Andhra Pradesh: అయ్యో ఏకంగా బ్రహ్మం గారి ఇల్లే కూలిపోయింది.. ఏదైనా ఉపద్రవం..?
మొంథా తుఫాన్ కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వానలకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పవిత్ర నివాసం కూలిపోవడం భక్తులను కలచివేసింది. వైఎస్సార్ కడప జిల్లాలోని బ్రహ్మంగారి మఠంలో ఉన్న ఈ 350 ఏళ్ల చరిత్ర గల ఇల్లు, భారీ వర్షాలకు గోడలు నానిపోయి ఒక భాగం కూలిపోయింది.

మొంథా తుఫాన్ తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టాన్ని మిగిల్చింది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వేల ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాల వల్ల శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఇల్లు కూలిపోయింది. వైఎస్సార్ కడప జిల్లాలో ఉన్న శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి నివాసం ఉండగా.. భారీ వర్షానికి గోడలు బాగా తడిసిపోయియా.ఈ క్రమంలో ఇంటిలోని ఒక భాగం మొత్తం కుప్పకూలింది. ఆ సమయంలో ఆ చారిత్రక భవనంలో ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లు అధికారులు, స్థానికులు తెలిపారు.
350 ఏళ్ల చరిత్ర గల భవనం
ఈ కూలిపోయిన నివాసానికి సుమారు 350 సంవత్సరాల చరిత్ర ఉందని బ్రహ్మేంద్ర స్వామి మఠం నిర్వాహకులు తెలిపారు. పూర్వపు మఠాధిపతి కుమారులు వెంకటాద్రిస్వామి, వీరంభట్లయ్య స్వామి, దత్తాత్రేయస్వామి కూలిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ పురాతన కట్టడం పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే ఉన్నాయని, త్వరలోనే పునర్నిర్మాణ పనులు మొదలు పెడతామని వెల్లడించారు.
వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం చెప్పిన మహా యోగిగా ప్రసిద్ధి చెందారు. బ్రహ్మంగారి మఠం.. ఆయన జీవ సమాధి చెందిన పవిత్ర క్షేత్రం. దీనిని కందిమల్లయపల్లె అని కూడా పిలుస్తారు. ఈ మఠానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ చారిత్రక గృహం కూలిపోవడం భక్తులను బాధించినప్పటికీ, త్వరలో పునర్నిర్మాణం జరుగుతుందని మఠం ప్రతినిధులు హామీ ఇచ్చారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
