AP Politics: తగ్గేదే లే అంటున్న తాడిపత్రి రాజకీయాలు.. మళ్లీ కత్తులు నూరుకుంటున్న జేసీ, పెద్దారెడ్డి వర్గాలు

AP Politics: తగ్గేదే లే అంటున్న తాడిపత్రి రాజకీయాలు.. మళ్లీ కత్తులు నూరుకుంటున్న జేసీ, పెద్దారెడ్డి వర్గాలు
Jc Prabhaker Reddy Vs Kethireddy Pedda Reddy

Tadipatri Politics: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయమంతా ఓ లెక్క... అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం మరో లెక్క. అక్కడ జేసీ వర్గానికి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.

Janardhan Veluru

|

Jan 07, 2022 | 4:05 PM

JC Vs Peddareddy: ఏపీ రాజకీయమంతా ఓ లెక్క… అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయం మరో లెక్క. అక్కడ జేసీ వర్గానికి, కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే, ఈ మధ్య కాస్త కూలైనట్టు కనిపించిన రెండు వర్గాలు..  మరోసారి కయ్యానికి కాలు దువ్వుకుంటున్నాయి. గతంలో రెండు వర్గాల మధ్య రగడ రాజకీయ అంశాలకు పరిమితమైనా… ఈసారి కోట్ల విలువ చేసే భూముల చుట్టూ తిరుగుతోంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి భూకబ్జాలు చేస్తున్నారంటూ జిల్లా కలెక్టర్‌కు జేసీ ఫిర్యాదు చేయడంతో తాడిపత్రి రాజకీయాల్లో కలకలం రేపుతోంది.

ఆర్జీవీ, పూరి జగన్నాథ్‌… మాఫియా మూవీలను మిక్సీలో వేసి తీస్తే.. అలాంటి సీన్లన్నీ తాడిపత్రిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దిరెడ్డి మధ్య కనిపిస్తాయి. దాదాపు నాలుగున్నర దశాబ్ధాలుగా తాడిపత్రిని తమ ఆధీనంలో పెట్టుకున్న జేసీ బ్రదర్స్ కు 2019ఎన్నికల్లో పెద్దారెడ్డి షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచి జేసీకి సవాల్‌ విసిరారు. అప్పట్నుంచి, ఇద్దరూ ఢీ అంటే ఢీ అంటున్నారు. ఏడాది క్రితం ఎమ్మెల్యే పెద్దారెడ్డి నేరుగా జేసీ ఇంటికే వెళ్లడం… అగ్గికి ఆజ్యం పోసినట్టయ్యింది. ప్రాణం నష్టం జరగకుండా.. జరగాల్సిన రచ్చ జరిగింది. ఆ తరువాత మున్సిపల్ ఎన్నికల సందర్భంగానూ ఇలాంటి సీన్లే కనిపించాయి. అయితే, స్థానికంగా పట్టు నిలుపుకొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి… మున్సిపల్‌ చైర్మన్‌ స్థానంలో కూర్చున్నారు.

అంతా సైలెంట్ అయ్యిందనుకున్న వేళ… తగ్గేదేలె అన్నట్టుగా పెద్దారెడ్డిపై జేసీ మరోసారి యుద్ధానికి సిద్ధమయ్యారు. మున్సిపల్ స్థలాలు, ప్రభుత్వ స్థలాలు, దళితులకు ఇచ్చిన భూములు కబ్జా చేస్తున్నారంటూ… ఎమ్మెల్యే పెద్దారెడ్డిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే, ఎంక్వైరీ కోసం కలెక్టర్‌ 15రోజులు టైం అడగడంతో వెనక్కి వచ్చిన జేసీ… 15 రోజులంటే 15 రోజులు… అప్పటి లోగా చర్యలు తీసుకోకుంటే ఆ భూముల్లో జెండాలు పాతేస్తామని వార్నింగ్‌ ఇచ్చారు. ఆ భూముల్ని దళితులకు, గిరిజనులకు పంచేస్తామన్నారు.

జేసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాక… రెండు రోజుల గ్యాప్ ఇచ్చిన పెద్దా రెడ్డి తన మార్క్ రాజకీయం చూపించారు. ఇక్కడ మీ లెక్కలు కూడా ఉన్నాయంటూ… జేసీపై ఆరోపణలు గుప్పించారు. జేసీ వర్గం కబ్జా చేసిన స్థలాలపై ఇంకా లెక్కలు తీయాల్సి ఉందని పెద్దారెడ్డి వర్గం చెబుతోంది. మొత్తానికి జేసీ, పెద్దారెడ్డి సవాళ్లు, ప్రతిసవాళ్లతో మరోసారి తాడిపత్రి రాజకీయం వేడెక్కింది.  జేసీ ఒకడుగు ముందుకేస్తే.. పెద్దారెడ్డి వర్గం రెండడుగులు దూకేందుకు ప్లాన్‌ చేస్తోంది.

రెండు వర్గాలు కత్తులు నూరుతుండటంతో తాడిపత్రి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తాజా పరిణామాలతో నియోజకవర్గంలో మళ్లీ  కుంపటి రగిలే పరిస్థితులు ఉన్నట్లు చెబుతున్నారు. మొత్తానికి తగ్గేదే లే అంటున్న తాడిపత్రి రాజకీయాలు.. జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారాయి. తాజా పరిణామాలు ఏ మలుపు తీసుకుంటాయో చూడాలి..

Also Read..

Pawan Kalyan: పంజాబ్ ఘటన దురదృష్టకరం.. ప్రధాని మోడీ భద్రతలో వైఫల్యంపై పవన్ కామెంట్స్..

Hyderabad: ఉప్పల్‌లో దారుణం.. కన్నకొడుకుపైనే తండ్రి లైంగిక వేధింపులు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu