కాల్‌మనీ: కర్నూలు జిల్లాలో మళ్లీ వడ్డీ వ్యాపారుల ఆగడాలు.. దంపతుల ఆత్మహత్యాయత్నం..!
మళ్లీ వడ్డీ వ్యాపారులు చెలరేగిపోయాడు. వడ్డీకి తీసుకున్న అధికారి సకాలంలో వడ్డీ, అసలు చెల్లించకపోవడంతో వ్యాపారస్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. డబ్బులు ఇస్తావా.. చస్తావా..
కర్నూలు జిల్లాలో మళ్లీ వడ్డీ వ్యాపారులు చెలరేగిపోయాడు. వడ్డీకి తీసుకున్న అధికారి సకాలంలో వడ్డీ, అసలు చెల్లించకపోవడంతో వ్యాపారస్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. డబ్బులు ఇస్తావా.. చస్తావా.. అంటూ హెచ్చరించడంతో సదరు బాధిత దంపతులిద్దరూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వివరాల్లోకి వెళితే..కర్నూలు రోడ్లు భవనాల శాఖ లో టెక్నికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న రామాంజనేయులు సీ క్యాంప్ సెంటర్ లోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో నివాసముంటున్నారు. రామాంజనేయులు కుటుంబ అవసరాల నిమిత్తం, కూతురు వైద్య చికిత్స కోసం 20 లక్షల రూపాయల వరకు అప్పు చేశాడు. కొన్ని కారణాల వల్ల తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారులు రోజూ ఇంటికి తిరుగుతూ బెదిరింపులకు దిగారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన దంపతులు పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అయితే తాను చనిపోతే ఏడుగురు వడ్డీ వ్యాపారస్తులు బాధ్యత వహించాలంటూ రామాంజనేయులు సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు.
గమనించిన స్థానికులు వెంటనే వారిని 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ దంపతులు కోలుకుంటున్నారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దంపతులను పలువురు టీడీపీ నేతలు పరామర్శించారు.
కాగా, గత కొన్ని రోజుల కిందట ఏపీలో ఇలాంటి వడ్డీ వ్యాపారుల అగడాలు తీవ్రమవుతున్న తరుణంలో పోలీసులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. అప్పటి నుంచి వడ్డీ వ్యాపారులు ఆగడాలు తగ్గుముఖం పట్టగా, తాజాగా మళ్లీ రెచ్చిపోవడం తీవ్ర కలకలం రేపుతోంది. ఇలాంటి వారి నుంచి తమను రక్షించాలని దంపతులిద్దరు వేడుకుంటున్నారు.