Video: ఛీ వ్యాక్.. ఇది చూస్తే తిన్నది కూడా బయటికొస్తుంది.. మీరు వాడుతున్న నూనె మంచిదేనా..
కాకినాడ జిల్లా ధర్మవరంలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ నూనె ముఠా గుట్టు రట్టయింది. జంతువుల కొవ్వు, క్రూడ్ ఆయిల్‌తో విషతుల్యమైన వంట నూనె తయారు చేస్తున్న కేంద్రాన్ని పోలీసులు సీజ్ చేశారు. 840 కిలోల కల్తీ నూనెను స్వాధీనం చేసుకున్నారు. ప్రజారోగ్యానికి హానికరమైన ఈ అక్రమ దందాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి, ఇలాంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీ నూనె ముఠా గుట్టు రట్టయింది. జంతువుల కొవ్వు, క్రూడ్ ఆయిల్ కలగలిపి. విషతుల్యమైన వంట నూనెను తయారు చేస్తున్న ఘరానా మోసం కాకినాడ జిల్లాలో వెలుగు చూసింది. ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ అక్రమ దందాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. అసలు ఈ కల్తీ నూనె ఎలా తయారవుతోంది? ఈ మాఫియా వెనుక ఉన్నదెవరు?
ఈ సంఘటన చూస్తే.. మనం నిత్యం వంటల్లో వాడుతున్న నూనె ఎంత వరకు సురక్షితం అనే అనుమానం కలగకమానదు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ధర్మవరంలో కల్తీ నూనె తయారీ కేంద్రం కలకలం రేపింది. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాల మేరకు, పక్కా సమాచారంతో ప్రత్తిపాడు ఎస్ఐ లక్ష్మీకాంతం తన సిబ్బందితో కలిసి ధర్మవరం నేషనల్ హైవే సమీపంలోని ఓ రేకుల షెడ్డుపై ఆకస్మిక దాడి చేశారు. అక్కడ జరుగుతున్న తంతు చూసి పోలీసులే అవాక్కయ్యారు.
పిఠాపురం మండలం ఎఫ్.కే పాలెంకు చెందిన బండారు ఫణి ప్రసాద్ అనే వ్యక్తి. ప్రతాప్ సింగ్ అనే వ్యక్తికి చెందిన షెడ్డును అద్దెకు తీసుకుని ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నాడు. జంతువుల కొవ్వును, తక్కువ ధరకు దొరికే క్రూడ్ ఆయిల్‌ను మరిగించి, అచ్చం వంట నూనెలా మార్చి మార్కెట్లోకి తరలిస్తున్నాడు. పిఠాపురం, కాకినాడ ప్రాంతాల నుండి ముడి సరుకులు తెప్పించి. ఇక్కడ నూనెగా మార్చి ఇచ్ఛాపురం, రాజమండ్రి ప్రాంతాల్లోని వ్యాపారులకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఘటనా స్థలంలో దాదాపు 840 కిలోల (56 డబ్బాల) తయారీ చేసిన కల్తీ నూనెను, 60 కిలోల క్రూడ్ ఆయిల్‌ను పోలీసులు సీజ్ చేశారు. ప్రజారోగ్యానికి హానికరమైన కల్తీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. నిందితులను అదుపులోకి తీసుకొని పీఎస్‌కు తరలించారు.
వీడియో చూడండి..
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
