Andhra Pradesh: ఆంధ్రా బీజేపీలో ‘కన్నా’ ప్రకంపనలు.. రాష్ట్ర నాయకత్వంపై కొనసాగుతున్న ఫిర్యాదులు..
కుదిరితే బీజేపీ నాయకత్వం మార్చండి... లేదంటే పార్టీ అనుసరిస్తున్న విధానాలు అయినా మార్చండి అంటూ తాజాగా ఢిల్లీకి వెళ్లి మరీ ఫిర్యాదులు చేశారు అసమ్మతి నేతలు..
ఆంధ్రా బీజేపీలో కన్నాలక్ష్మీనారాయణ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. బీజేపీ రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు గుప్పించి పార్టీని వీడిన కన్నా .. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే అటు బీజేపీలో ఇంకా అసంతృప్తులు తమ స్వరాలను వినిపిస్తూనే ఉన్నారు. ‘కుదిరితే ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకత్వం మార్చండి… లేదంటే పార్టీ అనుసరిస్తున్న విధానాలు అయినా మార్చండి’ అంటూ తాజాగా ఢిల్లీకి వెళ్లి మరీ ఫిర్యాదులు చేశారు అసమ్మతి నేతలు. పార్టీ ఇంఛార్జ్ మురళీధరన్ నుంచి భరోసా ఎంత ఉందో కానీ.. బీజేపీలో సీనియర్ల తనతో టచ్‌లో ఉన్నారని కన్నా చేసిన వ్యాఖ్యలు మాత్రం రాష్ట్ర బీజేపీలో పెను సంచలనంగా మారాయి.
అయితే కన్నా టీడీపీలో చేరుతున్న సమయంలో కూడా ఏపీ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడ్డాయి. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జిల్లాలకు చెందిన నేతలు ఢిల్లీలో కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మురళీధరన్‌తో సమావేశమయ్యారు. నాయకత్వాన్ని మార్చకపోయినా కనీసం పార్టీ తీరు మారాలని మురళీధరన్‌కు విజ్ఞప్తి చేశారు. సోము వీర్రాజు పనితీరుపైనే ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు.
కాగా, మాజీ మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరారు. చంద్రబాబు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హుందాతనంతో పాటు నిబద్ధత కలిగిన నాయకుడిగా కన్నా లక్ష్మీనారాయణకు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉందన్నారు చంద్రబాబు. అటు రాష్ట్రంలోని రాక్షస పాలనను పారదోలేందుకు ప్రజాస్వామ్య వాదులందరూ ఒక్కటి కావాల్సిన అవసరం ఉందన్నారు కన్నా. అయితే టీడీపీలో చేరడానికి ముందు బీజేపీ సీనియర్లు చాలామంది టచ్‌లో ఉన్నారంటూ కన్నా చేసిన వ్యాఖ్యలు ఏపీ బీజేపీలో కలకలం రేపాయి. మరోవైపు కన్నా చేరిన హైలో టీడీపీ ఉంటే.. అంత ప్రాధాన్యత లేదంటోంది వైసీపీ. తిన్నంటివాసాల లెక్కపెట్టి, బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేసేవాళ్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు అంబటి రాంబాబు. వృద్ద సింహాలు అన్నీ ఒకచోట చేరాయన్నారు కొడాలి.
https://tv9telugu.com/tag/andhra-pradesh