AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TDP: ఆయనకు ఈసారి డౌటేనా? టీడీపీ టికెట్ బీసీలకేనా? కర్నూలులో కొత్త లెక్కలు..

తెలుగు రాష్ట్రాల్లోనే దిగ్గజ రాజకీయ కుటుంబానికి చంద్రబాబు షాక్ ఇస్తారా? ఆరు దశాబ్దాల రాజకీయ పరంపరకు బ్రేక్ వేస్తారా? సున్నితమైన సీనియర్‌కు టీడీపీలో పరాభవం తప్పదా? ఉమ్మడి కర్నూలు జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచిన కర్నూలు పార్లమెంట్‌ సీటులో విపక్షపార్టీ వ్యూహమేంటి?

TDP: ఆయనకు ఈసారి డౌటేనా? టీడీపీ టికెట్ బీసీలకేనా? కర్నూలులో కొత్త లెక్కలు..
Chandrababu Naidu
Ram Naramaneni
|

Updated on: Jan 20, 2024 | 6:31 PM

Share

ఆయనుండగా అక్కడ అభ్యర్థి ఎవరన్న మాట ఎప్పుడూ వినలేదు. దశాబ్ధాలుగా ఆ కుటుంబ రాజకీయం నడుస్తున్న చోట.. అభ్యర్థిని వెతుక్కునే పరిస్థితి పార్టీకి రాలేదు. కాంగ్రెస్‌ని వీడాక టీడీపీ గూటికి చేరిన కోట్ల కుటుంబం ఫస్ట్‌ టైమ్‌.. టికెట్‌పై డౌట్‌ పడ్తోంది. కర్నూలు ఎంపీ టికెట్‌పై టీడీపీలో తీవ్ర గందరగోళం ఉంది. ఆరు దశాబ్దాలుగా కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంనుంచి పోటీచేస్తూ వచ్చింది కోట్ల కుటుంబం. కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కోట్ల కోదండరామిరెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కర్నూలు ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు. రెండుసార్లు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్‌రెడ్డికి నిజాయితీపరుడన్న పేరుంది. ఆయన కొడుకు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కూడా కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీలో చేరినప్పట్నించీ కర్నూలు పార్లమెంట్ ఇన్‌ఛార్జిగా ఉన్నారు సూర్యప్రకాశ్‌రెడ్డి. ఈసారి కూడా టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేయాలని కోట్ల ఆశిస్తున్నారు. అయితే కాంగ్రెస్‌లో ఉన్నంత స్వేచ్ఛ లేకపోవడంతో కోట్ల కుటుంబం టీడీపీలో ఇమడలేని పరిస్థితి ఉందంటున్నారు.

కర్నూలు పార్లమెంటు స్థానాన్ని ఈసారి బీసీలకిచ్చే ఆలోచనలో ఉందట టీడీపీ. కోట్లకు టికెట్‌ లేదనుకుంటే బీసీ సామాజికవర్గం నుంచి చాలామంది టికెట్‌ రేసులో ఉన్నారు. ముఖ్యంగా బోయ, కురుబ సామాజికవర్గ నేతల మధ్య టికెట్‌ ఫైట్‌ నడుస్తోంది. బోయ సామాజికవర్గం నుంచి టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు టికెట్ ఆశిస్తున్నారు. అయితే బీటీ గతంలో రెండుసార్లు ఓడిపోవడంతో ఈసారి ఆయనకు టికెట్ అనుమానమే. దీంతో కురుబ నేతలపై ఆశలు పెట్టుకుంది టీడీపీ. ఆదోనికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, కాటన్ మిల్స్ యజమాని బత్తిన లక్ష్మీనారాయణవైపు టీడీపీ మొగ్గు చూపుతోందన్న ప్రచారం జరుగుతోంది. సామాజికంగా బలంగా ఉండటం, ఆర్థికంగా స్థితిమంతుడు కావడంతో .. ఆవిర్భావం నుంచి పార్టీతో ఉన్న బత్తినకు కర్నూలు ఎంపీ టికెట్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ అడిగినంత డిపాజిట్ కూడా చేస్తానని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ద్వారా బత్తిన అధిష్ఠానానికి వర్తమానం పంపినట్లు టాక్‌ నడుస్తోంది.

కురుబ సామాజికవర్గం నుంచే మరొకరి పేరు కూడా వినిపిస్తోంది. ప్రైవేటు హాస్పిటల్ యజమాని డాక్టర్ ప్రసాద్ కూడా టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆయన కూడా ఆర్థికంగా స్థితిమంతుడే కావటంతో బీసీల నుంచి బలమైన అభ్యర్థులు రేసులో కనిపిస్తున్నారు. అయితే డాక్టర్ ప్రసాద్‌ గతంలో వైసీపీ టికెట్ కోసం కూడా ప్రయత్నించినట్లు సమాచారం. మరోవైపు బీసీ ఈక్వేషన్‌లో తమకు అవకాశం ఇస్తారన్న నమ్మకంతో ఉందట కేఈ కుటుంబం. కేఈ ప్రభాకర్, కేఈ శ్యాంబాబు కర్నూలు పార్లమెంటు సీటుతో పాటు, పత్తికొండ అసెంబ్లీ స్థానాన్ని అడుగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి టికెట్ రానిపక్షంలో బోయ లేదా కురుబ సామాజిక వర్గాలకు ఛాన్స్‌ ఇస్తారన్న ప్రచారంలో నిజమెంతో.. తొందర్లోనే తేలనుంది. టికెట్‌ డౌటేనన్న ప్రచారంతో కోట్ల కుటుంబం రియాక్షన్‌ ఎలా ఉంటుందన్నదానిపైనా కర్నూలులో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..