీ-2 పరీక్షలను ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను పరీక్షకు నాలుగు రోజుల ముందు..

హైదరాబాద్, ఏప్రిల్ 13: రైల్వే శాఖలో పలు నియామక పరీక్షల తేదీలను ఇటీవల రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో రైల్వే శాఖ జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించిన సీబీటీ-2 పరీక్షలను ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్నట్లు వెల్లడించింది. ఈ పరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను RRB తాజాగా విడుదల చేసింది. ఈ మేరకు ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్ష నగరానికి సంబంధించిన వివరాలను పొందుపరిచింది. ఇక రాత పరీక్షకు నాలుగు రోజుల ముందు అడ్మిట్ కార్డులను కూడా వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు. సీబీటీ 2 పరీక్షకు అర్హత సాధించిన దాదాపు 20,792 మంది ఈ పరీక్ష రాయనున్నారు. కాగా ఈ నోటిఫికేషన్ కింద దేశ వ్యాప్తంగా అన్ని రీజియన్లలో ఈ రాత పరీక్ష ద్వారా జేఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 7,951 జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్ తదితర ఖాళీలు ఈ ప్రకటన ద్వారా భర్తీ కానున్నాయి.
మరోవైపు జూనియర్ ఇంజినీర్, కెమికల్ సూపర్‌వైజర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ సీబీటీ-2 పరీక్షలకు రైల్వే శాఖ మాక్ టెస్టులను కూడా అందుబాటులో ఉంచింది. ఆన్‌లైన్‌లో ఎలాంటి పాస్‌వర్డ్ లేకుండానే వివిధ పేపర్ల మాక్ టెస్టులు ఉచితంగానే వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది.
ఆర్‌ఆర్‌బీ జేఈ సిటీ ఇంటిమేషన్ స్లిప్పుల 2025 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
354 మంది లైవ్‌స్టాక్ అసిస్టెంట్లకు పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు.. త్వరలోనే ఈ ఉద్యోగాలకు కొత్త ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 354 మంది వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించారు. వీరిని లైవ్‌స్టాక్ అసిస్టెంట్లుగా ప్రమోషన్ కల్పిస్తూ రేవంత్ సర్కార్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. దీర్ఘకాలంగా మూతపడి ఉన్న 354 గ్రామీణ పశువైద్యశాలల్లో వారందరికీ పోస్టింగ్‌లు ఇచ్చింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి పదోన్నతులు పొందిన వారంతా సేవలందించనున్నారు. కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లైవ్‌స్టాక్ అసిస్టెంట్ల పోస్టులు ఖాళీగా ఉండటం వల్ల దీర్ఘకాలికంగా గ్రామీణ పశువైద్యశాలలు మూతపడి ఉన్నాయి. మరోవైపు పదోన్నతుల కోసం వెటర్నరీ అసిస్టెంట్లు ప్రభుత్వానికి ఎన్నో యేళ్లుగా విన్నవిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా స్పందించిన ప్రభుత్వం గ్రామీణ పశువైద్యంలో సేవలు మెరుగుపడేందుకు పదోన్నతులు కల్పించింది. దీంతో ఖాళీ అయిన వెటర్నరీ అసిస్టెంట్ పోస్టులను పశుసంవర్ధక డిప్లొమా కోర్సు చేసిన వారితో భర్తీ చేయాలని టీఎల్‌జీవో వెటర్నరీ ఫోరం ప్రభుత్వాన్ని కోరింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.