Kshatriya : ఎంపీ రఘురామకృష్ణరాజుకు మద్దతివ్వడంలేదని తేల్చిచెప్పిన క్షత్రియ సేవా సమితి.. ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని స్పష్టీకరణ
Kshatriya Community on RRR : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీరుపై క్షత్రియ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు..
Kshatriya Community on RRR arrest : పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు తీరుపై క్షత్రియ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘురామకృష్ణంరాజు కు క్షత్రియ సేవాసమితి మద్దతు ఇవ్వడం అనేది పూర్తిగా అవాస్తవమని తేల్చిచెప్పారు. గవర్నమెంట్ కు, రఘురామకృష్ణంరాజు కు జరిగే విషయాలను పులుముకోదలుచుకోలేదన్నారు. సోషల్ మీడియా వేదికగా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే ఎట్టిపరిస్థితుల్లో సపోర్ట్ చేయమని తేల్చిచెప్పారు. భీమవరంలో క్షత్రియ సమాఖ్య ముఖ్యనేతలు ఇవాళ భేటీ అయ్యారు. వైఎస్సార్‌సీపీ గుర్తుపై గెలిచి ఆపార్టీ మీదే విమర్శలు చేయడం సరికాదన్న క్షత్రియనేతలు.. ఎంపీ రఘురామ తీరును పూర్తిగా ఖండించారు. క్షత్రియులపై గౌరవంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. నర్సాపురం ఎంపీ నియోజకవర్గంలో 3 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీటు ఇచ్చి గౌరవించారని చెప్పుకొచ్చారు. అరెస్ట్ అయిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు క్షత్రియ సేవాసమితి ఎలాంటి మద్దతు ఇవ్వట్లేదని స్పష్టం చేశారు. ఇది కేవలం ప్రభుత్వానికి, రఘురామకృష్ణరాజుకు సంబంధించిన వ్యవహారమని పేర్కొన్నారు. ఇందులో క్షత్రియ కులాన్ని కలపొద్దని.. తమకు ఎలాంటి సంబంధం లేదన్నారు. రఘురామకృష్ణరాజు స్వలాభం, ఆస్తులు కాపాడుకోవడానికే మాట్లాడుతున్నారని క్షత్రియ నాయకులు దుయ్యబట్టారు. ఈ భేటీలో భీమవరం, పాలకొల్లు, గణపవరం, తణుకు, తాడేపల్లిగూడెం క్షత్రియ నాయకులు పాల్గొన్నారు.