AP Rains: ఉరుములు, మెరుపులతో ఏపీ వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్ ఇదే!
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశాపై సగటు సముద్ర మట్టానికి..
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశాపై సగటు సముద్ర మట్టానికి 1.5 ఎత్తులో నైరుతి దిశగా పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం కారణంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. మరికొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ అధికారులు అన్నారు.
వచ్చే మూడు రోజులు వాతావరణ సూచనలు ఇవే.. ——————————————
ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం :- ————————————————–
జూలై 6,7 తేదీల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన చిరుజల్లులు అనేక చోట్ల, అలాగే భారీ నుంచి అతిభారీ వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో పడవచ్చునని.. గంటకు 30-40 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే జూలై 8వ తేదీన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురవడంతో పాటు ఈదురుగాలులు ఒకట్రెండు చోట్ల వీచే అవకాశముంది.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ :- ———————–
ఇవాళ, రేపు, తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల, భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు సంభవించవచ్చు. మరోవైపు ఒకట్రెండు ప్రాంతాల్లో బలమైన గాలులు గంటకు 30-40 కిమీ వేగంతో వీచే అవకాశముంది. ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.
రాయలసీమ:-
ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల, గంటకు 30-40 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. శుక్రవారం, శనివారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల, గంటకు 30-40 కిమీ వేగంతో గాలులు ఒకట్రెండు ప్రాంతాల్లో వీచే అవకాశం ఉంది.