ఆర్చరీలో 57 పతకాలు సాధించిన కడప కుర్రాడు.. అంతర్జాతీయ పోటీలకు సాయం కోసం ఎదురుచూపులు
పేద కుటుంబంలో పుట్టి ఆర్చరీ పట్ల ఆసక్తితో జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిదాకా ఎదిగి పదిహేనేళ్ళ వయస్సుకే 57 పతకాలు అందులో 31 బంగారు పతకాలు సాధించాడు అతను. కానీ ఈ అభినవ ఏకలవ్యుడికి ఆర్థిక స్తోమత లేక అమెరికాలో జరిగే అంతర్జాతీయ ఆర్చరీ పోటీలకు స్పాన్సర్స్ కోసం ఎదురుచూస్తున్నాడు.

పేద కుటుంబంలో పుట్టి ఆర్చరీ పట్ల ఆసక్తితో జిల్లా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి దాకా ఎదిగి పదిహేనేళ్ళ వయస్సుకే 57 పతకాలు అందులో 31 బంగారు పతకాలు సాధించాడు అతను. కానీ ఈ అభినవ ఏకలవ్యుడికి ఆర్థిక స్తోమత లేక అమెరికాలో జరిగే అంతర్జాతీయ ఆర్చరీ పోటీలకు స్పాన్సర్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే ఉన్న ఆస్తులన్ని అమ్మి తమ బిడ్డను ఈ స్థాయికి తీసుకొచ్చిన తల్లిదండ్రులు ఇక స్థోమత లేక ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరగలేక నిరాశతో స్పాన్సర్స్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. ఎంతకీ ఎవరూ ఆ యువకుడు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.
కడపకు చెందిన వెంకటసాయి శ్రీనివాస్ ఓ ప్రయివేటు స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. అయిదేళ్ల వయస్సులోనే ఆర్చరీ ఆటపై మక్కువ చూపాడు. ఆర్చరీపై తన కుమారుడికి ఉన్న ఆసక్తిని గుర్తించిన తల్లి.. కడపలోని ఓ విలువిద్య శిక్షణా అకాడమీలో చేర్పించింది. తల్లి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అనుకున్న సమయం కంటే ఎక్కుసేపు సాధన చేస్తూ.. జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో 57 పతకాలు సాధించాడు వెంకటసాయి. కానీ అమెరికాలో జరగబోతున్న ఆర్చరీ పోటీల్లో పాల్గొనేందుకు స్తోమత లేక నానా అవస్థలు పడుతున్నాడు. దాతలు ముందుకొచ్చి తమ బిడ్డకు తోడుగా నిలవాలని వేడుకుంటున్నారు వెంకట సాయి శ్రీనివాస్ తల్లి దండ్రులు.




వెంకటసాయి శ్రీనివాస్ రికార్డులు
ఇప్పటి వరకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో 57 పతకాలలో 31 స్వర్ణాలు,13 వెండి, 13 కాంస్య పతకాలు సాధించి తనదైన రికార్డు సొంతం చేసుకున్నాడు వెంకటసాయి. 2015 నుంచి ఫీల్డ్ ఆర్చరీ వైపు అడుగులు వేసి అంతర్జాతీయ పోటీల్లో రెండు బంగారు పతకాలు, జాతీయ స్థాయి పోటీల్లో 29 బంగారు, 13 రజతం, 13 కాంస్య పతకాలు సాధించాడు. 2019 ఏప్రిల్ 8 నుంచి 12వ తేదీ వరకు న్యూజిలాండ్‌లో జరిగిన ప్రపంచ ఇండోర్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్న శ్రీనివాస్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు. 350 మంది క్రీడాకారులు పాల్గొన్న గేమ్ లో భారత్ తరపున 13 ఏళ్ల వయసు, 10 మీటర్ల దూరం విభాగంలో ఈ ఘనత సాధించాడు. వీటితోపాటు 2019 సెప్టెంబరు 6 నుంచి 8 వరకు ముంబాయిలో జరిగిన జాతీయ ఇండోర్ ఫీల్డ్ అర్చరీ ముంబాయి మేయర్ కప్ పోటీల్లో నాలుగు బంగారు పతకాలు సాధించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పిల్లాడిది పెద్ద కథే ఉంది. ఇంతటి ప్రతిభ గల క్రీడాకారుడికి ప్రభుత్వం నుంచి గానీ, శాప్ నుంచి గానీ ఎలాంటి ఆర్థికపరమైన ప్రోత్సాహం అందకపోవడంతో నిస్సహాయంగా చూస్తున్నారు.
ఆస్తులు, బంగారం అమ్మి శిక్షణ
కుమారుడి విలువిద్య పోటీల కోసం ఇంటిని, బంగారాన్ని తాకట్టు పెట్టి.. పోటీలకు సిద్ధం చేశారు . మరో ఆరు నెలల్లో అమెరికాలో జరిగే ప్రపంచ ఆర్చరీ పోటీలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆర్థిక స్తోమత లేక స్పాన్సర్లు, ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారు. అయిదేళ్లలోనే ఆటపై దృష్టి సారించిన వెంకట సాయి శ్రీనివాస్ మూడో తరగతి నుంచే విలువిద్యపై సాధన చేస్తున్నాడు. నాన్న పీవీ గోపినాథ్ ఇంటర్నెట్ సెంటర్ నడుపుతున్నారు. సాయి శ్రీనివాస్ అయిదేళ్ల వయసులోనే తల్లిదండ్రులు, తాతయ్య ప్రోత్సాహంతో క్రీడారంగం వైపు అడుగులేశాడు. 2014లో తొలిసారిగా మార్షల్ ఆర్ట్స్‌లో సాధన చేయడం మొదలుపెట్టాడు. ఫీల్డ్ ఆర్చరీ శిక్షకుడు వర్ధి ఉదయ్ కుమార్ వద్ద మెరుగైన శిక్షణ తీసుకొని పతకాల వేట మొదలు పెట్టాడు. శ్రీనివాస్ చదువుతున్న స్కూలు వారు కూడా ఆర్చరీపై అతనికి ఉన్న మక్కువ చూసి ప్రోత్సహించి కొంత వరకు సాయం చేసింది. ప్రభుత్వం, శాప్ అధికారులు ఇలాంటి వారిని ప్రోత్సహిస్తే మన దేశానికి గర్వకారణంగా నిలుస్తారు . ఇంత టాలెంట్ ఉన్న క్రీడాకారుడికి ఏ దాత అయినా ముందుకు వచ్చి సాయం చేస్తే అమెరికాలో జరగబోయే అంతర్జాతీయ విలువిద్య క్రీడలలో మన దేశానికి బంగారు పతకాల పంట పండటం ఖాయమనే కనిపిస్తోంది.