AP News: పాములకు అతడే దేవుడు.. అత్యంత విషపూరితమైన రక్తపింజరను కూడా..!
అతడు పాముల పాలిట దేవుడు.. పాము కనిపిస్తే చంపొద్దు.. తనకు ఫోన్ చేయాలంటాడు.. ఇప్పటికే నల్లమల అటవీ ప్రాంత గ్రామాల్లో వేలాది పాములను సంరక్షించి పర్యావరణ హితాన్ని కాపాడుతూ తన పేరును సార్ధకం చేసుకుంటున్నాడు మల్లికార్జునుడు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని గ్రామాల్లోని..

అతడు పాముల పాలిట దేవుడు.. పాము కనిపిస్తే చంపొద్దు.. తనకు ఫోన్ చేయాలంటాడు.. ఇప్పటికే నల్లమల అటవీ ప్రాంత గ్రామాల్లో వేలాది పాములను సంరక్షించి పర్యావరణ హితాన్ని కాపాడుతూ తన పేరును సార్ధకం చేసుకుంటున్నాడు మల్లికార్జునుడు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ఫారెస్ట్ రేంజ్ పరిధిలోని గ్రామాల్లోని.. జనవాసాల్లోకి.. వచ్చిన పాములను పట్టుకుని అడవిలో వదిలేస్తున్నాడు స్నేక్ క్యాచర్ మల్లికార్జున. జెర్రిపోతు, కొండచిలువ, పూడు పాములతో పాటు, అత్యంత విషపూరితమైన రక్తపింజర, నాగుపాములను పట్టుకుని జనసంచారం లేని దూరప్రాంతంలోని అడవిలో వదిలేస్తాడు. పర్యావరణ సమతుల్యతకు దోహదపడే పాములు జనవాసాల్లోకి వచ్చినప్పుడు వాటిని చంపకుండా, తనకు సమాచారం ఇస్తే పట్టుకుని అడవిలో వదిలేస్తానని, ఇప్పటికే వేలాది సంఖ్యలో వివిధ రకాల పాములను పట్టుకుని అడవిలో వదిలేశానని, తాజాగా పదుల సంఖ్యలో పాములు వచ్చినట్టు గ్రామస్తులు సమాచారం ఇవ్వడంతో వాటిని పట్టుకుని అడవిలో వదిలేసినట్టు మల్లికార్జున చెప్పుకొచ్చాడు.
ఎక్కడ చూసినా పాములే..
పశ్చిమ ప్రకాశం ప్రాంతంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా పాములే కనిపిస్తున్నాయి. ఆహారం కోసమో, మరే ఇతర కారణాలతోనో గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. పొలాల్లో సంచరిస్తూ రైతుల్ని, గ్రామస్థుల్ని హడలెత్తిస్తున్నాయి. దీంతో అటవీ ప్రాంత పరిసరాల్లో నివసిస్తున్న ప్రజలు పాములతో బెంబేలెత్తిపోతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల సంఖ్యలో పాములు కనిపిస్తున్నాయి. పొలం వెళితే పాములే, దుకాణాలలో పాములే, ఆఖరికి ఇళ్లల్లో కూడా పాములే, రోడ్డు మీద నడిచి వెళుతున్నా.. పాములే కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం అటవీ ప్రాంత గ్రామాల్లోని ఇళ్లల్లో, పొలాల్లో ఏదో ఒక్క మూలన నక్కి పాములు కనిపిస్తున్నాయి. ఇక దుకాణాలలో కూడా పాములు దూరుతూ ఉండడంపై ప్రజలు, వ్యాపారులు, రైతులు భయపడిపోతున్నారు. ఈ ప్రాంతంలో కొంతమంది పాముకాటుకు బలైన వారు కూడా ఉన్నారు.
ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అత్యధికంగా ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం ప్రాంతాలలో కొండచిలువలు, నాగుపాములు, రక్తపింజరి పాములు, కట్ల పాములు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అటవీశాఖ అధికారులు వందల సంఖ్యలో పాములను పట్టుకుని సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. గతంలో ఎప్పుడూ కూడా ఇన్ని పాములు చూడలేదని స్థానిక ప్రజలు అంటున్నారు. స్థానికంగా నల్లమల అటవీ ప్రాంతం ఉండడమే ఇన్ని పాములు ఈ ప్రాంతాలలో కనిపించడానికి కారణమని అటవీ శాఖ అధికారులు అంటున్నారు. పట్టుకున్న పాములలో అత్యధికంగా కొండచిలువలు ఉంటున్నాయి. ఈసారి అటవీ ప్రాంతాలలో అత్యధికంగా నీటి నిలువలు పెరగడం వల్లే పాములు జనావాసాల్లోకి వస్తున్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. పాములు కనిపిస్తే చంపకుండా తమకు సమాచారం ఇవ్వాలని వాటిని పట్టుకుని సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అటవీశాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.