“జన సైనికులూ బీ అలర్ట్..! మీరు ఇబ్బందుల్లో పడొద్దు..పార్టీని ఇబ్బందుల్లో పెట్టోదు”: పవన్ కల్యాణ్
"జన సైనికులూ బీ అలర్ట్.." "మీరు ఇబ్బందుల్లో పడొద్దు.. పార్టీని ఇబ్బందుల్లో పెట్టోదు". ఇవీ.. పార్టీ నేతలకు పవన్ కల్యాణ్ ఉపదేశించిన వ్యాఖ్యలు. ఇంతకూ జనసేన నేతలను పార్టీ అధినేత అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది..? మచిలీపట్నం వ్యవహారంపై పవన్ కల్యాణ్ వాదన ఏంటి..?

“జన సైనికులూ బీ అలర్ట్..” “మీరు ఇబ్బందుల్లో పడొద్దు.. పార్టీని ఇబ్బందుల్లో పెట్టోదు”. ఇవీ.. పార్టీ నేతలకు పవన్ కల్యాణ్ ఉపదేశించిన వ్యాఖ్యలు. రాష్ట్రంలో అభివృద్ధి దిశగా సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయని ఆరోపించారు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఈ మేరకు పార్టీ కార్యకర్తలను అప్రమత్తం చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఇలాంటి కుట్రలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్న పవన్ కల్యాణ్.. సోషల్ మీడియా ముసుగులో, యూట్యూబ్ ఛానళ్ల పేరుతోనో, మరో మార్గంలోనో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. కుయుక్తులతో సమాజంలో అశాంతి, అభద్రత కలిగించే వ్యక్తుల నైజాన్ని పదేళ్లుగా చూస్తున్నామని.. వారి ఉచ్చులో పడి, ఆవేశాలకు లోనై, ఘర్షణ వాతావారణానికి తావీయవద్దని పార్టీ శ్రేణులకు సూచించారు. అలా ఆవేశాలు ప్రదర్శిస్తే కుట్రదారులు ఆశించిన ప్రయోజనాలు నెరవేరుతాయన్నారు.
రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న కుట్రలకు ఇటీవల మచిలీపట్నంలో జరిగిన ఘటనలే ఉదాహరణ అని చెప్పారు పవన్ కల్యాణ్. ఓ యూట్యూబ్ ఛానెల్‌లో ఒక వ్యక్తి అభ్యంతరకర భాష ఉపయోగించి మాట్లాడాడని.. అతను ఆ విధంగా మాట్లాడేలా సిద్ధం చేసి, ప్రచారం చేయడం వెనక ఉన్న కుట్ర ఆలోచనను పసిగట్టాలని చెప్పారు. అలాంటి వ్యవహారాల్లో చట్ట ప్రకారం కేసులు పెట్టి ముందుకు వెళ్లాలి తప్ప.. తొందరపడి మరో మార్గంలో వెళ్లి ఘర్షణ పడటం ద్వారా సమస్య జటిలం అవుతుందని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లోనే ప్రజల మధ్య సామరస్య వాతావరణం చెడగొట్టి రెచ్చగొట్టే నాయకులు బయటకు వస్తారని అన్నారు పవన్. కులాలు, మతాల మధ్య విభేదాలు తీసుకువచ్చే విధంగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా ఫిర్యాదు చేయాలని స్పష్టం చేశారు జనసేన అధినేత. ఆ దిశగా ముందుకు వెళ్లాలని జనసేన నాయకులు, శ్రేణులతోపాటు కూటమి నాయకులకు సూచించారు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్ రూపంలోనూ, విశ్లేషకుల ముసుగులోనూ రెచ్చగొట్టే వారిని, అభ్యంతరకర రీతిలో మాట్లాడేవారిని చట్టం ముందు నిలపాలని చెప్పారు. వారి వెనక ఉండి వ్యవస్థీకృతంగా రెచ్చగొట్టి కుట్రలు చేసేవారిపైనా ఫిర్యాదు చేసి కేసులు నమోదు చేయించాలన్నారు.
ఇటీవల మచిలీపట్నంలోని సత్రంపాలెంకు చెందిన గిరిధర్ అనే వ్యక్తి..సోషల్ మీడియాలో పవన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అతడిపై దాడి చేశారు జనసేన నేతలు. మాజీ సీఎం జగన్ సహా వైసీపీ నేతలు అతడికి సంఘీభావం ప్రకటించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా రచ్చ రేపింది. దీంతో ఈ వివాదంపై పార్టీలో అంతర్గత విచారణ చేయాలని నాయకులకి ఆదేశాలు ఇచ్చానట్టు చెప్పారు పవన్ కల్యాణ్. ఈ ఘటనలో పాలుపంచుకున్న వారికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలన్నారు. ఈ నేపథ్యంలో కుట్రలు చేసే పార్టీ పట్ల, ఆ పార్టీ నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలాగే వారు చేసే దుష్ప్రచారాన్ని ప్రజాస్వామ్యయుతంగా, చట్ట ప్రకారమే తిప్పికొడదామని పార్టీ శ్రేణులకు పవన్ కల్యాణ్ సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
