AP Elections: ఉండి రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో శివరామరాజు
పశ్చిమగోదావరి జిల్లా ఉండి పాలిటిక్స్‌లో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. టీడీపీకి షాకిస్తూ శివరామరాజు.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తుండడం హాట్‌టాపిక్‌గా మారింది.
ఏపీలో ఎన్నికల రాజకీయం వాడీవేడిగా కొనసాగుతోంది. నామినేషన్ల పర్వం, స్క్రూట్నీ వ్యవహారం ముగియడంతో ఎవరు బరిలో ఉంటున్నారు.. ఎవరు బరిలో ఉండడంలేదు.. అనే విషయాలపై క్లారిటీ వచ్చేసింది. ఆయా నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేస్తున్నారో రిటర్నింగ్ ఆఫీసన్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే.. పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో ఆసక్తికర అంశంపై తెరపైకి వచ్చింది. ప్రధానంగా.. నామినేషన్ల పర్వం ముగిసినా పశ్చిమగోదావరి జిల్లా ఉండి టీడీపీలో రచ్చ కొనసాగుతూనే ఉంది. టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు.
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి సింహం గుర్తుపై పోటీ చేస్తున్న శివరామరాజు.. ఆ మేరకు ఓట్లను ఆభ్యర్థించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వాస్తవానికి.. ఉండి టికెట్‌ను మొదట్లో శివరామరాజుకే కేటాయించింది టీడీపీ అధిష్ఠానం. కానీ.. మారిన రాజకీయ పరిణామాలతో ఉండి టీడీపీ టిక్కెట్ రఘురామకృష్ణరాజుకు కేటాయించింది అధిష్టానం. ఆ వెంటనే.. శివరామరాజుకి టీడీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. అయితే.. చంద్రబాబు నిర్ణయంపై శివరామరాజు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దాంతో.. చంద్రబాబు బుజ్జగించే ప్రయత్నాలు చేశారు.
అటు.. రఘురామకృష్ణరాజు కూడా శివరామరాజును కలిసి ఎన్నికల్లో సహకరించాలని కోరారు. అయితే..ఆయా పరిణామాలన్నీంటిని గమనిస్తూ వచ్చిన శివరామరాజు.. ఉండి నియోజకవర్గంలోని గ్రామాల్లో అభిప్రాయ సేకరణ జరిపారు. రిపోర్ట్ అనుకూలంగా రావడంతో తగ్గేదేలేదు అనుకున్నారు. చివరికి.. టీడీపీ అధినేత చంద్రబాబు బుజ్జగించినా వెనక్కి తగ్గలేదు శివరామరాజు. ఈ క్రమంలోనే.. ఫైనల్‌గా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చి ఎన్నికల బరిలో తాడోపేడో తేల్చుకోవాలని ఫిక్స్ అయ్యారు. ఎట్టకేలకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి నామినేషన్ వేసి టీడీపీకి షాకిచ్చారు శివరామరాజు. ఈ నేపథ్యంలో.. అసెంబ్లీ ఎన్నికల్లో ఉండి ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…