Pawan Kalyan: ప్రజాక్షేమం కోరుకునేవాళ్లకే ప్రజల మద్దతు.. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ దీక్షలో పవన్ కళ్యాణ్

Janasena Deeksha: ఉక్కుపోరాటం ఉద్ధృతం చేశారు జనసేనాని. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం చేపట్టిన 7 గంటల దీక్ష ముగిసింది.

Pawan Kalyan: ప్రజాక్షేమం కోరుకునేవాళ్లకే ప్రజల మద్దతు.. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ దీక్షలో పవన్ కళ్యాణ్
Pawan Kalyan Deeksha
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 12, 2021 | 6:08 PM

Pawan Kalyan Visakha Steel Plant support Deeksha: ప్రజాక్షేమం కోరుకునేవాళ్లకే ప్రజల మద్దతు ఉంటుందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించొద్దంటూ జననేనాని పవన్‌కల్యాణ్ చేపట్టిన సంఘీభావ దీక్ష ముగిసింది. ఆయనకు జేఏసీ నేతలు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ అఖిలపక్షాన్ని ఏపీ ప్రభుత్వం ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. పదవులు ఆశించకుండా సేవలు చేస్తేనే ప్రజలు ఆదరిస్తారన్నారు. తాము ప్రజాక్షేమం కోరుకునేవాళ్లమన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వ పాలసీలు బాగోలేనప్పుడు ఖచ్చితంగా మాట్లాడతామని తెగేసి చెప్పారు జనసేనాని పవన్.

ఉక్కుపోరాటం ఉద్ధృతం చేశారు జనసేనాని. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం చేపట్టిన 7 గంటల దీక్ష ముగిసింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభుత్వ స్పందన సరిగా లేదని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. గతంలోనూ విశాఖలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అప్పడు ప్రభుత్వానికి వారం రోజుల డెడ్‌లైన్ విధించారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో దీక్షకు దిగారు. దీక్షకు కూర్చునే ముందు పవన్ కళ్యాణ్ శ్రమదానం చేశారు. రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిని నిరసిస్తూ.. గుంతలు పూడ్చారు. వడ్డేశ్వరంలో స్వయంగా పారపట్టి.. కంకర పోశారు.

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం ఉదయం మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో ఆదివారం ఉదయం సంఘీభావ దీక్ష చేపట్టారు. సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం జగన్‌ స్పందించాలని పవన్ డిమాండ్‌ చేశారు. అంతకుముందు ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అమర జవాన్లకు పవన్ నివాళులర్పించారు. అలాగే విశాఖ ఉక్కు సాధన కోసం ప్రాణాలర్పించిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. దీక్ష విరమించిన అనంతరం పవన్ కల్యాణ్ ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి ఒకటే రాజధానిగా ఉండాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. వ్యక్తిగత విమర్శలకు దిగడం తమ ఉద్దేశం కాదన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం 150 మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ప్రైవేటీకరణ అంటే పోరాటానికి విలువ లేకుండా చేయడం ఓట్లు వేసి గెలిపించకపోయినా ప్రజల కోసం నిలబడ్డామని పవన్ పేర్కొన్నారు.