Andhra Pradesh: కడప విద్యార్థిని సత్తా.. రూ.1.70 కోట్ల వార్షిక వేతనంతో అమెరికాలో కొలువు
చెమటోడ్చి కష్టపడి ఫలితం ఏనాటికైనా తిరిగొస్తుందని ఓ యువతి నిరూపించింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం పొందడం అంత సులువుకాదు. అటువంటి వారందరికీ ఈ యువతి రోల్ మోడల్‌గా నిలిచింది. తొలి ప్రయత్నంలోనే కళ్లు చెదిరే ప్యాకేజీతో అగ్రరాజ్యం అమెరికాలో కొలువు దక్కించుకుంది ఏపీ చెందిన ఎర్రనాగుల అమృతవల్లి. ఏకంగా కోట్ల రూపాయల వార్షిక వేతనంతో ఆమెరికాలోని ప్రసిద్ధ కంపెనీలో..
కడప, సెప్టెంబర్ 1: చెమటోడ్చి కష్టపడి ఫలితం ఏనాటికైనా తిరిగొస్తుందని ఓ యువతి నిరూపించింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం పొందడం అంత సులువుకాదు. అటువంటి వారందరికీ ఈ యువతి రోల్ మోడల్‌గా నిలిచింది. తొలి ప్రయత్నంలోనే కళ్లు చెదిరే ప్యాకేజీతో అగ్రరాజ్యం అమెరికాలో కొలువు దక్కించుకుంది ఏపీ చెందిన ఎర్రనాగుల అమృతవల్లి. ఏకంగా కోట్ల రూపాయల వార్షిక వేతనంతో ఆమెరికాలోని ప్రసిద్ధ కంపెనీలో సాఫ్ట్‌వేర్ కొలువు దక్కించుకుంది. వివరాల్లోకెళ్తే..
ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన ఎర్రనాగుల అమృతవల్లిది ఓ మధ్యతరగతి కుటుంబం. విజయవాడలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. ఐఐటీ జేఈఈ పరీక్షలో ప్రతిభ చూపినప్పటికీ త్రుటిలో ఐఐటీలో సీటు చేజారింది. అయినా నిరాశ చెందక ఎన్ఐటీ దుర్గాపూర్‌లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌లో చేరింది. అక్కడే బీటెక్ పూర్తి చేసిన అమృతవల్లి.. అమృతవల్లిఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లింది.
యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడాలో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్‌లో ఎంఎస్ పూర్తి చేసింది. డిగ్రీ చేతికొచ్చిన నెల రోజుల్లోనే ప్రముఖ సంస్థ అయిన అమెజాన్‌లో కొలువు దక్కించుకుంది. వాషింగ్టన్‌లోని సియాటెల్‌లో అమెజాన్ కేంద్ర కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్‌గా ఏడాదికి రూ.1.70 కోట్ల వార్షిక వేతనంతో జాబ్ కౌవసం చేసుకుంది. తమ కుమార్తెకు భారీ ప్యాకెజీతో ఉద్యోగం రావడంపై ఆమె తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమృతవల్లికి ఉపాధ్యాయులు, బంధువులు అభినందనలు తెలియజేశారు. చిన్నప్పటి నుంచి చదువులో చురుకుగా ఉండేదని, ఆమె ప్రతిభకు మంచి ప్రతిఫలం దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు.