- Telugu News Photo Gallery Cm chandrababus review of heavy rains floods and the current situation in the districts
Andhra Pradesh: 50 ఏళ్లలో ఎన్నడూ చూడని బీభత్సం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. అటుఏపీలో కురుస్తున్న కుండపోత వర్షాల నేపథ్యంలో జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీఎస్, డీజీపీ, మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది కూడా కలగకూడదున్నారు సీఎం చంద్రబాబు. అధికారులు బాధ్యతలు నిర్వర్తించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యేలతో కలసి మంత్రులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని చంద్రబాబు ఆదేశించారు.
Updated on: Sep 01, 2024 | 2:31 PM

ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికార యంత్రాగాన్ని సీఎం ఆదేశించారు. బుడమేరు వరదే ముంపునకు కారణమని CM దృష్టికి తెచ్చారు మంత్రి నారాయణ. వరదలపై ఇరిగేషన్ సహా ఇతర శాఖల అధికారులతో మాట్లాడాలని సీఎం ఆయనకు సూచించారు. వరద తగ్గిన తర్వాత ఆస్తి, పంటనష్టం వివరాలు సేకరించాలన్నారు. దెబ్బతిన్న పంటల వివరాలను డ్రోన్ల ద్వారా అంచనా వేయాలన్నీరు చంద్రబాబు. దెబ్బతిన్న ఇళ్లు, పశునష్టాన్ని మదింపు చేయాలన్నారు. నష్టాన్ని అంచనావేసి కేంద్రప్రభుత్వానికి పంపాలని CM సూచించారు. రైతులకు, రైతు కుటుంబాలకు వెంటనే సాయం అందించాలన్నారు.

ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలని డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఉత్తరాంధ్ర, కోస్తాపై వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. రెండ్రోజులుగా కురుస్తున్న వర్షాలకు విజయవాడ, గుంటూరులో 10 మంది మృతిచెందడం బాధాకరం. అధికార యంత్రాంగంతో పాటు.. జనసేన నేతలు, కార్యకర్తలు కూడా వరద సహాయక చర్యల్లో తమ వంతు సాయపడాలి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు.

భారీ వర్షాల వల్ల వరద ముంపునకు గురైన మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు మంత్రి నారా లోకేష్. బాధితులను కలిసి పరామర్శించారు. వారితో మాట్లాడారు. వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అన్ని విధాలుగా ఆదుకుంటామంటూ భరోసా ఇచ్చారు.అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. పరిస్థితులకు గల కారణాలపై ఆరా తీశారు. అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

తేలికపాటి జల్లులు పడుతున్నప్పటికీ వర్షంలోనే బాధితులను పరామర్శించడానికి బయల్దేరారు నారా లోకేష్. స్థానిక నాయకులతో కలిసి ముంపు గ్రామాలను సందర్శించారు. జలమయమైన వీధుల్లో కాలినడక పర్యటిస్తూ ప్రజల్ని పలకరించారు. బాధితులను ఆదుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలంటూ అక్కడికక్కడే అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు

అటు, గుడ్లవల్లేరు ఘటనపై కూడా మంత్రి లోకేష్ స్పందించారు. జరిగిన ఘటనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కరెంట్ బల్బును చూపించి కెమెరా అంటున్నారని మండిపడ్డారు. విద్యార్థుల వీడియోలు బయటకు వచ్చాయంటున్నారు. కానీ, నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టామని చెప్పారు మంత్రి లోకేష్. నివేదిక వచ్చిన తరువాత కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థుల భవిష్యత్ కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు.
