Andhra Pradesh: రూ.100 కోసం స్నేహితుడినే చంపిన దుర్మార్గుడు.. వైన్ షాపు దగ్గరకు వెళ్లి..
తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమన్నందుకు.. ఓ వ్యక్తి ఏకంగా అతని ప్రాణమే తీశాడు. కానీ.. ఆ తీసుకున్న అప్పెంతో తెలుసా.. కేవలం వంద రూపాయలు.. ఓన్లీ హడ్రెండ్ రూపీస్.. ఆశ్చర్యంగా ఉంది కదూ.. అవునండీ.. ఎప్పుడో తీసుకున్న వంద రూపాయలు తిరిగి ఇవ్వమన్నందుకు ఫ్రెండ్ అని కూడా చూడకుండా అతన్ని అంతమొందించాడు ఓ వ్యక్తి. ఇంతకీ.. ఏంటా వంద రూపాయల పంచాయితీ?..
కాదేది కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ.. కానీ.. ఇప్పుడు.. పరిస్థితులు మారిపోతున్నాయి. కాదేది మర్డర్‌కనర్హం అన్నట్లు పరిస్థితులు దాపురిస్తున్నాయి. నిజానికి.. వంద రూపాయలు అంటే.. ఈ రోజుల్లో అస్సలు లెక్కే లేదు. కానీ.. అదే వంద రూపాయల కోసం ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అప్పుగా తీసుకున్న వంద రూపాయలు ఇవ్వమని అడిగిన స్నేహితుడ్ని సిమెంట్ రాయితో కొట్టి చంపాడు అతని ఫ్రెండ్. మద్యం సేవించి వంద రూపాయల కోసం గంట సేపు గొడవ పడి చివరకి ఆవేశంలో తోటి మిత్రుడి ప్రాణాలు తీశాడు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ ఘటన గుంటూరు జిల్లాలో కలకలం రేపింది.
గుంటూరు కేవీసీ కాలనీకి చెందిన బాజీ, డొంకరోడ్డుకు చెందిన రవి ఇద్దరూ మంచి దోస్తులు. కలిసి కూలీ పనులకు వెళ్లేవారు. అయితే.. కొద్దిరోజుల క్రితం బాజీ.. రవి దగ్గర వంద రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆ తర్వాత బాజీ పనుల నిమిత్తం నిజామాబాద్ వెళ్ళాడు. ఈ నెల పదకొండున తిరిగి గుంటూరు వచ్చిన బాజీ.. అమరావతి రోడ్డులోని ఓ వైన్స్ షాపు దగ్గర మద్యం కొనుగోలు చేశాడు. ఆ విషయం తెలుసుకున్న రవి.. అదే మద్యం షాపునకు వెళ్ళాడు. అప్పుగా తీసుకున్న వంద రూపాయలు ఇవ్వాలని బాజీని అడిగాడు. ఆ క్రమంలో.. ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. మద్యం తాగి గొడవకు దిగారు.
ఆ తర్వాత ఇద్దరు కలిసి సమీపంలోనున్న మూసివేసిన ఓ టీ స్టాల్ దగ్గరకు వెళ్లి అక్కడ తిరిగి ఘర్షణ పడ్డారు. ఇంకేముంది.. క్షణికావేశంలో బాజీ.. సిమెంట్ రాయితో రవి తలపై గట్టిగా కొట్టాడు. దాంతో.. రవి అక్కడికక్కడే చనిపోయాడు. అయితే.. మర్డర్ తర్వాత పారిపోయిన బాజీని అరండల్‌పేట పోలీస్‌లు అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు తర్వాత, ఆధారాలను బట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాం నాయక్ తెలిపారు.
మొత్తంగా.. కేవలం 100 రూపాయల అప్పు చెల్లించమన్నందుకు ఫ్రెండ్‌ను దారుణంగా హత్య చేయడం గుంటూరు జిల్లాలో కలకలం రేపింది. మద్యం మత్తు, క్షణికావేశంలో చేసిన పెద్ద తప్పుకు నిందితుడు ఇప్పుడు ఊచలు లెక్కించాల్సి వస్తోంది. అందుకే.. బీ కేర్‌ఫుల్..
మరిన్ని ఏపీ వార్తల కోసం.. క్లిక్ చేయండి..